చిన్ని ఆలోచన - అనంత జాగృతి


నిశ్చల సరసుపై అడుగిడిందొక చినుకు, వేయి తరంగాల ఆహ్వానాన్ని అందుకుంది
ప్రశాంత ఉదయపు ఆకసంపై నర్తించిందొక విహంగం
, వేయి కిరణాల పలకిరింపునందుకుంది
నిశ్శబ్ద పవనాన్ని పలకరించిందొక రాగం
, వేయి స్వరాల గానాన్ని ఆస్వాదించింది

అమాస చీకటితో పోరాడిందొక నిప్పురవ్వ, చుక్కల సైన్యపు శంఖారావమైనది
శిశిరపు పూతోటలో కూసిందొక కోయిల
, నవ వసంత గానమైనది
బాధాతప్త హృదయం రాల్చిందొక కన్నీటి బొట్టు, కోటి హృదయాల ఆలంబననందుకొంది
 
దుర్బల అల్ప జగతిని తాకిందొక ఆశాకిరణం, అనల్పమై జాగృతమైనది జగతి
విరహపు ఎడారిని తాకిందొక ప్రణయ మారుతం, ఎడారి నందనవనమైనది
శూన్యాన్ని పలకరించిందొక ఓంకారం, అనంతమై ఎదుట నిలిచింది విశ్వం