ఎక్కడున్నావు ?


నిద్ర నుంచి లేచేసరికి ఎక్కడికో వెళ్ళిపోయావు,
ఎక్కడున్నావా అని వెతుకుతూ బయలుదేరాను

తన ప్రియురాలిని కలుసుకోవడానికి నా కన్నా ముందే వచ్చేసాడు సూరీడు
నువ్వెక్కడున్నావని అడిగితే ఆకాశాన్నంతా ఎర్రగా చేసి
"మా మధ్య రాకు" అంటూ సూర్యముఖితో సరసమాడసాగాడు

పక్కనున్న తుమ్మెదనడగబోతే నా ప్రేయసి దగ్గరకు వెళ్ళాలంటూ
దూరంగా అప్పుడే విచ్చుకుంటున్న సౌగంధ పుష్పం వద్దకు వెళ్ళిపోయాడు

గోమాతను అడగబోతే నా పిల్లలకు పాలివ్వాలంటూ
చెంగున చెంగున గెంతుతున్న లేగ దూడ వద్దకు వెళ్ళిపోయింది

చిగురాకుల మామిడికొమ్మను అడుగబోతే
చిగురాకుల తోరణంగా వెళ్ళాలంటూ మంచుతో కన్నీళ్ళు కార్చింది

పరవళ్ళు తొక్కుతున్న సెలయేటినడగబోతే
కొంటెగా నవ్వి ఆగకుండా పరుగు పెట్టింది

సెలయేటికి వచ్చిన కన్నెపిల్లలనడిగితే
కాటుక నిండిన కళ్ళతో తెలియదన్నారు

ఉదయమంతా నీ కోసం తిరుగుతూనే ఉన్నా కనిపిస్తావని

ఇంతలో సూర్యునికి వీడ్కోలు చెప్పడానికి మబ్బులు పరుగున వచ్చాయి.
జారిపడుతున్న ప్రతి చినుకునీ అడిగా
సెలయేటికి చేరాలంటూ పరుగులు తీసాయి

ఇంతలో ఎక్కడో విరహగీతం వినిపించింది
ఎవరా అని చూస్తే తమను వీడి వెళ్ళిన చంద్రుని కోసం
తారలు పాడుతున్నాయి చీకటికి స్వాగతం చెప్తూ

నన్ను పలకరించ వచ్చిన నిద్రా దేవిని అడిగా
కమ్మగా జోల పాడింది, నా కలలో మళ్ళీ నువ్వు వచ్చేలా...

మరో రోజు ముగిసింది నీ అన్వేషణలో
ఇంతకూ ఎక్కడున్నావు ప్రియతమా.....

" ఉదయం నుంచీ నీతోనే ఉన్నాను " చిరునవ్వుతో అంది నా కవితా ప్రేయసి

( కవిత కోసం వెతుకుతున్న కవి భావాలను చెప్పే ప్రయత్నం )

10 comments:

నేస్తం said...

చాలా బాగా రాసారు.. మంచి కవిత.. బాగా నచ్చింది

Aha!Oho! said...

ప్రదీప్ అన్నా!

నీ కవిత చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి చాలా రాయన్నా!

ఆత్రేయ కొండూరు said...

బాగా రాశారు, నాదీ అదే పరిస్థితి ఇప్పుడు.

మరువం ఉష said...

ముందుగా -
"ఒక క్షణం సర్వం త్యజించిన యోగిని, మరో క్షణం భవబందాలకు బానిసను"
చిక్కని భావన మిమ్మల్ని గూర్చి ఒక్కమాటలో తెలిఫేందుకు.

పోతే ఆత్రేయ గారి వెనుకే నేనున్నానీ అన్వేషణలో. నా వెనుక మీరు, మన వెనుక మరి కొందరేమో. అశ్వినిశ్రీ గారి కవితలో వ్యక్త పరిచినట్లు అందని వాటినిలా అనుభూతిలో అస్వాదించేద్దాం.

Dr. C. JAYA SANKAR BABU డాక్టర్ సి. జయ శంకర బాబు said...

Indeed a nice blog & your views are excellent.
http://www.saahitee.blogspot.com
Dr. C. Jaya Sankar Babu

Unknown said...

@ఉషగారు,
కృతజ్నతలు.... ఇక అన్వేషణ అంటారా.. అది అంతులేని అన్వేషణ. ఎన్నో వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది.
@జయ శంకర బాబుగారు,
ఎంతో ఆనందం మీకు నచ్చినందుకు. మీ బ్లాగు కూడా బాగుంది.

Anonymous said...

prdeep garu ila ekkadekkado vethakadam , evarevarinino adagadam kante okkka msg thono, pka cal thono cell lo contact chesthe saripoyediga, kanisam e orkut lono search cheyochhu kadha . ila blog lo rasthe emosthundi vunna lagulu kuda vudipothayi mari antha vethakamaku............
iswarya pothe maro maya vasthundiga... digulpadakura sahodara..........

Unknown said...

అనానిమస్ సోదరా,
మొబైల్ లోనో, ఆర్కుట్ లోనో దొరికేట్టయితే అది కవిత ఎందుకవుతుంది?

Hima bindu said...

చాలాచాలా బాగుంది ...ముఖ్యంగా చివరి వాక్యం :)

Unknown said...

చిన్ని గారు,
చివరి వాక్యమే కదా ఈ కవితకు ఊపిరి :)