ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) – 8

అమెరికాలో బతకాలంటే ఏ భాష రావాలి ?
నాకు పిచ్చి ఎక్కలేదు కానీ ఈ ప్రశ్నకు సమాధానం "అమెరికన్ ఇంగ్లీష్"
భారతీయులు ఎక్కువగా అభ్యసించేది బ్రిటీష్ ఇంగ్లీష్. పైగా అమెరికన్ యాస ఎవరో తరుముకొస్తున్నట్టు సగం ముక్కలు చేసో లేక మొత్తం కలగాపులగం చేసేసో ఉంటుంది.
అందుకే అమెరికన్ నేలపై ఇంగ్లీష్ సినిమాలు చూడకుండానో అమెరికన్ వార్తా చానళ్ళు చూడకుండానో అడుగుపెడితే అత్యంత అయోమయ పరిస్థితిలో పడతాం. ఈ పరిస్థితి ఎలాంటిదంటే గోదావరి జిల్లా నుంచి హైదరాబాదు వచ్చినప్పుడు పడే పరిస్థితి అన్నమాట.
మనం చెప్పేది అవతలివాడికి అర్ధం కాదు, అవతలివాడు చెప్పేది మనకు అర్ధం కాదు. తీరా చూస్తే మాట్లాడే భాష ఒకటే.
ఉదాహరణకు " I'm good " అంటే అర్ధమేమిటి?
స్వచ్చమైన ఆంగ్లంలో "నేను మంచివాడిని" అనే కదా.. అదే అమెరికన్ ఇంగ్లీష్ లో "నన్ను వదిలేసి పోరా" అని మర్యాదగా చెప్పడమన్నమాట.
అంటే ఒకరకంగా చెప్పాలంటే, అమెరికన్ మాండలీకం ప్రత్యేకంగా ఉంటుంది. అది అర్ధం చేసుకునేసరికే కనీసం మూడు నెలలు పట్టొచ్చు.
ఇక్కడ అమెరికాలో నేను కలిసిన ఒక ఆంగ్ల ప్రొఫెసర్ చెప్పిన డైలాగ్ చెబితే సంపూర్ణంగా ఉంటుంది
" Most of Americans speak bad English "

కాబట్టి అమెరికా ప్రయాణం చెయ్యాలనుకుంటే ముందు అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంటే మన ఆంగ్ల విద్యా ప్రావీణ్యాన్ని మనమే తగ్గించుకోవాలి.
(నేను ఎలాగూ ప్రావీణ్యున్ని కాను కనుక పర్లేదు, అది వేరే విషయం). ఒక వేళ పొరపాటున షేక్స్ పియర్ రాసిన ఇంగ్లీష్ చదివి అమెరికా వస్తే మీ మతి చెడకుండా ఆ దేవుడే కాపాడు గాక.

ఒక వస్తువు ధర 9.87 డాలర్లు, పది డాలర్లిస్తే మీకు చిల్లర ఎంత రావాలి ?
ఇండియాలో అయితే సున్నా (డాలర్ల స్థానంలో రూపాయలు పెట్టుకోండీ)
అమెరికాలో (యూరప్ తదితర దేశాలలో కూడా) వచ్చే చిల్లర 13 సెంట్లు. ఇండియాలో పైసకు విలువ సంగతి తర్వాత అర్ధరూపాయికే విలువ లేదు. అది వేరే విషయం.

అమెరికా గురించి రాస్తూ అమెరికాలో విహార ప్రదేశాల గురించి రాయకపోతే ఈ వ్యాస పరంపరకు సరైన ముగింపు ఇవ్వనివాడినే అవుతాను.

