చేయూతనివ్వక,
ఓదార్పునివ్వక,
సానుభూతి చూపక,
ఈ సమాజం ఏనాడో చచ్చింది
యమపాశం తగలక ముందే,
రుధిరప్రవాహం ఉండగానే,
మస్తిష్కం మథిస్తుండగానే,
శ్మశాన ప్రణయంలో మునిగిన సమాజం ఇది
రక్కస రాజుల అర్చనలో,
చితిమంటల హోమంలో,
కళేబరాల కౌగిట్లో,
మైమరిచిపోతున్న మృతసమాజం ఇది
ప్రళయంతో ప్రణయిస్తూ,
ప్రాణంతో కలహిస్తూ,
ప్రణవంతో విభేదిస్తూ,
భస్మమైపోతున్న అవివేక సమాజం ఇది
(కరోనా దాడిలో ఈనాడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బ్రతికున్న శవాల మధ్య చచ్చిన శవాలు ఉన్నట్టు అనిపిస్తోంది.
బాధ్యతలు మరచిన ప్రభుత్వాలు, బద్ధకం నిండిన ఉద్యోగులు, అపోహల్లో మునిగిపోయిన ప్రజలు. ఈ సమాజం ఏనాడో చచ్చింది. అక్కడక్కడా ఒక్కో జీవకణం మిగిలింది అంతే)
1 comment:
మీ ఆక్రోశం సమంజసమే.
Post a Comment