ఇహ లోకం నుంచి అహో లోకంలోనికి - 1

ఇహలోకం నుంచి పరలోకం వెళితే మిగిలేది బహుశా ఆరడుగుల నేల కావచ్చు, కానీ అహో లోకానికి వెళితే జీవితాంతం వెంటాడే తీయని జ్నాపకాలు.
వాటిలో కొన్ని....

నెల క్రితం,
“ప్రియమైన సి ఎమ్ సి పురవాసులారా
, ఇందుమూలముగా అందరికీ తెలియజేయునదేమనగా అజంతా ఎల్లోరాలలోని అందాలను సందర్శింపజేయ పురపాలకసంఘము నిర్ణయించినది. కనుక, ప్రయాణానికి సముఖులైనవారు పేర్ల నమోదు కార్యక్రమములో పాల్గొని నమోదు చేయించుకోవలెను”
ప్రకటన వినగానే, తరువాత చూద్దాములే అని పక్కన పెట్టేసా. తరువాతి రోజు ఉదయం స్నేహితులంతా వెళ్తున్నాం అనే సరికి ఎలాగైనా సాధించాల్సిందే అని పరిగెత్తుకుని పురపాలక సంఘానికి వెళ్తే, ఇప్పటికే లిస్ట్ తయారయిపోయింది, పేరివ్వండి పరిగణలోనికి తీసుకుంటాం అనేసరికి ఉసూరంటూ వెనక్కి తిరిగి వచ్చేశా.

నెల తరువాత,
“మేము ఊహించినదానికన్నా ఎక్కువ మంది ఉత్సాహం చూపించారు
, వీలైనంత మందిని కలిపి మొత్తం మూడు వందల మందికి అనుమతి లభించినది. కనుక వీరందరూ శుక్రవారం సాయంత్రం ప్రయాణానికి సిద్దం కావలెను అని మనవి చేయబడినది”

పురప్రజలంతా కళార్జితులై ప్రయాణాన్ని ప్రారంభించారు. (వారిలో నేనొకడిని)

చిన్నప్పుడు విన్న కధలు, చూసిన షోకేస్ బొమ్మలు కలలో రమ్మని పిలుస్తుంటే రాత్రి నెమ్మదిగా సాగి రైలు ఔరంగాబాద్ నగరాన్ని చేర్చింది.

ఘాట్ రోడ్ పై రెండు గంటల ప్రయాణం సాగిస్తే అజంతా గుహల వద్ద పద్మపాణి” సాదర స్వాగతం చెప్పాడు. ఈ ప్రయాణంలో మా గైడ్ చెప్పిన వివరాలేమనగా
“అజంతా నగరం ఎంతో పురాతనమైనది. ఇది క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుంచి ఉన్నది. బౌద్దమ్ అవలంబించిన సాధువుల ప్రార్ధనా స్థలమిది. ఈ నగరం సుమారు ఎనిమిదవ శతాబ్దంలో అదృశ్యమైనది. తిరిగి 1890వ సంవత్సరంలో ఒక ఆంగ్లేయుడు పులివేటకొచ్చి దారి తప్పి ఈ నగరాన్ని కనుగొన్నాడు. అప్పటి నుండి ఆర్కియాలజీ శాఖ ఎంతో జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తోంది. అజంతా గుహాలన్నీ అధ్భుతమైన చిత్రాలతో నిండి ఉంటాయి. కనుక ఈ గుహాలలో ఫ్లాష్ కెమెరాలు వాడుట నిషేధించబడినది. అజంతా గుహలు సుమారు మూడు కిలోమీటర్ల మేర విస్తరించబడినవి. అయితే ఈనాటికి సైతం సారి అయిన దారి లేకుండా ఉన్న గుహలు కొన్ని ఉన్నవి. ఈ గుహాలన్నిటిలోనూ బుద్దుని విశిష్టతను చూపే చిత్రాలు
, శిల్పాలు అనేకం.”

గైడ్ కధ చెప్పాక అసంధర్భ ప్రేలాపనలాగా ప్రేమలేఖల పోటీ పెడితే, “మన మధ్య దూరం ప్రేమను తరిగింపలేక రెట్టింపై, నిన్ను చేరలేనంత దూరం నన్ను ఇంకా ఏడిపిస్తోంది. ప్రతి నీటిబొట్టులో నీవే, ప్రతి కన్నీటి బొట్టూ నీకోసమే, ప్రతి ఆలోచనా నీదే,నీ లేని నేను నేనుగా ఉండలేను” అంటూ రాసి ఒకమ్మాయి గుండెలు పిండేసింది. ఇంతలో మరో అబ్బాయి “same as our lover boy” అంటూ నవ్వులు పూయిస్తే, మరో అమ్మాయి “I would like to spend most of life with you” అంటూ ఉద్యోగ ధరఖాస్తు ఒకటి పడేసింది. అమ్మో బోలెడు పక్కదారి పట్టేసాం, ఇక రహదారికి వచ్చేసి ముందుకు పోతే

కొండ కింద నుంచి పైకెక్కాక అధ్భుత ప్రకృతి వీక్షణం. ఒక్కసారి నయగారా జలపాతాలు గుర్తుకొచ్చాయి. రెంటికీ లంకె ఎలా అంటే, నయగారా మరియు అజంతా రెండూ ఉండేది “గుర్రపు నాడా” ఆకారంలో. ఒక క్షణం అలా నయాగారా జలపాతాన్ని అజంతాలో ఊహించి అజంతా గుహాలవైపు అడుగేసా.

