చుక్కల చీర కట్టి
సప్తవర్ణపు హరివిల్లుల రవిక తొడిగి
నల్ల మబ్బు కాటుక పెట్టి
తెల్ల మబ్బు మల్లెలు జడను దోపి
చల్లని చంద్రుని గుండెలో దాచి
మండే సూరీడిని గుప్పిట మూసి
ఉదయపు కాంతులు బుగ్గన పూసి
సాయంత్రపు సింధూరధూళి నుదిటిన దిద్ది
విశ్వాంతర్లాపియగు తన ప్రియుని కొరకు
ఎదురుచూస్తోంది ఆమె, ఆ నీలాకాశపు రాణి
అతనిపై ఆమె కోపమే, ఎర్రని ఎండేమో
అతని విరహవేదనలో ఆమె కనుల నీరే, వర్షమేమో
అతని కలయికలో ఆమె ఆనందమే, చల్లని వెన్నెలేమో
అనంత ప్రేమ యాత్రలో మనమంతా యాత్రికులమేమో…
ఏం అలాగే కావాలా?
ఆ నీలాకాశం దేవుని చిత్రలేఖనమేమో...
ఒక క్షణం ఘీంకరించే గజరాజాల్లాంటి నల్ల మబ్బుల గీసి
మరొక పరి కళ్ళు మిరమిట్లు గొలుపు తెల్ల మబ్బుల హిమ
శిఖర చిత్రాలు గీసి
తన పిల్లలను ఆడిస్తున్నాడేమో?
ఏం అలాగే కావాలా?
నీలాకాశపు లోగిలిలో పుట్టిన నల్ల మబ్బు, తెల్ల మబ్బు అన్నదమ్ములేమో
కామరూప విద్యాపారంగతులేమో
ఒకరి వెంట ఒకరు పడుతూ
నల్ల మబ్బు అన్న వాన కురిపిస్తే
తెల్ల మబ్బు తమ్ముడు తెరిపినిస్తున్నాడేమో!
ఒకరితో ఒకరు ఆడుకుంటూ తమ బాల్యాన్ని గడుపుతున్నారేమో
ఏమో ఏమైనా కావచ్చు కాక,
పంచభూతాలు వారి ఆటకు వాడే మైదానమే ఆ నీలాకాశమవ్వచ్చు గాక
ప్రియుని కోసం ఎదురు చూసే వనితావాణే ఆ నీలాకాశమేమో
తన పిల్లలతో ఆ దేవుడు ఆడుకునే చిత్రరంగమే ఆ నీలాకాశమేమో
మబ్బు పిల్లలతో తారాచంద్రులు నివసించే లోగిలే ఆ నీలాకాశమేమో
6 comments:
చాలా బాగుంది.
చాల బాగారాసారు
అర్జున్ గారూ,
నీలాకాశాన్ని వనితగా చిత్రీకరి౦చే ప్రయత్న౦ చాలా మ౦దే చేసారు.
కొ౦దరు ఒక వనిత అన్నారు, మరి కొన్నిసార్లు స్నేహితురాలన్నారు.
సినీగేయ రచయితలు చాలా మటుకు మబ్బుల పోస్ట్ మాన్ లు మని చేసే పోస్టాఫీసన్నారు.
కానీ ఆమె తన ప్రియుని కోస౦ ఎదురుచూస్తున్న తీరును వర్ణి౦చిన మీ తీరు మహా అద్భుత౦గా ఉ౦ది. ఎ౦త బావు౦ద౦టే, ఆ నీలాకాశపు రాణి ఎదురుచూసే ఆ ప్రియుణ్ణి నేనే అయితే బావు౦డనిపి౦చే౦త బావు౦ది. [మా ఆవిడ వి౦టే గోలైపోతు౦ది. మనలో మన మాట సుమా!]
అన్నట్టూ, నా పేరు ఆన౦ద్. మీ కవితలకు ఓ చిన్న కొత్త అభిమానిని.
Glad to meet you here in the SKY!
@విజయమోహన్ గారు, నేస్తం
నచ్చినందుకు ధన్యవాదాలు
@ఆనందు గారు,
నా కవితలకూ అభిమానులున్నారా అని నన్ను నేను గిల్లి చూసుకున్నా ఒక పది సార్లు.
నిజమేనండి ఆకాశాన్ని చూస్తే అనేక భావనలు కలుగుతాయి. ఆకాశంలో మేఘాలనే చూడండి, ఒక్కొక్కరికీ ఒక్కోలా కనిపిస్తాయి. ఆకాశం వైపు చూస్తూ ఉంటే వచ్చే అనేక ఇతర ఆలోచనలు కూడా రాసాను అందుకే...
ఆ ఇతర ఆలోచనల తర్వాత మనోఃఫలకంపై ఆవిష్కరించబడిన అందమే ఆ నీలాకాశపు రాణి
ఆ నీలాకాశపు రాణి ఎదురు చూసే ప్రియుడు ఎవరో కానీ నాకు కూడా అసూయను కలగచేస్తున్నాడు సుమా!! (రాసినవాడిని కనుక నేనే ఆ ప్రియున్ని అయి ఉంటాను :) ).
ఒహొ, ఆకాశం మీకు కూడా కవితావేశం కలిగించేసిందా. నేను కూడా ఆమె ఎవరన్నదే తెలియక ఏవేవో వూహలుగా చిత్రీకరిస్తుంటాను.
ఉషగారు,
నిజమే ఆకాశంలో నున్న మబ్బులను చూస్తే మొదలయ్యింది ఆ ఆవేశం. అయితే అది కాస్తా చివరకు నీలాకాశపురాణిగా మిగిలింది. అందుకే నాకు వచ్చిన మిగతా ఊహలను కూడా రాసాను.
Post a Comment