ఇహ లోకం నుంచి అహో లోకంలోనికి–2

పడమట మమ్మొదిలేసిన సూరీడు తూరుపు వైపు పరిగెట్టుకొచ్చి పదండి ఎల్లోరా అందాలు చూపిస్తా అంటూ తీసుకుపోయాడు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదైన గురుష్నేశ్వర్ ఆలయ దర్శనంతో మొదలైంది ఎల్లోరా పయనం. ఆలయనిభంధన ప్రకారం పురుషులు చొక్కాలు ధరించకూడదంటే సిగ్గు పడ్డ అబ్బాయిలు, అమాయికంగా అవునా అన్న అమ్మాయిలు దర్శనసమయంలో మరో పిడకల వేట. తొలిసారిగా ఒక శివలింగాన్ని స్పర్శించి, లోకాన్నిమరచిపోయి, తనివితీరా ఒక అయిదు నిమిషాలు శివున్నే చూసి నెమ్మదిగా బయటకు నడిచాను. (ఈ క్షేత్ర కధ తరువాత చెప్పుకుందాం)

ఎల్లోరా గుహాలకు చేరుకున్నాక గైడ్ చెప్పిన విశేషాలు

“ఒక ప్రసిద్ద చరిత్రకారుడు ఎల్లోరా గురించి చెబుతూ,ఆలయాలు కూలిపోవచ్చు, భవనాలు శిధిలమవ్వచ్చు, అయినా సరే ఎల్లోరా ఎప్పటికీ నిలిచే ఉంటుంది, ఒంటరిగా భారతదేశ చరిత్రను సగర్వంగా చాటిచెప్పుతూ ఉంటుంది అన్నాడు. ఇక్కడ మొత్తం 36 గుహలు నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి, వీటిని పూర్తిగా దర్శించాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది, మీరు నాలుగు గంటల్లో చూడబోతున్నారు. అన్నీ కొండను తొలిచి కట్టిన ఆలయాలే, ఈ ఆలయాలు ఆనాటి మత సామరస్యాన్ని చాటి చెపుతూ ఉంటాయి. ఒకే ఆలయంలో బౌధ్ధ జైన హిందూ ప్రాంగణాలు నిర్మించారు.”

మొదటగా బౌధ్ధ ప్రార్ధనా మందిరంతో ప్రారంభించాం సందర్శన. లోపల బోధనా ముద్రలోనున్న బుద్దుడు, పైన భోధి వృక్షం, బుధ్ధుని శిరస్సుపై సూటిగా పడే సూర్యకిరణాలు, ఆ విగ్రహంలో ఎంతో జీవం, ఆ శిరస్సులో కనిపించే మృదుత్వం, అంతా రాయితోనే చేసారంటే నమ్మశక్యం కాదు. కొండను తవ్విన మందిరం ఒక వింత అనుకుంటే, అదే మందిరంలో చిన్న నీటి కొలను అదే మందిరం క్రింద. ఈ మందిరంలో చేసే ప్రార్ధన మనసును తాకేలా అధ్భుతమైన సంగీతాన్ని సృష్టిస్తుంది. ప్రేమలేఖల పోటీ అయ్యింది కనుక ఈనాడు మందిరంలో “ఓంకారం” ప్రవచించే పోటీ పెట్టుకున్నాం. ఉచ్చరించే ఓంకారం మందిరమంతా వినిపిస్తుంటే మనసంతా ప్రశాంతత నిండిపోయింది, పోటీ సంగతే మరచి అలౌకిక భావనతో నెమ్మదిగా బయటకు వచ్చాం.

అక్కడి నుంచి చిన్న పరుగుపందెం పెట్టుకుని శివాలయం చేరుకున్నాం. ఈ శివాలయం జ్యోతిర్లింగాలయం కాదు, అయితే ఇది కొండను తవ్వి కట్టినదే. ఈ ఎల్లోరా గుహలలో ఇదే అధ్భుతమైనదని చెప్పారు, కాదు నేను కూడా అదే చెపుతున్నాను. ఇలాంటి ఆలయం నేను ఇంతవరకు చెప్పలేదని ఘంటాపధంగా చెప్పగలను.ఆలయంలోకి అడుగుపెట్టగానే స్వాగతం చెపుతూ రెండు ఏనుగులు (ఒక ఏనుగును సగభాగం పైనే ధ్వంసం చేసారు) ఇరువైపులా, వాటి వెనుకగా రెండు ధ్వజస్థంభాలు, ధ్వజస్థంభంపై శిల్పకళ. రెండంతస్థుల ఈ శివాలయంలో గరుడ వాహనుడైన విష్ణుమూర్తి ప్రతిమలు, విష్ణు అవతారాలు, పద్మాసనుడైన శివునికి ఎదురుగా దుష్ట శిక్షణ చేస్తున్న కాళిక, పక్కనే కైలాసాన్ని కదిలించ ప్రయత్నం చేస్తున్న దశకంఠుడు,ఆలయం గోడపై (ఆలయం చుట్టూ ఉండి కనుక గోడే అనాలి, నిజానికి ఇది ఒకే రాయి) మహాభారత గాధ, ప్రతీ విగ్రహం సంపూర్ణ జీవకళతో అడుగుల బంధనం చేస్తుంటాయి. ఆలయానికి చుట్టూ కొండను తవ్వి కట్టిన హోమశాల, మరో శివాలయం అద్భుతంగా ఉన్నాయి. అయితే, హోమశాలలోని విగ్రహాలన్నీ ఎవరో ముక్కలుగా చేసిన ఆనవాలు. బహుశా విగ్రహ సౌందర్యం తమకన్నా బాగుందనేమో అసూయ ఏమో. (ఎవరో రాజులు దండయాత్ర చేసి ఇలా ముక్కలు చేసి ఉండవచ్చు, అయితే మంచి మూడ్ లో ఉన్నాను కనుక ఆ దండయాత్రల గురించి తరువాత మాట్లాడుకోవచ్చు)

