వెన్నెల రాత్రి

సిగ్గుపడే ప్రియురాలి మోము కానరాక
అలిగిన ప్రియుడు, సూరీడా! ఆమె మోముని
చూపింప ఉదయించమని అడిగాడట
వారి సైకత పానుపుపైనున్న మల్లెలు ఫక్కున నవ్వి
పున్నమి వెన్నెల కురిపించమని చంద్రున్ని కోరగా
చీకటికోటను తన శ్వేతకిరణాలతో నింపి
ఆమె మోముని అతని కనులలో ప్రతిష్టించాడట ఆ చందమామ

అంత ఆ చంద్రున్ని చూసి ఆటలాడు బంతియని భ్రమపడిన
బాలుడొకడు అమ్మ వద్ద మారాం చేయ,
ఆయమ్మ పక్క నున్న కొలనులో చంద్రున్ని చూపిందట
నీటిలో చంద్రుని చూచిన బాలుడు నా చెంత చేరాడు చంద్రుడంటూ
అమ్మ లాలిపాట వింటూ నిదురపోయాడట
ఆ లాలిపాట వింటూ చంద్రుడు కూడా పరవశించి
హిమపవనాల పరిమళంతో వింజామరలు వీచాడట

ఆ పరిమళాలు ఎక్కడో ఒంటరిగా కవితాప్రేయసి కోసం
ఎదురు చూస్తున్న కవి కలాన్ని తాకాయట
ఈ సంబరాన్ని చూద్దామని సూరీడు రాబోయాడట
చంద్రుడు తన శ్వేతకిరణాలతో తరిమేసిన తామసి
సూరీడుని నిలువరించిందట...

తామసితో యుద్దం చేసి అలసి రక్తమోడుతూ చీకటికోటలో
ప్రవేశించాడట, 
ఆ ప్రియురాలి చెక్కిలిపై ఎరుపు చుక్క పెట్టి
ఆ ప్రేమపక్షులని నిద్రలేపాడట

నిదురపోతున్న బాలుని లేపి రంగు మారిన బంతినంటూ
కొత్త ఆటలు మొదలుపెట్టాడట
కవి కలానికి సిరా పోసి పలకరింప తనతో తెచ్చిన రోజుని పంపాడట

నెమ్మదిగా బలం పుంజుకున్న తామసి సూరీడు రక్తాన్ని రుచి చూసింది
మరో రాత్రికి శ్రీకారం చుట్టింది

నీలాకాశపు రాణి

చుక్కల చీర కట్టి
సప్తవర్ణపు హరివిల్లుల రవిక తొడిగి
నల్ల మబ్బు కాటుక పెట్టి
తెల్ల మబ్బు మల్లెలు జడను దోపి
చల్లని చంద్రుని గుండెలో దాచి
మండే సూరీడిని గుప్పిట మూసి
ఉదయపు కాంతులు బుగ్గన పూసి
సాయంత్రపు సింధూరధూళి నుదిటిన దిద్ది

విశ్వాంతర్లాపియగు తన ప్రియుని కొరకు
ఎదురుచూస్తోంది ఆమె, ఆ నీలాకాశపు రాణి

అతనిపై ఆమె కోపమే, ఎర్రని ఎండేమో
అతని విరహవేదనలో ఆమె కనుల నీరే, వర్షమేమో
అతని కలయికలో ఆమె ఆనందమే, చల్లని వెన్నెలేమో

అనంత ప్రేమ యాత్రలో మనమంతా యాత్రికులమేమో…

ఏం అలాగే కావాలా?
ఆ నీలాకాశం దేవుని చిత్రలేఖనమేమో...
ఒక క్షణం ఘీంకరించే గజరాజాల్లాంటి నల్ల మబ్బుల గీసి
మరొక పరి కళ్ళు మిరమిట్లు గొలుపు తెల్ల మబ్బుల హిమ
శిఖర చిత్రాలు గీసి
తన పిల్లలను ఆడిస్తున్నాడేమో?
ఏం అలాగే కావాలా?
నీలాకాశపు లోగిలిలో పుట్టిన నల్ల మబ్బు, తెల్ల మబ్బు అన్నదమ్ములేమో
కామరూప విద్యాపారంగతులేమో
ఒకరి వెంట ఒకరు పడుతూ
నల్ల మబ్బు అన్న వాన కురిపిస్తే
తెల్ల మబ్బు తమ్ముడు తెరిపినిస్తున్నాడేమో!
ఒకరితో ఒకరు ఆడుకుంటూ తమ బాల్యాన్ని గడుపుతున్నారేమో

