ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) - 6

నేను ఆన్ సైట్ రావడానికి ముందు ఒకసారి భారతదేశంలో రాత్రిపూట మా ఆన్ సైట్ కోర్డానేటర్ తో మాట్లాడాల్సి వచ్చింది. వెంటనే ఒక మైల్ రాసా, అటు పిమ్మట సరే కాల్ చెయ్యమన్నాడు కానీ కేవలం పది నిమిషాలే మాట్లాడతానంటూ మెలిక పెడుతూ. ఆ పది నిమిషాల సంభాషణ చివరలో అన్నా, మీకు ఇబ్బంది కలిగించినట్టున్నాను.
దానికి ఆయన సమాధానం నా ఫోన్ లో మినిట్స్ (నిమిషాలు) లేవు అని. సరే ముందుగా ఈ నిమిషాల గోల చూద్దాం.

సంవత్సరం : 2005 తర్వాత ఏ సంవత్సరమైనా
ప్రదేశం : ఇండియాలో నేనున్న ప్రదేశమేదైనా
సన్నివేశం : ఏదైనా సహాయం కోసమో లేక ఆత్మీయులతో మాట్లాడదామనిపించినపుడో లేక పని లేనప్పుడో చేతిలోనున్న మొబైలులో నంబరులు నొక్కబడేవి. తరువాత ఎంతో కొంత సేపు అవతలివారితో ఒక ఐదు నిమిషాలో, పది నిమిషాలో ఎంతో కొంత సమయం డబ్బు గురించి ఆలోచించకుండానే మాట్లాడడం జరిగేది. ఎందుకంటే ఈ సన్నివేశంలో డబ్బు ఖర్చయ్యేది నాకొక్కడికే. అవతలి వారిని ఇబ్బంది పెట్టడం జరగలేదు

సంవత్సరం : 2008
ప్రదేశం : అమెరికా
సన్నివేశం : ఎవరికి ఫోన్ చెయ్యాలన్నా ఎవరికి చెయ్యబోతున్నానో వారికి కూడా డబ్బులు ఖర్చవుతాయి. ఎవరికి ఫోన్ చెయ్యాలన్నా ఒక్క నిమిషం ఆలోచించవలసినదే. ఇదివరకలా ఊరికే ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేదు. దీనిలో చాలా గొప్ప వ్యాపార కోణం కనిపిస్తోంది నాకు.

భారతదేశంలో ఖర్చు ఎక్కువ ఉంటే అది సామాన్యులకు చేరదు, పైగా అవతలివారు చెప్పే సుత్తి (పనికి వచ్చే విషయాలు కూడా కావచ్చు కాక) కోసం ఖర్చయ్యే ఏ పద్దతీ అంత త్వరగా భారతీయులు హర్షించరు. ఆ కోణంలో జరిగిన మార్పుల వల్ల ఎదురైనదే ప్రస్థుత పరిస్థితి.
ఒకప్పుడు పది మందిలో ఒక్కరి వద్ద కూడా లేని మొబైల్ నేడు ప్రతీ ముగ్గురిలో ఒకరి దగ్గర ఉంది. అదే సమయంలో విప్లవాత్మకమైన ధరల తగ్గుదల, తక్కువ ధరలో లభించే మొబైల్ ఫోన్ల్ భారతీయులను మొబైల్ వాడకంలో అగ్ర స్థానానికి పోటీ పడేలా చేస్తున్నాయి. (ప్రస్థుతం మూడవ స్థానం).

మరి అమెరికాలో ఖర్చెక్కువయినా సరే మొబైల్ వాడకం ఎలా ఎక్కువ? మొబైల్ వాడకానికి అమెరికన్లు మొదటగా పరిగణలోకి తీసుకునేది వారి యొక్క ప్రైవసీ... బహుశా ఇదే కారణం కావచ్చు, ఖర్చెంతయినా సరే మొబైల్ వాడకంలో నాలుగవ స్థానంలో ఉండడానికి.

ఖర్చు ఖర్చు అని గోల పెడుతున్నా కదా, చిన్న పోలిక చేద్దాం అమెరికా ఫోన్ ధరలకు మరియు భారతదేశంలో ఫోన్ ధరలకు

ప్రదేశం ఇన్ కమింగ్ ఔట్ గోయింగ్
భారతదేశం 0 (రోమింగ్ లోనున్నప్పుడు 1.5 రూపాయలు సుమారు) 0 పైసలు నుంచి 1.5 రూపాయల లోపు
అమెరికా 0 పైసల నుంచి 7.5 రూపాయల లోపు 0 పైసల నుంచి 7.5 రూపాయల లోపు
అమెరికా నుంచి భారతదేశం (కాలింగ్ కార్డుల ద్వారా)        - 50 పైసల నుంచి 5 రూపాయల లోపు

అందుకే అంటారు, రోములో రోమనులా ఉండమని. ప్రతీదీ డాలర్ల లెక్క చూడవద్దని. ఒకసారి మా అమెరికన్ కొలీగ్ కు ఈ లెక్కలు చెబితే కళ్ళు తేలేసింది.

