నాదో చిన్ని కోరిక, నేను వెక్కి వెక్కి ఏడవాలి

నాదో చిన్ని కోరిక,
నేను వెక్కి వెక్కి ఏడవాలి, ఆనందవాహినిలో డోలాలాడుతూ

నాదో చిన్ని కోరిక,
నేను పడి పడి నవ్వాలి, ధు:ఖ హాలాహాలాన్ని ఇట్టే పట్టి 

నాదో చిన్ని కోరిక,
నేను విరహ గ్రీష్మాగ్నిలో సాగాలి, ప్రియప్రణయ హేమంతాన్ని చేతపట్టుకుని 

నాదో చిన్ని కోరిక,
నేను  వైరాగ్యశిఖరంపై నిలవాలి, విజయ శిఖరాలు దాటి

నాదో చిన్ని కోరిక,
నేను  ప్రళయఘోషలో  ఆలాపన చేయాలి, ఆదిప్రణవరాగంలో

నాదో చిన్ని కోరిక,
నేను భవసాగర లోతులు కొలవాలి, భవబంధాలను బందీ చేసి

నాదో చిన్ని కోరిక,
నిర్గుణమార్గంలో స్థితప్రజ్ఞతతో నడవాలి

నేను కోరికలకు అతీతుడనై నిలిచాక, ఇక కోరికే లేదు !!!
ఇక నేనే లేను, అన్నీ నేనే అయ్యాక !!!

నేను మహాసముద్రాన్ని ముంచేసిన అలను !!!

మహాసముద్రాన్ని ముంచేసిన అల నేను

అగ్నిపర్వతాన్ని దహించే జ్వాల నేను

సమస్త మేఘాలను త్రాగే తుఫాను నేను

సుడిగుండాలను మింగే సుడి నేను


సమస్త గ్రహాలను కుదిపే భూకంపాన్ని నేను

గ్రహణానికి గ్రహణం చూపే వెలుగు నేను

నక్షత్ర వలయాలను మాయం చేసే మాయను నేను


జీవం వెతికే మరణం నేను

మరణం వసించే జీవం నేను


నేను నేనే,

నన్ను ఆపే శక్తి లేదు, 

నేను దాటని ప్రళయం లేదు

---

నేను  నీ కాలాన్ని


(మొదటి చిత్తు ప్రతి/First rough draft:


I'm a Tsunami, I submerged an Ocean

I'm Lava, I melted a volcano

I'm Blackhole, I ate a Galaxy

I'm Storm, I vapored all clouds

I'm Me, Only Me Everywhere)

నాన్న

నీవు ఓటమి ఊబిలో మునిగిననాడు,
నీవు భవసాగరసుడిలో చిక్కిననాడు,
భుజంపై చేయి వేసి భయాన్ని తరిమేవాడు,
తన మాటతో ధైర్యం తెచ్చేవాడు,
ఒక్కడే ఉంటాడు నాన్న రూపంలో

నీ విజయం నువ్వు చూడనినాడు,
నీ బలం నువ్వు గ్రహించనినాడు,
కాబోయే విజేత కోసం సంబరపడేవాడు,
తన మాటతో ఉత్సాహం ఇచ్చేవాడు,
ఒక్కడే ఉంటాడు నాన్న రూపంలో

నీ కళ్ళు అహం తాగిననాడు,
నీ చేతలు సంస్కారం తప్పిననాడు,
మాయను తప్పించే ఆచార్యుడు,
తన మాటతో దిశా నిర్ధేశం చేసేవాడు,
ఒక్కడే ఉంటాడు నాన్న రూపంలో

విలువ

నింగిని కొలిచే పక్షి రెక్కల విలువెంత?
చిరుగాలిని ముద్దాడిన యవ్వనమంత
జోరుగాలికి ఎదురెళ్ళిన ధైర్యమంత
ఉరుముల రాగంలో ఆలాపించిన గానమంత
తారలలెక్కలు చూసిన నేరుపంత
తొలిచినుకుల స్వఛ్ఛమంత
మేఘపర్వతాలు అధిరోహించిన గెలుపంత

సాగరాన్ని కొలిచే చేప రెక్కల విలువెంత?
చిరుఅలలతో సయ్యాటలాడిన యవ్వనమంత
ఉప్పెనలకు ఎదురీదిన ధైర్యమంత
సముద్రపు గంభీరంలో ఆలాపించిన గానమంత
జలబిందు సైన్యపు లెక్కలు చూసిన నేరుపంత
ఆల్చిప్పలో దాగిన స్వఛ్ఛమంత
అఖాతాలలో ఈదిన గెలుపంత

మరి విశ్వాన్ని గెలిచే మనిషి రెక్కల విలువెంత?

