గడ్డి పూలు నవ్వాయి

బజార్లోకి మల్లెపూల బండి వచ్చి ఆగింది,
తరుణులు ఒక్క మల్లె దొరికినా చాలంటూ మూరలే ఎత్తుకెళ్ళారు
భార్యాప్రసన్నం చేసుకోను పతులు గంపలెత్తుకెళ్ళారు
తరుణీమణుల జడను చేరి తరుణులకన్నా వారి జడలే అందమని మెప్పించాయి
తెల్లవారేసరికి మల్లెలు గడ్డిపై పడ్డాయి
అది చూసి హేమంతపు హిమబిందువులు ఏడుస్తూ ఊరిని కప్పేసాయి
ఊరడిస్తూ సూరీడు వచ్చాడు,
హిమబిందువులను తుడిచాడు.. రోజుకు స్వాగతం చెప్పాడు

మరో రోజు చామంతుల బుట్ట ఆగింది,
మళ్ళీ అదే తంతు
చామంతులు కూడా వాడిపోయాయి
బంతులు బంతాట ఆడినంతనే కమలిపోయాయి

ముళ్ళబందీ రోజాలు రోజుకొక జంటను కలుపుతున్నా
మొగ్గ విడవకుండానే వాడిపోతున్నాయి
మొగ్గ విడిచిన రోజాలు ఆహారప్రియులకు ఆహరమయ్యాయి
ఆకర్షణగా మిగిలాయి
మల్లెల ఊరడించిన సూరీడి ఎండ తగిలితేనే కమిలిపోయాయి
ముళ్ల మధ్య బందీ అయితేనే వాటికి అందమేమో

ఎర్రని మందారాలు రేకురేకుగా గుడిలో పూజకు వెళ్ళాయి
ఒళ్ళంతా చిధ్రమై భక్తుల చెవిలో చేరాయి

ఆకులమే అయినా పువ్వులకు పోటీ అంటూ
మొగలిరేకులు, మరువపు ఆకులు దూసుకొచ్చాయి
వాడినా గుబాళిస్తూ పాత బట్టలలోనో పుస్తకం మధ్యలోనో బందీ అయ్యాయి
అదృష్టం తెస్తాయని ఎవరు చెప్పారో ఇంటింటా కొలువుతీరాయి మనీప్లాంట్ లు

చెరువులో బురదనుంచి పుట్టుకొచ్చింది ఒక తామర, మరో కలువ
ఆ అందానికి మైమరచి బురదను దిగి సొంతం చేసుకున్న వాళ్ళెంతమందో

కాలం మారింది .... ప్రకృతిపై కన్నెర్ర చేసింది ...

నారీమణుల జడలు ఉలిక్కిపడ్డాయి
కొందరి జుట్టు రాలిపడింది
"వేణీ" అన్న పదం నిఘంటువుకే పరిమితమయ్యింది

మల్లెలు తెచ్చే ఖర్చు మగడకి తగ్గింది,
హేమంతం హిమబిందువులు రాల్చ రాలిన మల్లెలు లేవు
ఎవరిని ఊరడించాలి సూరీడు
ఆగక చెలరేగిపోతున్నాడు

చామంతులు, బంతులు అర్ధాలే తెలియని పిల్లలు వచ్చారు
బంతాట అంటే వీడియోగేమనే తెలుసు కదా మరి
జాతీయజండాతో కలిసి ఎగిరే చామంతులు, బంతులు
జాతీయజండా విలువ తెలియని వారి మధ్య నలిగిపోయాయి

ముళ్ళబందీని విడిపించే కష్టం తనకేల అనుకున్నాడేమో నేటి ప్రియుడు
గ్రీటింగ్ కార్డ్ పై గులాబీ బొమ్మతో సందేశమంపాడు
చాచా నెహ్రూ గులాబీ అలంకరణ పిల్లల దినోత్సవానికే పరిమతమయ్యింది

ముద్ద మందారాలే కావాలా అనుకున్నారేమో
లేక దేవునికి పూజలెందుకనుకున్నారో
ముద్ద మందారాలు ఉనికిని కోల్పోయాయి
చెవిలో పువ్వు పెట్టే వారు తయారయ్యారు

