స్వప్న విహారం

2 స్పందనలు
కళ్ళ ముందు నీవున్నావన్న ఊహలో కళ్ళు మూసి నిదురోయిన వేళలో కళ్ళ వెనుక స్వప్నమై..
to be continued !!!

ఈ క్షణం అనంతం

7 స్పందనలు

మరణపు కౌగిలి నుంచి వెలికి వచ్చినట్టు
మండే గుండెల మంట ఆరినట్టు
అలసిన మేనికి నీరందినట్టు
ఏమని చెప్పను ఈ క్షణాన్ని

నడి సంద్రంలో తీరం కనిపించినట్టు
రాలిపోతున్న మేనికి రెక్కలొచ్చినట్టు
చీకటికోటలో వెలుగు దివ్వె దొరికినట్టు
ఎలా చూపను ఈ ఆనందాన్ని

విజయతీరాన్ని చేర్చే చివరిఅడుగులో దాగిన ఉత్సాహం
విజయపు శిఖరంపై నిలిచిన క్షణమాత్రపు గర్వం

ఆ క్షణం అంతమెరుగని అనంతం
ఆ ఆనందం ఎంత చూచినా తరగని సాగరం
ఆ ఉత్సాహం మరో మజిలీకి శ్రీకారం




నాతో పోరాటం

9 స్పందనలు

పోరాటం నాతోనే
విజయం నాకే, అపజయమూ నాదే
నాతో నాకే శతృత్వం
నాపై నాకే లాలిత్యం

ప్రణయపు అరణ్యంలో
వేచి చూస్తున్న కన్యను చేపట్టమని పరుగులు తీసే మనసు

అది ప్రణయపు అరణ్యము కాదు,
ప్రళయాలను దాచిన ఎడారి అని అడుగాపే తెలివి

ఎడారి కాదది ఇరు ఎదలకు పరచిన దారని
పరుగిడమని ముందుకు పోయే మనసు

ఈ రెంటి పోరాటంలో గెలిచిన వారికి తోడుగా విధి
విధిని గెలిచే ప్రయత్నం కాదిది, వలచే ప్రయత్నమిది

విజయతిలకమైనా, వీరస్వర్గమైనా చేపట్టేది నేనే

మనసూ, తెలివి కలిసిన చోట పోరాటం జరగదు, జరిగేది పయనం
మనసూ, తెలివి పోరాడిన నాడు వచ్చేది ప్రళయం,
ప్రళయం నుంచి దూరంగా పయనం జరపాలి,
పయనిస్తూ విధిని తోడుగా తీసుకుపోవాలి

కలలు – నీటి మీది రాతలు

9 స్పందనలు

కలలా వస్తావు, కలలా పోతావు
కలంరాతలా కలకాలముండరాదా
నీ ఊహలో వెచ్చబడి నిదురపోదు మేని
నిదురరానిదే కలలో కానరాదు నీ రూపు

కలలన్నీ కల్లలని కలలు కనని వారే అంటారట
కలలు వచ్చేది నిదురలోనా ?
కలలను స్వాగతించ వచ్చేది నిదురా ?

కలలన్నీ నీటి మీద రాతలట నిజమేనా ?
అవి మనసున్నవారే చదవగలరని చెబితే ఏమంటారో
రాతలు రాసిన చేతులేవని అడుగుతారా
నీటిలో వచ్చే తరంగాలను తోడు చూపనూ
మనస్సనే నీటిలో ఊహలనే చేతులు రాసే గీతలే కదా కలలు
ఆ మనో కడలి లోతు చూసినదెవరులే
ప్రతి ఉషస్సున తోడున్న నీతోడి కలలేగా

కలలన్నీ నీటి మీది రాతలే
కొన్ని రాతలు రాస్తూనే చెరుగుతాయి, ఎవరో చేయాడించినట్టు
కొన్ని రాతలు సుడిగుండాలను సృష్టిస్తాయి, ఎవరో చెయ్యిపెట్టి తిప్పినట్టు
కొన్ని రాతలు నీటిలోతును చేరి కలకాలముంటాయి, నదీ గమనాన్ని నిర్ధేశించే మలపులులా



ఏరా రోయ్

7 స్పందనలు

" ఏంటి అస్త్ర శస్త్ర సన్యాసం చేసేసేవంట, ఏమి రోయ్ "

" ఎవరన్నారు"

