ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) - 7

ఐదార్లు ఎంత?
తెలిసి కూడా చెప్పకపోతే నిన్ను అమెరికాలో పుట్టిస్తా అని బ్రహ్మ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు, అందుకే అమెరికాలో ఎక్కువ మంది ఇలాంటి చిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటరులు వాడుతుంటారు.
ఒక రోజు సాయంత్రం లైబ్రరీకి వెళ్లి కూర్చుంటే అక్కడ పాఠాలు చెప్పే పంతులమ్మలు కనిపించారు, పిల్లలకు పాఠాలు చెబుతూ. బహుశా ట్యూషన్లేమో.. అయితే  నన్ను ఆశ్చర్య పరచిన విషయం ప్రతీ చిన్న లెక్కకూ కాలిక్యులేటరు వాడుతూ ఉండడం.
ఇదే సంగతి మీద ఒక అమెరికన్ తో మాటల సందర్భంలో వేలెత్తి చూపితే వచ్చిన సమదానమేమంటే
" అమెరికాలో చదివే చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుతారు. కనుక చదువు మీద ఏకాగ్రత చూపే సమయం  తక్కువ. అందుకే ఉన్న తక్కువ సమయంలో మెదడుకు శ్రమ ఇవ్వకుండా ఇలా చేస్తాం. ఒక వ్యక్తి అమెరికాలో  ఇంజినీరు కావాలంటే చాలా కష్ట పడాలి, ఖర్చూ పెట్టాలి. "
ఏదో కొంచెం సమాధానపరచినా అంతగా సంతృప్తి చెందలేదు ఈ సమాధానంతో నేను.

ఒక పొడవాటి హాలు, మీకు పది అడుగుల దూరంలో ఒక వ్యక్తి తలుపును చేరాడు. ఆ వ్యక్తి తలుపు తీసి వెళ్ళే ముందు ఏమి చేస్తాడు?
అతను అమెరికన్ అయితే మీరు వచ్చేవరకు తలుపును తెరచి పట్టుకుని ఆగుతాడు. అమెరికాలో ఉండే భారతీయుడైతే తలుపు వేద్దామా వద్దా అని ఆలోచించి మీరు వచ్చేవరకు ఆగుతాడు. అదే శుద్ధ భారతీయుడైతే తలుపేసి వెళ్లిపోతాడు.
ఇలాంటి విషయాలు చాలానే నేర్చుకోవాలి అమెరికన్ల నుంచి.

అమెరికన్ల నుంచి నేర్చుకోవాల్సిన నీతి మరొకటి కూడా ఉంది. మనకు తెలిసిందే ప్రపంచమనుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు
ఉంగరం కుడి చేతికి పెట్టుకుంటే ఏమవుతుంది? ఇండియాలో ఒకటేం ఖర్మ పది వేళ్ళకూ పది ఉంగరాలు పెట్టుకునే ఘనులూ ఉన్నారు.
నేను కుడి చేతికి ఒక్క ఉంగరం పెట్టుకోవడం వల్ల కాసేపు పెళ్లి అయినవాడినేమోనని నా అమెరికన్ కోలీగ్సు సందేహించారు. ఇలాంటి పరిస్థితి నాకు జర్మనీలో ఎదురు కాలేదు. నా కుడి చేతికున్న ఉంగరం వల్ల నా కొలీగ్సు వెలిబుచ్చిన సందేహాలు

  • నీకు పెళ్ళయిందా ? (ఇంకా నయం ఎంత మంది పిల్లలని అడిగారు కాదు)
  • పెళ్ళయిందని బిల్డప్ కోసం ఉంగరం పెట్టుకున్నావా ? (అవును మరి, ఎ అమెరికన్ బ్యూటి నన్నెత్తుకుపోతుందో అని భయం)
  • నీకు నిజంగా పెళ్లి కాలేదా ? (అమ్మో, ఇదేమి ఖర్మరా బాబూ... పెళ్లి కాలేదని చెప్పినా నమ్మరే)
  • మరి ఎందుకు ఉంగరం పెట్టుకున్నావ్ ? (నేనేమి చేతురా భగవంతుడా!!)