మొగలిరేకుల జాడే తెలియలేదు
చిన్నబుచ్చుకున్న మరువం ఏడ దాగుందో
అదృష్టం అంటే నమ్మకమే లేదో మనీప్లాంట్ స్థానంలో బోన్సాయ్ మొక్కలొచ్చాయి

చెరువులే లేక కలువలు తామరలు బొమ్మలకే పరిమతమయ్యాయి
వాటి కోసం బురదలో దిగాల్సిన అవసరమే లేకుండా పోయింది.
"పంకజముఖి" అన్న వర్ణన అర్ధమేమిటో తెలియక బుర్రలు పీక్కునే కవులు తయారయ్యారు

ఇంత చూసినా తన చిన్న గుండె పగలనందుకు గడ్డి ఏడిచింది
హేమంతపు హిమబిందువులు లేని లోటు తెలిసేలా
కనీసం తన పూలైనా చూడకపోతారా తరుణీమణులు అని రోజూ పూలను పూస్తూనే ఉంది
ఎక్కడైనా పెరుగుతాను కదా అందం వైపు చూపు మళ్ళించలేనా అనుకుంది పిచ్చిది
కాంక్రీట్ అరణ్యంలో తనకోసం అడుగు నేల కూడా మట్టితో లేక ఏడ్వలేక నవ్వింది
కోపమొచ్చిన సూరీడు వేడిని పెంచాడు కాంక్రీట్ ముక్కలు బద్దలయ్యేలా
వేడికి విలవిలలాడింది భూమి, నిలువెల్లా కంపించింది
కాంక్రీట్ అరణ్యం శిధిలమయ్యింది
అక్కడ మొలచిన గడ్డిపూలు మళ్ళీ ఏడ్వలేక నవ్వాయి
అందాన్ని చూపించ మనుషులేరీ అని

ఆ గడ్డిపూలు నవ్వుతున్నాయి... ఇప్పటికైనా కళ్ళు తెరవరా అని

(అక్కడక్కడ కొంచెం శృతి మించి ఉండవచ్చు. ముఖ్యంగా జడల విషయంలో. కానీ రాబోయే పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ విషయం గ్రహిస్తే చాలు. ఇది నేను మహిళలను కించపరచడం అనుకోవడం లేదు. ఎవరికైనా అలా అనిపిస్తే క్షంతవ్యుడినే కానీ ఆ వ్యాక్యాలు మాత్రం తొలగించబడవు ) 

9 comments:

మరువం ఉష said...

ఎందుకే వెఱ్ఱిపూవు నవ్వేవు ఈ ఇల మరిచి
నవ్వే నీవు నలిగేవు నాల్గు ఘడియల్లో
************
నీవు పెంచిన ఈ పూల వనాన పూచిన ఓ పిచ్చిపూవును
నా మధురిమ నిను చేరేలోపే వసివాడిపోతానేమో.

ప్రదీప్, నా 12-13 ప్రాయాల్లో [అప్పటికి నా భావాలే కానీ ఎవరి రచనలు చదివి ఎరుగని వయసు] నేను వ్రాసుకున్న పూల కవితలివి.

మీ కవిత పూర్వార్థం కాస్త "అభినవ పుష్ప విలాపం" అనిపించేలా వ్రాసినా అదే కరువైంది అన్నట్లు ఉత్తర భాగం వుంది. పూల పట్ల జాలి గొన్నారా, అవి వినియోగపడటం లేదని మధన పడుతున్నారా? నిజానికి ఈ మధ్య వరకు మూరలు మూరలు పెట్టుకునే నేను గత 5సం. నుండే వాటిని చూసి ఆస్వాదించటం నేర్చుకున్నాను. నేను నివసించిన ఏ ఇంట్లోనూ పూలు అన్నవి లేని రోజు లేదు. ఆస్టేలియాలో కూడా రోజుకి 400 వరకు మల్లెలు పంచిన ఘనత నాది. అలాగే మేము Mount Kosciuszko ఎక్కుతున్నపుడు దారి వెంబడి గడ్డిపూలు కూడా నలగకూడదని ఒక బాట వేసారు, ప్రకృతి పట్ల మమత+మైకం కమ్మి ఆ గడ్డిలో ఒక పది అడుగులు వేసానో లేదో ఒక వనిత మందలించింది "అంత అరుదైన పూలని ఎలా తొక్కగలుగుతున్నావు" అని. కనుక గడ్డి పూవుని కూడా ప్రేమించే వారు వుంటారు. నేనూ ప్రేమికనే.