నిజానికి అమెరికాలో నేను ప్రదేశాలు పెద్దగా చూసిందేమీ లేదు. ఫ్లోరిడాలోని డిస్కవరీ స్టూడియోస్ తప్ప.
నేను అమెరికా రాక ముందు చాలా మంది చెప్పారు, డిస్కవరీ స్టూడియోస్ కి తప్పని సరిగా వెళ్ళమని. నాక్కూడా వెళ్ళాలనే ఉండడంతో మొత్తానికి వెళ్ళడం జరిగింది.
అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో నన్నాకర్షించలేదనే చెప్పాలి. కారణమేమంటే ఎక్కువ ఉండేవి రోలార్ కోష్టర్లు.
ఒక్కో హాలీవుడ్ హిట్ సినిమా కాన్సెప్టుతో ఒక్కో రైడ్ అన్నమాట. అక్కడ ఉన్న నాలుగు రోజుల్లో ఒక్క రోజు అయ్యేసరికే ఉత్సాహం నీరు కారిపోయింది నా అంచనాలకు అందకపోవడంతో.
అయితే కొన్ని చక్కని షోలు లేకపోలేదు.
నా అంచనాలకు ఎందుకు అందలేదు అని ఎవరైనా అడిగితే వారికి నా సమధానం " ఒక సారి యూరోపా పార్కుకి వెళ్ళమని ".
మొత్తానికి ఎక్కడ చూసినా వ్యాపార ధోరణే ఎక్కువ కనిపించింది నాకు

ఇదీ నా కళ్ళతో చూసిన అమెరికా. ఇక అమెరికాను "ఆహా మెరిక" అనాలో "ఆ మరక" అని తీసిపారాయాలో ఈపాటికే చదువరులకు ఒక అవగాహన వచ్చే ఉంటుంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా "మరకల్లోనూ మెరికే"... "మెరికలకూ మెరికే"

ముగింపు

ప్రస్థుతానికి అమెరికాలో ఉన్నా,
నల్ల మబ్బులు వర్షపు జల్లులు కురిపించడానికి సిద్దమయిన క్షణం నా మనసు మా ఇంటి డాబా మీడకు పరిగెడుతుంది
వర్షం పడిన ప్రతీసారీ నా శరీరం అందులో మట్టివాసన కోసం వెతుకుతుంది, అది ఎందుకు మా ఊరి మట్టి వాసనలా ఉండదు
ఆగకుండా వర్షం కురుస్తుంటే మా బావిలో నీళ్ళెంతవరకు నిండాయా అని నా మనసు పరుగులు తీస్తుంది
ఉరుములు ఉరుముతుంటే "అర్జునా.. బయటకు వెళ్ళకు" అనే అమ్మ మాటలు గుర్తుకొస్తాయి
భానుడు ఎండ వేడితో చెమటను కక్కిస్తుంటే, మా ఇంటి ముందున్న మామిడి చెట్టు కింద పడుకుందామని పరుగులు తీయుస్తుంది నా మనసు
మంచులో మునిగి చలి పుడుతున్న వేళ, కాలేజీ రోజులలో ఊటీకి వెళ్ళి చలిలో చేసిన అల్లరులు గుర్తుకొస్తాయి
చలి చంపుతున్న వేళ, మేక పాలు చేసే మేలు గురించి నాన్న చెప్పిన కబుర్లు వెంటాడతాయి
అమావాస్య వేళ ఆకాశంలో చుక్కలు చూసినా, పున్నమి వేళ వెన్నెలలో తడిసినా మా ఇంటి మీద డాబా మీద అందరం కలిసి కబుర్లు చెప్పుకున్న క్షణాలు వెంటాడతాయి
అందుకే ఎవరో మహాకవి అన్నట్టు "ప్రపంచమంతా తిరగాలి, తిరిగి మా ఇంటికి రావాలి"


 

---

PDF version of this series can be downloaded here

15 comments:

Panipuri123 said...

> ప్రపంచమంతా తిరగాలి, తిరిగి మా ఇంటికి రావాలి
nice...

మేధ said...

>>ప్రపంచమంతా తిరగాలి, తిరిగి మా ఇంటికి రావాలి
True... :)

నా బ్లాగు said...

నిజమే.మీరు గమనించింది చాలా వరకూ యదార్ధం. కానీ మీరు ఉన్నది చాలా కొద్ది కాలమే కదా? మనమెరుగని దేశంలో, భాషలో, వాతావరణంలో ఉండాలిసివచ్చినప్పుడు మనకు అలవాటైన జీవిత చిత్రం తో పోల్చి చూస్తే అవి రెండూ ఒకలా ఉండవు.పైగా మీరు వాళ్ళ సంస్క్రుతిలో, ఆచారం వ్యవహారంలో కలవరు, మీరు ఇక్కడ స్తిరపడితే మీ రెండో తరం మన దేశం గురుంచి మనకు తెలియని ఎన్నో విషయాలు చెపుతారు.ఐనా ఈ రోజుకీ మన దేశంలో అమెరికన్ డ్రీం సజీవమే?