అయితే అమెరికా గురించి రాస్తూ అమెరికాలో ఉన్న భారతీయుల గురించి రాయకపోతే నేను రాస్తున్న ఈ వ్యాస పరంపర ఎప్పటికీ సశేషంగానే ఉంటుంది.

ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా బహుశా మొదట కనిపించేది చైనీయులు, తరువాత ఇండియన్లు ఏమో! అమెరికాలోనే కాదు, ఏ అభివృద్ది చెందిన దేశమేగినా భారతీయుల మాటలలో నాకు నచ్చని విషయాలు చాలానే ఉన్నాయి. ఇది ఆత్మ విమర్శ అనుకోవలసిందే. ఆ విషయాలకు వెళ్ళే ముందు, రామకృష్ణ పరమహంస గారి దగ్గరకి చక్కర మాన్పించమని తన కొడుకుని తీసుకు వచ్చే ఒక తల్లి కధ అందరికి తెలిసే ఉంటుంది.

మనం సరైన మార్గంలో ఉన్నప్పుడే అవతలివారికి నీతి భోధలు చెయ్యాలి. అందుకే నేను ఇప్పుడు రాయబోయే విషయాలు కేవలం ఆత్మ విమర్శ మాత్రమే.

అమెరికాలో ఉండే చాలా మంది భారతీయులు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా భారతదేశాన్ని తిడదామని ఎదురు చూసే వారే.

  • డ్రైవ్ చేస్తూ మన రోడ్లు ఇంత నీట్ గా ఉండవనేవాడొకడు ( అవును మరి, రోడ్డు మీద ఉమ్ము ఊసేప్పుడో ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద దూసుకుపోయినప్పుడో ఇలాంటి విషయాలు గుర్తు రాలేదు. సడన్ గా ధ్యానోదయమయ్యి మొత్తం ఇండియాని తిట్టడం మొదలు)
  • వాచ్ వంక చూస్తూ మన వాళ్లకు టైం సెన్స్ లేదు. వీళ్ళు చూడు ఎంత ఖచ్చితంగా సమయానికి వస్తారో (ఇండియాలో సినిమా ధియేటరుకి తప్ప ఇంకెక్కడికైనా సమయానికి వెళ్ళావా ?)
  • అబ్బ, లంచం ఇవ్వకుండా పనులెంత బాగా జరుగుతాయో (ఏనాడైనా లంచం ఇచ్చిన వాడిని ఆపగలిగావా?)
  • పని మీద వీళ్ళకెంత శ్రద్దో!! (ఏనాడైనా వ్యక్తిగత పనులు చెయ్యకుండా ఆఫీసులో పని చేసావా?)
  • ఎంత విశాలంగా ఉన్నాయో ఇళ్ళు (అమెరికాలో జన సాంద్రతను ఇండియాలో జన సాంద్రతను ఎప్పుడైనా పోల్చి చూసావా ?)
  • అబ్బ ఎంత బాగా తుమ్మారో ..... (అమ్మో ఇంకా ఇవి రాస్తూ ఉంటే నేనేమి రాయాల్సి వస్తుందో )

అమెరికాలో భారతీయులు చేసే గురవింద వ్యాఖ్యలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ అమెరికాలోని భారతీయులు చాలా మంది తమ దేశాన్ని మర్చిపోరు. కనీసం అలాంటి వ్యాఖ్యల ద్వారానైనా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. పండగలు కలసి జరుపుకుంటారు, ముఖ పరిచయం లేని వారు అమెరికా వచ్చినా చేయగలిగిన సాయాలు చేస్తారు, ఫంక్షన్లకు కలుస్తారు, ఇండియాలోని సంఘ సేవా కార్యక్రమాలకు సాయం చేస్తారు, మొత్తంగా భారతీయతను చాటి చెప్తారు.

