నాన్న

నీవు ఓటమి ఊబిలో మునిగిననాడు,
నీవు భవసాగరసుడిలో చిక్కిననాడు,
భుజంపై చేయి వేసి భయాన్ని తరిమేవాడు,
తన మాటతో ధైర్యం తెచ్చేవాడు,
ఒక్కడే ఉంటాడు నాన్న రూపంలో

నీ విజయం నువ్వు చూడనినాడు,
నీ బలం నువ్వు గ్రహించనినాడు,
కాబోయే విజేత కోసం సంబరపడేవాడు,
తన మాటతో ఉత్సాహం ఇచ్చేవాడు,
ఒక్కడే ఉంటాడు నాన్న రూపంలో

నీ కళ్ళు అహం తాగిననాడు,
నీ చేతలు సంస్కారం తప్పిననాడు,
మాయను తప్పించే ఆచార్యుడు,
తన మాటతో దిశా నిర్ధేశం చేసేవాడు,
ఒక్కడే ఉంటాడు నాన్న రూపంలో

విలువ

నింగిని కొలిచే పక్షి రెక్కల విలువెంత?
చిరుగాలిని ముద్దాడిన యవ్వనమంత
జోరుగాలికి ఎదురెళ్ళిన ధైర్యమంత
ఉరుముల రాగంలో ఆలాపించిన గానమంత
తారలలెక్కలు చూసిన నేరుపంత
తొలిచినుకుల స్వఛ్ఛమంత
మేఘపర్వతాలు అధిరోహించిన గెలుపంత

సాగరాన్ని కొలిచే చేప రెక్కల విలువెంత?
చిరుఅలలతో సయ్యాటలాడిన యవ్వనమంత
ఉప్పెనలకు ఎదురీదిన ధైర్యమంత
సముద్రపు గంభీరంలో ఆలాపించిన గానమంత
జలబిందు సైన్యపు లెక్కలు చూసిన నేరుపంత
ఆల్చిప్పలో దాగిన స్వఛ్ఛమంత
అఖాతాలలో ఈదిన గెలుపంత

మరి విశ్వాన్ని గెలిచే మనిషి రెక్కల విలువెంత?

నీవు

నీ లోతుని కొలిచే గ్రీష్మం వస్తే,
ఎడారివై వేడి నిట్టూర్పులు శ్వాసిస్తావా?
సముద్రమై అలల నవ్వులు చిందిస్తావా?

నీ ఎత్తుని కొలిచే ఉప్పెన వస్తే,
మొక్కవై మునిగిపోతావా?
శిఖరమై ధిక్కరిస్తావా?

నీ వేడిని కొలిచే శీతలం వస్తే,
జలమై హిమమైపోతావా?
హోమాగ్నివై ప్రజ్వలిస్తావా?

నీ ధైర్యం కొలిచే చీకటి వస్తే,
తారవై సాక్ష్యం అవుతావా?
కిరణమై చీకటి చీలుస్తావా?

నీ బలం కొలిచే శిశిరం వస్తే,
దేహమై రాలిపోతావా?
ఆత్మవై కొత్త కావ్యం లిఖిస్తావా?