కొండలు కదా అని షూస్ వేసుకొస్తే ప్రతీ గుహ ఒక గుడి కావడంతో, ప్రతి గుహ వద్దా షూస్ తీస్తూ ఉండడం, మళ్ళీ పరుగులు పెట్టడం, ఈ యాత్రలో పిడకల వేట.

మొత్తం సుమారు 30గుహలు, సమయాభావం వల్ల (అంటే సమయంతో వచ్చే భావం కాదు) నేను చూసినవి 15. ప్రతి గుహలో నా ప్రియ మిత్రం చీకటి జడలు విరబోసుకుని నాట్యం చేస్తోంది. పెయింటింగ్స్ ఇప్పటికే పాడయిపోయాయి, ఇక సూర్యరశ్మి గానీ, శక్తివంతమైన దీపాలు కానీ పెడితే ఎక్కువ రోజులు కాపాడలేమ్ అంటూ సెలవిచ్చాడు. చీకటి నాట్యాన్ని ఆపమని “కళ్ళను” పెద్దగా చేసి జాగ్రత్తగా ఒక్కో గోడనూ చూస్తూ పోతుంటే, గోడ పైన చూడండి అన్నాడు గైడు. పైనేముంటుంది, అని చూస్తే “సీలింగ్ పెయింటిగ్స్”. ఒక్కో మూలకు టార్చ్ వేస్తూ చూపిస్తూ వాటి వెనుక కధను చెప్పసాగాడు గైడు. వాటిని జాతక కధలంటారని అప్పుడే తెలుసుకున్నాను. సీలింగ్ పెయింటింగ్స్ అనగానే యూరప్ లోని చర్చిలవైపు మనసు పోయింది. అవన్నీ చాలా వరకు 14, 15 శతాబ్దాలలో కట్టినవి. అవీ అధ్భుతాలే, అయితే అగ్రతాంబూలం అజంతాకే ఇవ్వాలి. ఏనాడో గీసిన చిత్రాలు , అడవిలో మునిగిపోయి వేయి సంవత్సరాల తరువాత సైతం అదే అందం అందించగలగడం నిజంగా అధ్భుతమే.

అడవి మంచంపై చెట్ల దుప్పటి కింద నీ వేయేళ్ళ నిద్ర తరువాత నిన్ను చూసి మురిసింది ప్రపంచం. భారతదేశ చరిత్రను సగర్వంగా చెప్పే సాక్ష్యం నీవు.

ఇహ తిరిగి వచ్చేప్పుడు ఏదో తెలియని ఆస్థి నాతో తీసుకు వస్తున్నా అన్న భావన, అందమైన ప్రకృతి కౌగలింత నుంచి వెలికి వస్తున్న విరహ వేదన. ప్రకృతి అంటే గుర్తుకొచ్చింది, ప్రేమలేఖల పోటీలో
“Sun awaits for us to get together, Breezes blaze around us to get together, Green showers back to us to get together,
What are you waiting for, my love? When this nature itself wishes to get us together.”
అంటూ ప్రకృతి చుట్టూ ప్రేమను రాసాడో అబ్బాయి. మరో ప్రేమలేఖ మరోసారి, రోడ్డు ఎల్లోరా వైపు పిలుస్తోంది, కానీ సూరీడుకు వేరే ఏదో ఆలోచన ఉండి మమ్మల్నొదిలి పడమటి తీరాన్ని చేరాడు.

రాత్రికి కాంప్ ఫైర్ మామూలే, నేను డాన్స్ చేసే ప్రయత్నం చేయడం, చివరికి స్టేజ్ మీద ఒక్కడినీ ఇద్దరు డాన్సర్ల మధ్య మిగలడం వెరైటీ.... చేతులు ఊపడమే డాన్సయితే నేను కూడా డాన్స్ చేసానోచ్.

పడమట మమ్మొదిలేసిన సూరీడు తూరుపు వైపు పరిగెట్టుకొచ్చి పదండి ఎల్లోరా అందాలు చూపిస్తా అంటూ తీసుకుపోయాడు.

(ఎల్లోరా అందాలు తరువాతి భాగంలో)