ఏ శివాలయంలోనైనా నందీశ్వరుడు శివునివైపు సూటిగా చూస్తుంటాడు. మరి ఎందుకో ఈ ఆలయంలో మొదటి అంతస్తులో ఉన్న నందీశ్వరుడు కుడివైపుకు చూస్తున్నాడు. అయితే ఆ వైపు క్రింది అంతస్తులో హోమశాల పక్కనే మరో చిన్న శివాలయం ఉంది. అర్ధమయ్యీ అర్ధం కానీ అంతరార్ధం ఏదో కనిపిస్తోంది. అయితే ఇంత అధ్భుతమైన ఆలయంలో నిత్యపూజలు జరుగుతున్న ధాఖలాలు ఏమీ కనిపించలేదు. శివాలయం బయటి నుంచి చూస్తే ఏదో చందమామ కధలో చెప్పిన వర్ణన అంతా గుర్తుకొచ్చింది. (కధల వర్ణనలకు మూలం ఎచ్చటో దాగిన వాస్తవాలే కదా)

అక్కడి నుంచి జైన మహావీరుడి ఆలయానికి చేరాము. ఆలయానికి బయట రామ్ గోపాల్ వర్మ సినిమా శైలిలో ఒక మర్రిచెట్టు (దీనికీ, చరిత్రకూ ఏమీ సంబంధం లేదు) ఆలయం అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. ఈ జైన ఆలయం కూడా రెండంతస్తులు. పాముపడుగలో నించున్న మహావీరజైనుడు, ధ్యాన ముద్రలోని బుద్దుని విగ్రహాలు, సన్నని మెట్లు. అందం రాయిదా? రాయి చెక్కిన శిల్పిదా? చూస్తున్న కళ్ళదా?

ఇక, ఇవే కాక చిన్న చిన్న గుహలు కూడా అధ్భుత శిల్పాలతో నిండి ఉన్నాయి. అక్కడి నుంచి ఔరంగాబాద్ బయలుదేరాం, దారిలో శతృధుర్భేధ్యమైన దౌలతాబాద్ కోటను బయటి నుంచి చూసాం. ఈ కోట కొండను చెక్కి పిరమిడ్ ఆకారంలో కొండను తయారుచేసి నిర్మించారు. కోటకు ఎదురుగా ఉన్న మీనార్, కుతుబ్ మీనార్ తరువాతి స్థానాన్ని ఆక్రమిస్తుందట.
తరువాత ఔరంగాబాద్ చేరాము.

“మనిషి చనిపోయాక ఎంత భూమి కావాలి?”, నిజంగా ఆరడుగులేనా? ఏమో చేతిలోని డబ్బు, అధికారం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుందేమో? ఒక తాజ్ మహల్, ఔరంగాబాద్ లోని మినీ తాజ్ మహల్, వందల పిరమిడ్లు అన్నీ ఇవే సమాధానమిస్తున్నాయి. నిజంగానే ప్రాపంచిక విషయాలు మరణం తరువాత ముగుస్తాయా? బహుశా దేవుడే సమాధానమివ్వాలి. దేవుడిని ప్రశ్నించే అధికారం లేదు, మనిషిని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు.

చివరకు రోజు ముగిసింది, మా యాత్ర సైతం ముగిసింది. అజంతా, ఎల్లోరా అందించిన చిత్రా, శిల్ప జ్నాపకాలతో రైలు ఎక్కి ఇహలోకానికి తిరిగి ప్రయాణం సాగించాం.

“సమయం పరుగెడుతుంది, మనసు ఒకచోటే ఆగిపోతుంది”

2 comments:

మనోహర్ చెనికల said...

'దేవుడిని ప్రశ్నించే అధికారం లేదు"
నిజం చెప్పాలంటే ఆ అధికారం మనకొక్కళ్ళకే ఉంది నా నమ్మకం. ఎన్నిసార్లు అర్ధం కాక అడిగినా తండ్రి విసుక్కోడు కదా. మరి వాళ్ళిద్దరూ "జగతః పితరౌ వందే" కదా.
ఇక ప్రాపంచిక విషయాల గురించి వస్తే , మనం నిర్ణయించుకుంటే వాటిని ఇక్కడ ఉండగానే ముగించవచ్చని నా నమ్మకం. ఇక మీరన్నట్టు ఆరడుగులని అర్ధం చేసుకుంటే సమస్యే లేదు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

Agreed, Manohar