శ్వేతశిఖరాలపై ధ్యానముద్రన మునిగి ఉన్నాడు ఆ శంకరుడు
శివుడు బాధలోనున్నాడేమో ప్రకృతి కూడా నిర్వేదంగా ఉంది,
ఆ నిర్వేదపు శిశిర ప్రకృతికి ఏకైక శోభ ఆమె, పార్వతి
ఆ శంకరుడు కొలువున్నది ఆ పార్వతి హృదయశిఖరాలపైనేమో
ఆమె హృదయమున ఏనాడో ఆసీనుడాయెను ఆ శంకరుడు
అది తెలియని బేల కాదే ఆ పార్వతి,
వారి వివాహసమయం కోసమే కాదా ఆ నిర్వేదపు ప్రకృతి ఎదురుచూపులు
అదీ తెలుసు ఆ పార్వతికి...
ఆ ధ్యానముద్రను కదలించ శివుని కంఠమున దాగిన గరళం
మూడోకన్నున వెలువడునని తెలియునే
తెలిసిననూ ముందుకు సాగెను మన్మధుడు వారించు రతీదేవిని తోడ్కొని
మన్మధునికి ఆ ధైర్యమేలనో.... విధి నిర్వహణను నమ్మిన యోగేమో ఆతడు
కోయిలలచే కూయించెను, మల్లెల సువాసనలు వెదజల్లెను
సుందరీమణులతో నాట్యము చేయించెను
ఎన్ని యత్నములనైనూ చెక్కుచెదరలేదు ఆ శంకరుడు
బ్రహ్మాస్త్రమో మరేమో, ఆ హరిని ప్రార్ధించి "హరివిల్లు" ను ఎక్కుపెట్టె
శ్వేతశిఖరపు మంచుని కరిగించి
శ్వేతశిఖరపు సిగలో అందమైన ఒక చిత్తరువు గీచెను
ఆ చిత్తరవు గీచినంతనే ధ్యానముద్రను వీడెను ఆ శంకరుడు
భస్మీపటలమాయెను మన్మధుడు,
భస్మమాయినది మన్మధుడు కాదేమో?
శ్వేతశిఖరముపై హరివిల్లుని కనిన అనిర్వచనీయ అనుభూతిన
బూడిదయ్యినది కామమేమో ?
రతీదేవి దు:ఖమును తీర్చ ఆమెకు ప్రసాదించే తన ధ్యానసాధన
శ్వేతశిఖరమున హరివిల్లు కనిన క్షణం ఒక జంట కలిసె,
మరొక జంట ధ్యానముద్రన మునిగె
ఆ జంటను కలిపెడివాడు మన్మధుని పంపిన హరే కదా
ఈ జగన్నాటకసూత్రధారే కాదా ఆ నల్లన్నయ్య
(హరివిల్లు అనే టపాలో మూడు కవితలు రాసాను. ఇది సప్తకవితల సంకలమున నాలుగవది)