నీవు

నీ లోతుని కొలిచే గ్రీష్మం వస్తే,
ఎడారివై వేడి నిట్టూర్పులు శ్వాసిస్తావా?
సముద్రమై అలల నవ్వులు చిందిస్తావా?

నీ ఎత్తుని కొలిచే ఉప్పెన వస్తే,
మొక్కవై మునిగిపోతావా?
శిఖరమై ధిక్కరిస్తావా?

నీ వేడిని కొలిచే శీతలం వస్తే,
జలమై హిమమైపోతావా?
హోమాగ్నివై ప్రజ్వలిస్తావా?

నీ ధైర్యం కొలిచే చీకటి వస్తే,
తారవై సాక్ష్యం అవుతావా?
కిరణమై చీకటి చీలుస్తావా?

నీ బలం కొలిచే శిశిరం వస్తే,
దేహమై రాలిపోతావా?
ఆత్మవై కొత్త కావ్యం లిఖిస్తావా?

శత శశి వెన్నెలలు

శత శశిబింబాల వెన్నెలలో మెరిసిపోయే వింతను నేను

శత ఋతువులు ఏకకాలంలో అనుభవించే యోగిని నేను

శతరాగ గీతమాలిక నేను

 

శత చంద్రుల వెన్నెలలో నిశిపై గెలిచిన విజేతను నేను

శత యుగాలు క్షణకాలంలో చుట్టివచ్చిన ఆత్మను నేను

శతకావ్య మధురం నేను


శత సోమకాంతులతో అలరారే రారాజును నేను

శతసహస్ర క్షణాలు దాటలేని కాలాతీత క్షణాన్ని నేను

శతపద్మ వికసిత శోభ నేను

 

శత దిక్కులలో ఉదయించే ప్రభాతాన్ని నేను

శత కాలాలను శాసించే అనంతాన్ని నేను

శతపద నటవిన్యాసం నేను

మూడు అడుగుల్లో విశ్వరూపం, మూడు పదాల్లో ఆత్మశోధన - సిరివెన్నెల గారికి నా నివాళి

"చందమామ రావే జాబిల్లి రావే" అంటూ మొదటిసారి ఆయన పాట విన్నాను. ఆ పాట ఎంత చిన్నపిల్ల కోసం  పాడారో సుమారు అంతే వయసు నాది ఆనాటికి. కృష్ణుడు ఆడుకున్న బృందావనం నా కళ్ల ముందు ఉన్నట్టు అనిపించింది. నిజానికి అప్పటికి  ఆ పాట అర్ధం అయ్యి కాదు, ఎందుకో నా హృదయానికి అలా హత్తుకుంది. 

ఆ తరువాత ఒకసారి, మా నాన్న, ఆది బిక్షువు పాట గురించి గొప్పగా చెప్తూ పొంగిపోవడం చూసాను.

కొన్నాళ్ళకు కౌమారంలో ఒకసారి మా మాష్టారి ఇంట్లో, "అందెల రవమిది పదములదా" అంటూ టివి లో పాట వస్తుంటో హటాత్తుగా ఆయన మొహం ఆనందంగా వెలిగిపోవడం చూసాను. ఈ పాట అర్ధం ఏంటి అని అడిగి చెప్పించుకున్నా.

మరికొన్నాళ్లకు కాలేజీలో ఉన్నప్పుడు ఖడ్గం సినిమా చూసొచ్చాక, రోజుకు పది సార్లు "నువ్వు నువ్వు" పాట వినేవాడు మా కమల్ గాడు. నేను, సాయి "ఖడ్గం" పాటలో "కెంజాయ " అనే పదం అర్ధం ఏంటి అని చర్చించుకునేవాళ్ళం. 

