అతడు తూర్పు ఆమె పడమర

వారు కలిసిన రోజు అద్భుతమే,
అవును అసలు వారు విడిపోయిన రోజేది ?
వారు కలసి జీవించని రోజేది?

సాయంత్రపు వేళ
ఆమెపై ఎర్రని రంగుని చల్లాడు
అది ఆమె బుగ్గపై సిగ్గుగా ప్రకాశించింది
చుక్కల పాన్పును పరచి చల్ల గాలితో సందేశమంపింది
అతనిపై మంచుతెరలు కప్పింది

మౌనం వారి మద్య పాటలు పాడింది
వారి హృదయాల ఊసులలో రాత్రి తెల్లవారింది
అతను మౌనంగా ఎర్రబంతిని ఆమె వైపు విసిరాడు
వారి మధ్య మౌనాన్ని చేధిస్తూ అతని సందేశాన్ని మోసుకెళ్ళింది
ఆ ఎర్రబంతి వెలుగులు విరహపు సెగలతో ఆమెను చేరాయి,
ఆమె కనుల మధ్య నుదిటిపై కాంతిగా నిలిచాయి
ఆమెను చేరిన ఆ విరహపు సెగలు చల్లబడ్డాయి
చల్లని వెలుగుగా వెన్నెల కురిపించాయి

అతను తూరుపు ఆమె పడమర
వారి మధ్య మౌనం కూడా పాటలు పాడుతుంది
మౌనం కూడా రాగమే కదా
అనంత జీవన సంగీతానికి నిశ్శబ్దం కూడా అందమే
రణగొణ ధ్వనులు కూడా వారి యాత్రలో ఆనందభైరవి రాగాలే
వారి ప్రేమ భాషకు అందనిది, లెక్కలకు లొంగనిది

వారి మనసుల దూరం శూన్యం
తనువుల దూరం అనంతం
ఆ దూరాన్ని తగ్గిస్తానని వారిని కలపడానికి కాలం పరిగెడుతూనే ఉంది
ఆ కాలం పరుగులో నేనొక చిన్ని రధచక్రాన్ని
వారి అనంత ప్రేమకు నేను కూడా సాక్షినే

23 comments:

Aruna said...

Wav

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగుందండి.
యుగ యుగాలుగా అందరం సాక్షులమే,
మీరొక్కరే కాదు సుమా!
కాకపోతే మీరు అందంగా చెప్పారు.

కొత్త పాళీ said...

Interesting.
Now an assignment - compare and contrast this poem with Tilak's "Dvaitham" :)

Unknown said...

@అరుణ గారు
Thanks
@మందాకిని గారు
నిజమే అందరమూ సాక్షులమే....
@కొత్తపాళీ గారు
అసలు మీరు చెప్పిన కవిత పేరే ఎప్పుడూ వినలేదు. ఇంక పోలికేమి చేస్తాను. ఆ పుణ్యమేదో మీరే కట్టుకోండి

నేస్తం said...

చాలా బాగా రాసారు :)

Hima bindu said...

wav....xlnt

Unknown said...

@నేస్తం , చిన్ని గారు,
ధన్యవాదములు.

పరిమళం said...

ఎంత చక్కగా చెప్పారు తనువుల దూరం అనంతమైనా
మనసుల దూరం శూన్యమని ! బావుందండీ !
* కొత్తపాళీ గారు చెప్పిన "ద్వైతం " తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి లోని కవిత !రెండు భిన్న మనస్తత్వాల మధ్య ప్రేమను కలవని ప్రేమగా రాస్తారు .

మరువం ఉష said...

వారివురి జీవన మాధుర్యమే,
నావూపిరి విరహం అనివార్యమైతే.
ఆసంగమ సరిగమలు,
నాకందిన ప్రేమలేఖలు.
నేచదవని వలపు పాఠాలు,
నేర్పినవి వారివురి పోకడలు.
మా కలయికా ఆ మాదిరిదే,
మా ఇరువరమిక వారి నీడలమే.

*** మీ కవితకి సరైన వ్యాఖ్య కాకపోవచ్చును, కానీ మనసు లోనైన భావావేశమిది.

Unknown said...