ఇప్పుడొక చిన్ని ప్రశ్న,
"ఇద్దరు తెలుగు వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకుంటారు?"
అ) తెలుగు ఆ) ఆంగ్లము ఇ)హిందీ
ప్రస్తుత పరిస్థుతులలో "ఆ" కే ఎక్కువ మార్కులు పడతాయి. (నిజానికి మూడూ సరైన సమాధానాలే)
మరి, "ఒక తమిళుడు, ఒక తెలుగు వాడు ఏ భాషలో మాట్లాడుకుంటారు?"
అ) తమిళం ఆ) తమిళం ఇ) తమిళం
ఈ ప్రశ్నకు కళ్ళు మూసుకుని తమిళమే చెప్పాలి.
భారతదేశం నుంచి వచ్చిన వారంతా, ఈ అరవ గోల ఒకవైపు. తమిళులపై నాకెలాంటి ద్వేషం లేకపోయినా.. వారి నుంచి నేను సాయాన్ని పొందినప్పటికీ ఈ విషయంలో మాత్రం విమర్శించక మానను

ముక్తాయింపు తరువాయి భాగంలో….

10 comments:

భాస్కర్ రామరాజు said...

తమిళులు మనల్ని ఆడిపోస్కుంటారు, ఎక్కడా చూసినా మీరే గుల్ట్స్ అని. మనం కూడా. ఐతే, మీరు సరిగ్గా గమనించారో లేదో లేక మీకు ఆ అవసరం రాకపోయిందో, తెలుగు వాళ్ళకన్నా తమిళులు, లేక/ మరియూ మిగతావారు చాలా ఐకమత్యంగా ఉంటారు. మనోళ్ళకు మనోళ్ళే శతృవులు. ఆంధ్రాలో కులం చచ్చిపోయినా ఇక్కడ మాత్రం చావనివ్వరు. ఇక గుళ్ళల్లో, మూడు వర్గాలు. గుజరాతీ, తెలుగు, నాన్ గుజరాతి/తెలుగు.
వీళ్ళల్లో వీళ్ళు ఆధిపత్యం కోసం కొట్టుకుంటుంటారు. నే గమనించింది ఇది.

Anonymous said...

nenu india lo roads gurinchi ninna ne anukunanu... but the other way....
india lo ne bavunayi america kante....atleast india lo guntalu ekada vastayo telustundi.... ikada adi telidu ani...

--- A friend

Panipuri123 said...
This comment has been removed by the author.
Panipuri123 said...
This comment has been removed by the author.
Panipuri123 said...

"ఇద్దరు తెలుగు వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకుంటారు?"
అ) ఆంగ్లము ఆ) ఆంగ్లము ఇ)ఆంగ్లము

ఇంకొక విషయము...
ఆవతలి వాడు తెలుగోడు అయినా.. మీరు అతనితో తెలుగులో మాట్లాడినా... అతను మీకు ఆంగ్లములో రిప్లయ్ ఇస్తాడు.

----------------

ఇంకొకటి... ఎక్కదో చదివాను తెలుగు వాళ్ళ గురించి...
ఇద్దరు తెలుగోళ్ళు ఉంటే.. మూడు సంఘాలు ఉంటాయి (లైక్ తానా, బానా, ఆటా, టాన్‌టెక్స్ లాగ)

ఈయన స్తాపించినది ఒకటి, ఆయన స్తాపించినది ఒకటి.. ఇద్దరూ కలిసి స్తాపించినది మరొకటి

జీడిపప్పు said...

>> "ఇద్దరు తెలుగు వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకుంటారు?"
అ) తెలుగు ఆ) ఆంగ్లము ఇ)హిందీ
ప్రస్తుత పరిస్థుతులలో "ఆ" కే ఎక్కువ మార్కులు పడతాయి. (నిజానికి మూడూ సరైన సమాధానాలే)
<<

అదేంటో కానీ విచిత్రంగా నాకు ఇంతవరకు తెలుగు తప్ప మిగతా భాషలో మాట్లాడే తెలుగువాడే కనపడలేదు. ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను, ఎందరినో అడిగాను.. అందరూ అదే మాట అన్నారు. పరిచయం అయిన తర్వాత తెలుగు వాళ్ళు అని తెలిస్తే మరుక్షణం నుండే అచ్చమయిన తెలుగులో మాట్లాడుతారు నాకు తెలిసిన అమెరికాలో. ఏంటో అంతా మాయగా ఉంది. నేనసలు అమెరికాలోనే ఉన్నానా??!!!