" ఒకరనేదేమిటోయ్ ... నేనే అంటున్నా "

" ఏంటట సాక్ష్యం "
" ఏమి రాస్తున్నావు ఈ మధ్య?, పేరేమో అర్జునుడి బాణాలు అని గొప్పగా పెట్టావు "

" ... "

" అసలు నీ రాతలేమిటోయ్.. శూన్యమా... నిశ్శబ్దగీతమా.. అది సరే గానీ ఈ మధ్య ఎవరినీ పలకరించటంలేదట, ధ్యానమా, సన్యాసమా "

" ... "

" ఏం ఈ మధ్య ఎవరినీ విమర్శించటం లేదట, ఎవరినీ పొగడను కూడా పొగడడం లేదట "

" అయ్యిందా నీ విమర్శల పర్వం "

" ఆ చెప్పాలంటే చాంతాడంత ఉందిలే. ముందు నువ్వు చెప్పు ఏంటి సంగతి "

" ఒరే బాబూ, ఇలా అన్నానని నన్ను ముసలాడిని చేసేసి నువ్వు పసిబాలుడివనుకుని మునగచెట్టెక్కేవు "

" ముందు నువ్వు చెప్పవోయ్ "

" శూన్యంలోకి వెళ్ళడమూ, రావడమూ అంత త్వరగా జరిగే పనులేనా "

" ఏమిటోయ్ తలా తోకా లేకుండా వాగుతావ్ "

" ఏమీ లేదోయ్ , ఈ మధ్య మన మీడియాలో న్యూస్ చానెళ్ళు చూసి బుర్ర పిచ్చి ఎక్కిందిలే "

" నీ రాతలకూ, ఆ కోతలకూ సంబంధమేమిటట "

" ఆ కోతలు చూసి నవ్వొచ్చి, ఏమీ రాయలేకపోతున్నా "

" ఓహో, బాధిత పర్వంలో ఉన్నావా "

" ... "

" అయితే ఆ బాధలైనా రాయొచ్చు కదా "

" బాధల చేదుమాత్రలు కూడా పంచాలా "

" పంచితే, చేదు పోతుంది కదా. మిగిలేది ఖాళీ డబ్బా, ఆ డబ్బాలో రుచికరమైన మాత్రలు నింపొచ్చు కదా "

" నిజమేరోయ్ , అప్పుడప్పుడు నువ్వు కూడా బానే చెప్తావ్ "

" మళ్ళీ కోతలు, నేను నీ ఆత్మను రా. ఆత్మ మీద అనంత వృత్తం రాసేసేనని ఫోజు కొట్టావు. రాతలన్నీ కోతలేనా ? "

" అనంతవృత్తంలోనే చెప్పానుకదా, ఏదో ఒకటి నన్ను బయటకు లాగుతుందని. అదీ సంగతి "

" ఓహో అలా అన్నావా, మరి రాసేప్పుడు అన్నీ తెలిసిన వేదాంతిలా చెప్పావు "

" చెప్పడానికి వంద చెప్పొచ్చు, ముఖ్యంగా ఈ మధ్య వార్తా చానళ్ళు చూసాక తెలుసుకున్న నగ్న సత్యమిది "

" సమవర్తిలా వ్యవహరించాల్సినవే ద్వంద వైఖరి అవలంబిస్తుంటే, ఆ ద్వంద వైఖరిని ఆచరిస్తానంటావేం "

" నిజమేరోయ్ , ఈసారి చెవిలో దూది పెట్టుకుంటా, "

" మరి చేతిలో ఏమి పెట్టుకుంటావు ? "

" కలం, అదే నీ భాషలో బాణం "

" మరి ఎవరో నీ గురించి బెంగ పడ్డారంట వారి సంగతేమిటి "

" బెంగ పడితే దండగేనోయ్.... "
" ఆపు, మళ్ళా వైరాగ్యమా "

" సరే, ప్రయత్నిస్తాలే "

" మళ్ళా, లే అంటావ్ .. తంతా "

" ఇదే నీతో వచ్చిన తంటా. నే కదులుతా ఇంక, నువ్ పోవోయ్ అద్దం వెనుకకు "

" సరే మరి, పోతున్నా.. చూస్తూనే ఉంటా... "

" హమ్మయ్య "

--- రేయ్ మొద్దు నిద్రలో ఏమిటా కలవరింత, లే లేచి ఒక కవిత రాయ్