ఉష said...

అమెరికా గురించి లెస్స పలికారు. నా ఆస్ట్రేలియా, అమెరిచా అనుభవాలు పోలిస్తే ముందు వారు ఇంకాస్త స్నేహభావంతో మెలుగుతారు. భాషకి సంబంధించి నేను రెండు చోట్లా ఇబ్బంది పడ్డాను. ఆ 15సం. లలో భూమండలం మీద ఎక్కడ పడ్డా బ్రతకగలనన్న ధీమా మాత్రం ఈ ప్రవాస జీవితమిచ్చిన వరమే.

ఇక మీ చివరి పేరా తొ నేను కూడా వూహల్లో వాలిపోయానక్కడ. "ఎటో వెళ్ళిపోయింది మనసు" అనుభూతిలోకి చొచ్చుకుపోయాను. "వూరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగిన అయినోరు కన్నూరు అంతరంగాన వుందురు" కదా!

సమయాభావం వలన నా వ్రాతలు నేనే కాపి కొట్టి మళ్ళీ మీకు చెప్పేస్తునాను.

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అని శ్రీరాముడంతటివాడే అనగాలేనిది మనకి మన స్వంత వారు, మన వారు కళ్ళలో, మనసులో కదలాడటం వింత కాదు, కన్నూరు, అయినోరు అంతరంగాన కదలాడటమూ క్రొత్త కాదు. ఈ వ్యధ జీవితంలో అంతర్లీనం. కాకపోతే మాతృభూమిని స్మరిస్తూ, కర్మభూమిలో తరిస్తూ, రాయప్రోలు వారి పాట

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ ఫీఠమెక్కినా, ఎవ్వరేమనిన

గుర్తు చేసుకుంటూ గడిపేద్దాం. ఏమిటో ఇంతదాకా మీకు సముదాయింపునిచ్చి, ఇప్పుడు నేను కన్నులలో నీరు నింపుకున్నాను. నా వూరికి వూహల విమానమెక్కేసాను. నిమ్మళించు నేస్తం. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. మనసు ఆనందంగా వున్నపుడు క్షణికం స్వర్గం గోచరిస్తుంది, కానీ తృప్తిగా వున్నప్పుడు ప్రతి క్షణం స్వర్గంలోనే వుంటుంది. మీలోని వెలితిని తృప్తితో నింపే ప్రయత్నం చేయండి. ఏదీ శాశ్వతం కాదు, వున్నంతవరకే ఈ భావావేశాలు. నాకత్యంత ఆప్తుల్ని కోల్పోయినపుడు, ప్రీతిపాత్రమైన వ్యక్తులని, ప్రదేశాలు, మొక్కలు, తోటలు, పశువులు, పక్షులు, వస్తువులు వదిలి వచ్చేసినపుడు కలిగిన బాధ ఇంకా వూటబావే. కానీ ఈ జీవితం కూడా అలవాటైపోయింది, అలవాటులో అత్యంత ఆప్తమూ అయిపోయింది. నేస్తాలు, నెనరు నెయ్యాలు, ఇలా మళ్ళీ ఓ క్రొత్త ప్రహసనాలు. మీ జీవితంలోనూ తొంగి చూస్తాయివి.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@ పానీపూరిగారు, మేధ గారు,
నిజానికి ఆ వాక్యం నేను రాసినదేమీ కాదు. ఎవరు రాసారో గుర్తు లేదు కానీ ఒక పెద్ద కవి రాసిన కవితలో చివర వాక్యమది. ఆ వాక్యాన్ని ఇక్కడ వాడుకున్నాను. ఆ కవి గారికి మరియు మీకు ధన్యవాదాలు.
@ నా బ్లాగు గారు (మీ అసలు పేరు తెలీక నా బ్లాగు అనే సంభోదిస్తున్నాను)
నిజమేనండి, నేనున్న సమయం తక్కువే. అందుకే నేను ఈ పరంపర మొదటి భాగంలోనే చెప్పాను, " నా కళ్ళతో చూసిన చిన్ని అమెరికా " అని. మీరు రెండవ తరం నాకు తెలియని సంగతులు చెప్తారు అంటుంటే, మన మెదడులో ఖాళీ లేనిదే కొత్త విషయాలు ఎక్కవు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.
@ఉషగారు,
మీ సుధీర్ఘ వ్యాఖ్యకు ధన్యవాదములు. నిజానికి ఈ పరంపరను నేను
"ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారతిని" అనే ముగిద్దామనుకున్నా... ఎందుకో చివరి క్షణాల్లో ఇంటి జ్ఞాపకాలతో నింపివేసాను.
ఇక నాలోని వెలితి, నిజానికి నాలో వెలితి పెద్దగా ఏమీ లేదు. నాలో వెలితిని ఇప్పటికే ఈ బ్లాగుతో పూరిస్తున్నా..
కొత్త నేలపై అడుగుపెట్టిన ప్రతీసారీ కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు. అవి ఎంత బాగుంటాయంటే, మొదటిసారిగా బడికెళ్ళినప్పుడు వచ్చే భావనలు లాంటివన్నమాట. అందుకే నాకొచ్చిన "ఫస్ట్ ఇంప్రెషన్" రాస్తున్నానన్నమాట. ఎక్కువ కాలం ఇక్కడ ఉంటే నా ఉద్దేశ్యాలు మారవచ్చు.