ఉష said...

మీరు వ్రాసిన ఈ ఐదారు అంశాలు [కాలికులేటరు వాడకం, అమెరికన్ల మర్యాద, తమ దేశమే ప్రపంచంగా బ్రతికే రీతి, మనవారి ప్రవృత్తి, భాష ఇలా అన్నిటి మీదా నాకు మీతో జోడీ కట్టగల స్వానుభవాలు వున్నాయి కానీ సమయాభావం వలన వ్రాయలేకపోతున్నాను. రెండు విషయాలు మాత్రం చెప్పాలి -

1. ఒకరింట్లో కలిసిన మరొకరు బూడిద గుమ్మడి వడియాలు తింటూ, "ఇవి ఏదో పెద్ద పండు నుండి చేస్తారు కదా?" అని అడిగినపుడు నేను కాస్త ఎగాదిగా చూస్తూ [అప్పటికి నేను దేశం వదిలి 12 సంవత్సరాలు] "ఏమండి, మీరు ఇక్కడే పుట్టిపెరిగారా అని అడిగినపుడు "వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది, తెలుగు మాట్లాడం కదా" అన్న ఆవిడ సమాధానం విని మరింత అయోమయం అయిపోయాను. నాకు తెలుగు మరపుకి రాకపోవటం ఏమైనా జబ్బేమోనని.

2. 2003 లో ఇండియాకి వెళ్ళినపుడు రైల్లో రాత్రి ప్రయాణం చేస్తూ మధ్యలో ఏవూరు వచ్చిందోనని ఆరా తీద్దామని ప్రక్కనున్న అతనిని అడిగితే "1.5 ఇయర్స్ గా షికాగోలో వున్నాను, తెల్గు అర్థం కాదు," అన్నపుడు మాత్రం నాకు వున్నది మాయరోగం అని, నేనెపుడో మరవాల్సిన భాష నన్ను వదలటం లేదని రూఢి చేసేసుకున్నాను.

ఏ మాట కా మాటేను, మావూర్లో నోరారా తెలుగులో మాట్లాడేవారు చాలా ఎక్కువ.

సుబ్బారావు said...

"అమెరికాలో ఉండే చాలా మంది భారతీయులు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా భారతదేశాన్ని తిడదామని ఎదురు చూసే వారే"

అని అన్నారు కదా! ఆ జబ్బు అక్కడ వున్న తెలుగు వారికే కాదండి, ఇక్కడ కూడా చాలా మందికి వుంది.
భారతదేశం మారదు (తమ సొంత విషయాలు తప్ప ఇంకేమీ పట్టవు వీరికి) , అవినీతి ఎక్కువ, ఇక్కడ రాజకీయాలు మారవు (వీళ్ళు ఓట్లు మాత్రం వెయ్యరు కాని రాజకీయాలని విమర్శించడానికి ముందు వుంటారు). ఇలా చాలా రకాలుగా మన దేశాన్ని విమర్శిస్తూవుంటారు. వీళ్ళంతా భారతదేశం వల్ల బ్రతుకుతున్నాం అని మర్చిపోతారెందుకో!!!!!

తొందరలో పూర్తిగా మరియొక టపా రాస్తాను.

కొత్త పాళీ said...

బాగా రాశారు, మంచీ చెడూ కూడా. మొదటి వ్యాసం చదివినాక ఈ పరంపర మీద నేను పెంచుకున్న అంచనాలకి తగ్గటం లేదు మీరు. అభినందనలు.

