అక్షోర్ణవ హిమబిందువై మొదలై
అక్షాంశమువోలె మిథ్యారేఖయై
అక్షౌహిణీ సమూహమై ఘనీభవించి
అక్షయమై హిమశిఖరమై ధృఢకుడ్యమాయె
ద్రవించదు ఈ హిమశిఖరము,
కవ్వించి కదలదు ఆ కుడ్యము
కవినై మేఘసందేశమంపినా
ఆ విధి చూపుకు దారితప్పె మేఘములు, నా సందేశములు
కనుల ముందున్న శిఖరాధిరోహణే శరణ్యము,
అనన్యము ఆ అధిరోహణ, శిఖరము కోరె శరణ్యము
ఆనందము అర్ణవమై వెలికి వచ్చె, హిమముతో జతకట్టె
తునకగా మొదలై తునాతునకలు చేయు మంచుగడ్డయై దుమికె
ఆరంభమాయె ఆనందార్ణవ ప్రవాహము
వర్త్మము వెతుకు అవరోహణకు తానే చూపె బాట
పర్వత పాదమునున్న నీ అశ్రువుల తుడిచి,
పరవశమొంది దూకితిమి జతయై ప్రణయపు నదియై
విరహము హిమశిఖరమువోలె భయభ్రాంతిన ముంచవచ్చు
కరుణ లేదని విధిని నిందించవచ్చు, శిఖరాధిరోహణతో
విరహము పరాజిత కాదు, అధిరోహణకు తోడుండి,
అవరోహణమును దీవించి ప్రణయముగా జీవనదిగా చేయదా
విరహము కరగదా... ప్రణయపు నదిగా ఉప్పొంగదా.. ప్రేమికుల దీవించదా