@పరిమళం గారు,
ధన్యవాదాలండీ...
అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుదామని గూగుల్ లో వెతికితే ఒక పుస్తకం దొరికింది. కానీ ద్వైతం కవిత లేదు అందులో. మీ దగ్గర ఆ కవిత ఉంటే పంపగలరా?
ద్వైతం కవిత లేకపోయినా మంచి కవితలు అవన్నీ... ముఖ్యంగా "అమృతం కురిసిన రాత్రి" , "సైనికుడి ఉత్తరం"
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు
@ఉషగారు,
మీ వ్యాఖ్యకు నా ధన్యవాదములు.
అయితే మీ వ్యాఖ్యలో మొదటి రెండు పాదాలు అలాగే ఆఖరి రెండు పాదాలు అర్ధం కాలేదు. ఆఖరి రెండు పాదాలు మీ వ్యక్తిగతమైనవేమో అని నా అభిప్రాయం. తప్పయితే మన్నించండి.
"మా ఇరువరము" అనే ప్రయోగం "మేమిరువురము" అన్న దానికి పర్యాయపదమా ?
మీరే నా సందేహాన్ని తీర్చాలి.

కొత్త పాళీ said...

దేవరకొండ బాలగంగా్ధర తిలక్ ద్వైతం పద్యం నించి కొన్ని పంక్తులు.

నువ్వు మా వూరొచ్చినప్పుడు
నేను మీ వూరెళ్తున్నాను.

నీవు ఉత్తర ధృవాన విరిసిన ఆరోరా బొరియాలిస్ వి.
నేను దక్షిణ ధృవతీరాన నిలిచిన పెలికన్‌ పక్షిని (పెంగ్విన్‌ అని రాసుండాలి, కానీ ఆయన పేలికన్‌ అని రాశారు).

నువ్వు తీరిగ్గా ప్రేమించి మేడ మీద చెలికత్తెల మధ్య విహరిస్తావు నిట్టూర్పులతో
నేను ప్రాకృతికమైన ఆకలినీ పాశవికమైన కామాన్నీ భరించలేక జుట్టు పీక్కుంటాను.

ఓ ప్రత్యూష పవనలోల మందార లతాంతమా
నేను ప్రదోషవేళ తమాల శాఖాగ్ర ఘూకాన్ని ..

అటు ఆనంద సుధర్మ వైపు నువ్వు వెళ్ళు నక్షత్ర ధూళిని చల్లుతూ
ఇటు కలల బూడిద రాసుల మీద నే కూలుతా కన్నీరు విడుస్తూ..

పద్యం ఇంకా చాలా ఉంది. ఏవో నాకు గుర్తున్న పంక్తులు కొన్ని ఇవి.

Unknown said...

కొత్తపాళీ గారు,
మంచి పద్యాన్ని పరిచయం చేసారు. పద్యంలో పదప్రయోగాలు చాలా బాగున్నాయి.
నా మనసులో యాధృచ్చికంగా మెదిలిన భావాల పద్యం మీకు ఆ ద్వైతాన్ని గుర్తు చేసి నాకు అద్వైతానందాన్ని అందించింది. మరోసారి ధన్యవాదాలు.

Bolloju Baba said...

ఆ ఎర్రబంతి వెలుగులు విరహపు సెగలతో ఆమెను చేరాయి,
వాక్యం చాలా బాగుంది.

కవిత కాన్సెప్టు మరీ బాగుంది.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది ప్రదీప్ గారు... కవిత కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది..

Unknown said...

@బాబా గారు, వేణూ శ్రీకాంత్ గారు..
ధన్యవాదములు

Padmarpita said...

"వారు కలిసిన రోజు అద్భుతమే,
అవును అసలు వారు విడిపోయిన రోజేది ?
వారు కలసి జీవించని రోజేది?......"
Wow...its beautiful!!!

tears of yohanth said...

Superb....

Unknown said...

@పద్మార్పిత గారు, యొహనాధ్ గారు,
ధన్యవాదాలు.

Dileep.M said...

Which Mathematics equation inspired you(ofcourse to write this)??

Unknown said...

The eternal and unsolved and unending equation of beautiful nature inspired to write this.

swpna said...

very nice. I think first I should read all your posts :D

harish said...

ప్రకృతిలో ప్రతిరోజూ జరిగే ఈ ప్రక్రియను ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సందర్భం వలె అద్భుతంగా రచించారు. 👏👌

Phani Pradeep said...

Thank you Harish.