సామాన్యమైన లెక్కల గురించి .. ఇది పూర్తిగా నిజం కాదు. నేను మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్హులకి పాఠాలు చెప్పాను. ఇటువంటి నిపుణతల విషయంలో భారద్దేశపు ఒక సగటు కాలేజిలో విద్యార్ధి గుంపులాగానే ఉంటారు అమెరికను విద్యార్ధి గుంపు కూడా.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@భాస్కర్ గారు,
నిజమే.. తమిళులలో ఉన్న ఐకమత్యం తెలుగు వాళ్ళలో ఉండదు. గుళ్ళలో మీరు చెప్పిన రకాలు చూసాను. అయితే ఒక గుడిలో వినాయకుడికి ద్విదంతములు పెట్టారు. ఏంటి పంతులు గారూ "ఏక దంతుడు కదా" అంటే... చిన్న నవ్వు నవ్వి ఇది గుజరాతీలు కట్టించిన గుడి నాయనా అన్నారు. అదీ సంగతి.
ఇక మీరు రాసిన వ్యాఖ్యలో "గుల్ట్స్" అంటే అర్ధం కాలేదు.
@ఫ్రెండ్ ,
ఇండియాలో గోతుల డ్రైవింగ్ తెలిసుండాలి అందుకే...
@పానీపూరీ గారు,
నిజమేనేమో.. ఆంగ్లం కరక్టే అయినప్పటికీ అప్పుడప్పుడైనా తెలుగులో మాట్లాడతారు లెండి.
అవును ఎక్కడిదాకానో ఎందుకు ఇక్కడ బ్లాగులలోనే లేవా అలాంటి సంఘాలు? ఏమంటారు?
@జీడిపప్పుగారు,
మీరు అమెరికాలోనే ఉన్నారు. నిజానికి నేను ఆ వ్యాక్యాలు రాసేప్పుడు కేవలం అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళను దృష్టిలో పెట్టుకుని రాసినవి కావు. మొత్తం తెలుగువాళ్ళను దృష్టిలో పెట్టుకుని రాసినవి.
@ఉషగారు,
నిజమేనండీ.. కొన్ని సార్లు కొందరి మాటలు వింటుంటే పుట్టుకతోనే బంగారు చెంచా నోటిలో పెట్టుకుని పుట్టిన వారిలా బడాయి పోతుంటారు. అలాంటి వారిని చూసి జాలి పడడం తప్ప ఏమీ చెయ్యలేం.
మరికొన్ని సార్లు మనం మామూలుగా జీవిద్దామనుకున్నా పక్కనున్న వారు మన మీద ఒక "ఇంప్రెషన్ " ఏర్పరుచుకుని మనల్ని అలా ఉండమంటుంటారు. :(
నేను కాలేజీ రోజులలో ఉన్నప్పుడు నా చెప్పులు మా ఊరిలో కుట్టిస్తే, ఆ చెప్పులు కుట్టేవాడు
"విజయవాడలో చదువుకుంటూ మన ఊళ్ళో చెప్పులు కుట్టించుకుంటారేమండీ" అన్నాడు.
ఒక నవ్వు నవ్వడం తప్ప ఏమీ చెయ్యలేకపోయా...
ఇక తెలుగు మాట్లాడే వారి విషయంలో పైన జీడిపప్పుగారికి చెప్పిన సమాధానమే.
@సుబ్బారావు గారు,
నిజమే మీరు చెప్పేది. పుట్టుకతో వచ్చిన బుద్ది కదా విమర్శిస్తూ కూర్చోడం. అంత త్వరగా పోదు లెండి
@కొత్తపాళీ గారు,
మీ అంచనాలను అందుకోవడం చాలా ఆనందం కలిగిస్తోంది. అయితే ఈ వ్యాస పరంపరలో అన్నీ గొప్పగా రాయలేదన్నది నా అభిప్రాయం. కొన్ని సార్లు తికమక పడుతూ రాసినా సరే ఈ వ్యాస పరంపరలో ప్రతీ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యలు నాకు ప్రాణవాయువులా పని చేసాయి. ముఖ్యంగా మా నాన్నగారు చేసిన వ్యాఖ్యలు. (ఫోనులో చేసిన వ్యాఖ్యలన్న మాట)
ఇక లెక్కల గురించి, మీరు గమనించారో లేదో షాపుల్లో ఎక్కువ మంది సేల్స్ పర్సన్స్ మరియు కౌంటర్ ఉద్యోగులు ఇలాంటి చిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్ వాడాతారు. అందుకే ఈ సంగతి సగం నిజం సగం అబద్దం.