Pavan said...
This comment has been removed by the author.
Pavan said...
This comment has been removed by the author.
Pavan said...

hhh

భాస్కర్ రామరాజు said...

దీపూ సాబ్ - ముగింపు బాగుంది. ఐతే, అలాంటి సందర్భాలు తక్కువైపోతున్నట్టు ఏమైనా గమనించారా? ఈ సాఫ్టువేరు జీవితాల్లో, ఎక్కడో పూణేలోనో, చెన్నైలోనో హైద్ లోనో పనిచేసే జీవితాల్లో, అసలు ఇంటిపైకి వెళదాం అనే ఆలోచన ఎంతవరకూ వస్తూందీ? వచ్చినా ఈ అపార్ట్మెంట్ కొంపల్లో, ఆ పైకి వెళ్తే పక్కింటి అంకులో మందుకొడుతూ దొంగచాటుగా, పైనింటి పుల్లారావ్ దమ్ముకొడుతూ...సొంతిల్లు ఉన్నవాళ్ళ సంగతి వేరే అనుకో. వాన పాడితే కదా ఆలాంటి ఆలోచనా, వానలెక్కడపడుతున్నాయ్? :):)
మీ ఆలోచన చాలా బాగుంది హోల్ మొత్తంగా. మీ అమ్రికా ప్రహసనం బాగుంది. తోందర్లో పెళ్ళి గట్రా చేస్కుని కళత్రంతో కొంతకాలం మళ్ళీ ఇక్కడ గడపలని దీవిస్తున్నా(ఆశిస్తున్నా)

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@పవన్ గారు,
మీ సైటు చూసాను, బాగుంది. (మీరు తొలగించిన వ్యాఖ్య నుంచి). ఇక ఆ నిట్టూర్పేలనో!!
@భాస్కర్ గారు,
నిజమే అపార్ట్ మెంట్ లలో మీరు చెప్పిన "మెంటల్" కేసులు చాలానే ఉన్నాయి లెండి. అయితే నేను పెరిగినది చిన్న ఊరు కనుక అవన్నీ అనుభవించాను.
మీ ఆశీస్సులకు ఆనందం. అయితే మరోసారి అమెరికాలో అడుగుపెట్టాలనే కోరిక లేదులెండి.

Malakpet Rowdy said...

Good one, but all nice things should come to an end.


Very nice series

భాస్కర్ రామరాజు said...

ఏనావదేతీరమో!! :):) శుభం

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@రౌడీ గారు,
నిజమే అంతం లేనిదేముంది...
ఈ పరంపరపై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు
@భాస్కర్ గారు,
అవును ఏ నావదేతీరమో...

కొత్త పాళీ said...

Nice. Are you done with the series?

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

Yes, I'm done with series... I thought it will be dragged if I add more parts to it.
Thanks for your comments