చివరిగా మీరు తక్షణం చేయాల్సిన పని వ్యాఖ్యలతో సహా "ఈ సిగ లెక్కెక్కడ తప్పుతోందబ్బా?" http://maruvam.blogspot.com/2008/12/blog-post_24.html చదవాలి. వీలైతే శీర్షిక పెట్టాలని లేదు http://maruvam.blogspot.com/2008/12/blog-post_18.html కూడా. బాగుంది మీ టపా అంశం.

Unknown said...

@ఉష గారు,
"పూల పట్ల జాలి గొన్నారా, అవి వినియోగపడటం లేదని మధన పడుతున్నారా?" - సమాధనమేమిటో చెప్పలేను. కానీ ఉత్తరభాగంలోని నా భావమేమిటో మీకు చేరలేదని మాత్రం చెప్పగలను.
నేను పుష్ప విలాపం చదవలేదు. అయితే దానితో పోలిక పెట్టవచ్చేమో పూర్వ భాగానికి. ఎందుకంటే ఈ అంశం అలాంటిదే కనుక.

మీరు రాసిన నాలుగు పాదాలూ బాగున్నాయి
ఇక ఈ కవితకు నేను పెట్టిన టైటిలు మీ "పల్లె నవ్వింది" నుంచి కాపీ... :)
ఈ కవిత రాయడానికి ప్రేరణ ఈ రోజు గడ్డిలో నడుస్తుంటే కనిపించి కన్నుకొట్టిన పూలు. నేనూ గడ్డిపూల అభిమానినే సుమా...

మీ పాత పోష్టులు చదువుతాను. చదివి వ్యాఖ్యానిస్తాను.

మరువం ఉష said...

నా కవితలు చదివాక ఆ రెండో భాగం నాకు అర్థం కాలేదని మీలో కలిగిన అపోహ కొంత తొలగొచ్చు. అందులో మీరు కాంక్రీటు జంగిల్, జడలు తరిగిపోవటం, తగ్గిన పూలమొక్కల పెంపకాన్ని, ఈ తరం పిల్లల్లో ప్రకృతి+పూల పట్ల అవగాహన లేమి ఎత్తిచూపారని నాకు అర్థం అయింది మరి.

హరే కృష్ణ said...
This comment has been removed by the author.
హరే కృష్ణ said...
This comment has been removed by the author.
హరే కృష్ణ said...

చాలా తొందరగా చదివేసా అప్పుడే అయ్యిపోయిండా అనిపించింది ..మొదటి కవిత లో రెండో సగం బాగా నచ్చింది..దానికంటే రెండో కవిత చాలా బాగుంది..అభినందనలు

Unknown said...

@ఉష గారు,
ఆ కవితలు చదివాను. అవి పూర్తిగా పూల విషయం కాకపోయినా, మీరు చెప్పదలచుకున్నది మీలాంటివారు మర్చిపోలేదని చెప్పాలనుకున్నారని అర్ధం అయ్యింది.
ఇక మీరన్నట్టు ఆ కాంక్రీట్ జంగిల్ , జడలు తగ్గడం వగైరా గురించే రాసాను. అంతే కాదు, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మనుషులు మిగలరని కూడా రాసాను.
@హరేకృష్ణ గారు,
నేను రాస్తున్నప్పుడు చిన్న భయం, ఇంత పెద్దది రాసాను. అసలు ఎవరైనా చదువుతారా అని? మీ వ్యాఖ్య చూసాక నా సంశయం తొలగింది.
మొదటి కవిత వల్లే రెండవ కవిత బాగా వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే మొదటి కవితలో ప్రతీ వాక్యానికీ సమాధానమిస్తూ రాసాను. అది పునాది, ఇది భవనం.

Anonymous said...

Babu kavi kaali daasu... Chaala baaga raasaavu nayana...

Unknown said...

@Anonymous,
Thanks for your comment. Don't forget to write your name next time :)