"జాలిగా జాబిలమ్మ" అనే పాట విన్న ప్రతీసారీ నా మనసులో శివుడు వినాయకుడు బంధం గురించి ఈ దృష్టిలో చూడొచ్చా అని ఒక ఆశ్చర్యం.

"ఘల్ ఘల్ ఆకాశం తాకేలా" పాట వింటూ మురిసిపోయిన రోజులు ఎన్నో లెక్కేస్తే కాలెండర్ మారిపోతుంది.

జర్మనీలో కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాట రోజూ నన్ను "ఛలోరే ఛలోరే" అంటూ మంచు తెరలు తొలగిస్తూ ఉషోదయం తెచ్చేది.

వామనుడు త్రివిక్రముడై మూడు అడుగుల్లో లోకాన్ని కొలిచినట్టు,
ఈయన మూడు ముక్కల్లో జీవితాన్ని కొలుస్తారు.

ఆయనకు నా శతకోటి నమస్సులు !!!!

మారణ హోమం

చేయూతనివ్వక,
ఓదార్పునివ్వక,
సానుభూతి చూపక,
ఈ సమాజం ఏనాడో చచ్చింది

యమపాశం తగలక ముందే,
రుధిరప్రవాహం ఉండగానే,
మస్తిష్కం మథిస్తుండగానే,
శ్మశాన ప్రణయంలో మునిగిన సమాజం ఇది

రక్కస రాజుల అర్చనలో,
చితిమంటల హోమంలో,
కళేబరాల కౌగిట్లో,
మైమరిచిపోతున్న మృతసమాజం ఇది

ప్రళయంతో ప్రణయిస్తూ,
ప్రాణంతో కలహిస్తూ,
ప్రణవంతో విభేదిస్తూ,
భస్మమైపోతున్న అవివేక సమాజం ఇది

(కరోనా దాడిలో ఈనాడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బ్రతికున్న శవాల మధ్య చచ్చిన శవాలు ఉన్నట్టు అనిపిస్తోంది. 

బాధ్యతలు మరచిన ప్రభుత్వాలు, బద్ధకం నిండిన ఉద్యోగులు, అపోహల్లో మునిగిపోయిన ప్రజలు. ఈ సమాజం ఏనాడో చచ్చింది. అక్కడక్కడా ఒక్కో జీవకణం మిగిలింది అంతే)

నీవు లేక

నీవు లేక,

ఎన్ని రాత్రులు ఒంటరిగా గడిపానో, 

ఎన్ని పగల్లు నిస్తేజంగా ఉదయించాయో,  

ఎన్ని మాటలు శూన్యంలో కలిసిపోయాయో , 


నీవు లేక,

ఎన్ని భావాలు ఆచూకీ లేకుండా పోయాయో,

ఎన్ని క్షణాలు యుగాలై నిలిచాయో,

ఎన్ని శూన్యాలు నన్ను మింగేసాయో,


నీవు లేక,

ఎన్ని సార్లు నా ఆచూకీ అన్వేషణ చేసానో,

ఎన్ని సార్లు భారంగా యుగాల ఎడారి దాటానో,

ఎన్ని సార్లు నన్ను నేను శిక్షించుకున్నానో,


నీవు లేక,

ఎన్ని సార్లు నా అన్వేషణలు శూన్యాన్ని చూపాయో,

ఎన్ని సార్లు ఎడారి దారుల్లో హిమానదాలు కవ్వించాయో,

ఎన్ని సార్లు నా శిక్షల ఆకలి తీరలేదో!!


ఎవరు నీవు,

నీవు బందం అయితే నేను అనాధని,

నీవు జ్ఞానం అయితే నేను అజ్ఞానిని,

నీవు పరమాత్మ అయితే నేను జీవిని.

ఇక నేను లేను

 సముద్రమంత ప్రేమ
        వర్షమై నన్ను తడిపేస్తే 

ఎడారంత విరహం
        గ్రీష్మమై నన్ను కాల్చేస్తే 

కాలమంత ఎడబాటు
        క్షణమై నన్ను కమ్మేస్తే 

జీవితమంత వాస్తవం
        మాయలా నన్ను ముంచేస్తే