ఏమో ఏమైనా కావచ్చు కాక,
పంచభూతాలు వారి ఆటకు వాడే మైదానమే ఆ నీలాకాశమవ్వచ్చు గాక
ప్రియుని కోసం ఎదురు చూసే వనితావాణే ఆ నీలాకాశమేమో
తన పిల్లలతో ఆ దేవుడు ఆడుకునే చిత్రరంగమే ఆ నీలాకాశమేమో
మబ్బు పిల్లలతో తారాచంద్రులు నివసించే లోగిలే ఆ నీలాకాశమేమో

శీర్షికేమి పెట్టను ( ఎదురుచూపు )

ఆమె కళ్ళు అతని రాకకై ఎదురు చూస్తున్నాయి....
అతని రాకను చూసి ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి
ఆమె ఇన్నాళ్ళు గడిపిన యుగాలకు నేటితో యుగాంతం

అతను వచ్చాడు ఆమె దగ్గరగా, ఆమెను చూడలేదు 
చిరునవ్వుతో కూడా పలకరించలేదు
అతని కళ్ళలో ఆమె కోసమై ఎదురుచూపులు లేవు

ఆమె ఎదురు చూసిన యుగాంతం వచ్చింది, కానీ తను ఎదురు చూసినట్టు కాదు
ఆమె గుండె లోతుల్లో బడబాగ్నులు రగులుతుండగా నిష్క్రమించింది మౌనంగా
ఆమె ఎదురు చూసిన యుగాంతం ప్రళయానికి నాంది అయ్యింది  
ఆమె హృదయం ఇప్పుడు ఒంటరితనానికి బందీ 


-----
ఇది రాసి రెండు నెలలయ్యింది. దీనికి కొనసాగింపు (అతని వైపు నుంచి) రాద్దామనుకుని రాయలేకపోయా...

వసంతమా... మన్మథ మాసమా....

సన్నగా గాలి వీస్తోంది
బాల్కనీలోని మల్లెతీగను తడిమింది
తడిమి, ఒక మల్లెమొగ్గను తుంపింది
తుంపి, ఆ మల్లెమొగ్గలోని పరిమళాన్ని తనతో మోసుకెళ్ళింది
ఏ ప్రియుడు పంపాడో ఆ మల్లెమొగ్గల పరిమళంతో తన సందేశాన్ని తన ప్రేయసికి

కాసేపటికి గాలి స్థంభించింది, వాతావరణం వేడెక్కసాగింది
ఆ ప్రేయసి తన విరహ తాపాన్ని ఇలా చూపిందేమో
ఇంతలో ఒక పిచ్చుక ఎగిరింది ఒక మూల నుంచి మరో మూలకు
ఆమె మాటలాడిందేమో అతనితో
ఎక్కడి నుంచో వచ్చాయి నల్ల మబ్బులు
ఆమె కళ్ళ నుంచి జారే కన్నీళ్ళ జలపాతంలా వర్షించాయి

క్షణ కాలమే ఆ విరహవేదన భాష్పాలు
ఇంతలో మళ్ళీ గాలి వీచింది ఈ సారి మరింత బలంగా
తనతో మరింత పరిమళాన్ని మోసుకెళ్ళింది
దూరంగా రెండు మబ్బులు ముద్దాడుకుంటున్నాయి

ప్రేయసి ప్రియుల కలయికకు ఇలా సహకరిస్తున్న వసంతమా.. నీవు మన్మథమాసానివా?

(బాల్కనీ వైపు చూస్తూ కూర్చున్నప్పుడు నా ముందు జారి పడిన పువ్వుల సాక్షిగా)