అవును,మరి భారతదేశంలో కంపనీలు అంత తక్కువ ధరలతో ఎలా నడపగలుగుతున్నాయనే సందేహం కలగచ్చు. ఆ సందేహం వచ్చినవారు బహుశా ఇండియాలో టెలివిజన్ లలో sms పోల్స్ కానీ కౌన్ బనేగా కరోడ్ పతీ లాంటి కార్యక్రమాలను గానీ బాంకుల నుంచి క్రెడిట్ కార్డ్ ల కోసం బుర్ర తినే కాల్స్ కానీ అనుభవించి ఉండరు.

అయితే అమెరికాలో ధరలు ఎక్కువ ఉండడానికి నాకు కనిపించే ప్రధాన కారణం "లేబర్ కాష్ట్ " ఎక్కువ కావడమే. అందుకే కాబ్ లో ఆరు మైళ్ళు వెళ్ళాలన్నా 20 డాలర్లు ఖర్చవుతాయి.

ఇక, మళ్ళీ నిమిషాల గోలకు వస్తే ఎక్కడో చదివిన ఒక వ్యాక్యం గుర్తుకు వస్తోంది
" americans don't know meaning of rest of world ". దీనిలో పెద్దగా సందేహించడానికేమీ లేదనే నాకనిపిస్తుంటుంది. వారి లెక్కలు వారివి,
ప్రపంచం ఒక యూనిట్ వాడితే అమెరికా మరో యూనిట్ వాడుతుంది, అనేక భారతీయులకు అమెరికాలో ఎదురయ్యే సమస్యల్లో ప్రధానమైనదిదే. ప్రమాణాలకు అనుగుణంగా మారడం. ప్రమాణాలంటే ఎక్కువ ఊహించనవసరం లేదు, చిన్ని చిన్ని విషయాలే....
లీటర్ల పెట్రోల్ గాలన్ల గాస్ అవుతుంది 
కిలోమీటర్ల దూరం మైళ్ళ దూరమవుతుంది
కిలోల లెక్క పౌండ్లకు మారుతుంది
గ్రాముల లెక్క ఔన్సులకు మారుతుంది
ఎడమవైపు డ్రైవింగ్ కుడివైపుకు తిరుగుతుంది
నేషనల్ హైవేలు ఇంటర్ స్టేట్ లవుతాయి
కాలేజీలు కాస్తా స్కూళ్ళగా పేరు మార్చుకుంటాయి
మొబైల్ లో బాలన్స్ కాస్తా రూపాయల లెక్క నుంచి నిమిషాల లెక్క చూడడం మొదలవుతుంది (కొన్ని సార్లు ఎవరు ఫోన్ చేసినా బాలన్స్ లేక ఫోన్ పెట్టెయ్యమనే పరిస్థితి కూడా ఎదురు కావచ్చు)

అయితే ఆనందించాల్సిన విషయం కాలం లెక్కలు మారకపోవడం. ఎక్కడికెళ్ళినా అవే నిమిషాలు, అవే సెకన్లు... మనిషి కాలానికి అతీతుడు కాడనడానికి ప్రతీకగానేమో!!!
కాలమా... నీ చేతిలో ఎవరికైనా ఓటమి తప్పదు కదా....

బహుశా ప్రపంచ చరిత్రలో ప్రజలందరూ ఒక్కతాటిన నిలిచేది కాలం విషయంలోనేమో!
నా నిద్రా సమయమాసన్నమైనది కాన, ఈ అమెరికా కబుర్లు ఇప్పటికి సశేషం... (ఇంకెన్ని కనీసం మరో రెండు)

5 comments:

చిన్ని said...

analysis baaundandi

భాస్కర్ రామరాజు said...

మీరు గమనించారా -
వరల్డ్ బేస్బాల్ టోర్నమెంటు బాస్టన్, మిషిగన్ ల మధ్య జరుగుతుంది (ఉదాహరణకి). వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గస్ట్స్ (బలమైన గాలూలు) ఫ్లారిడలో నిన్న వీచాయి (వాతావరణ ఛానెల్ వారి వార్త). చికాగో బుల్స్ - వరల్డ్స్ బాస్కెట్బాల్ ఛాంపియన్స్. వరల్డ్స్ క్రేజీయస్ట్ వీడియోస్ - సియాటెల్ నుండి. అదీ వీరి బాగోతం.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@చిన్ని గారు,
ధన్యవాదములు.
@భాస్కర్ గారు,
గమనించకేమి, అయితే భౌతిక శాస్త్ర ప్రమాణాల కన్నా ఇవి పెద్దవనిపించలేదు. అందుకే వీటి గురించి రాయలేదు.

Panipuri123 said...

అదేందో గాని... అమెరికాలో ఫుట్‌బాల్ ఆట అని... కాళ్ళు వాడకుండా చేతులతో ఆడతారు :-)

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@పానీపూరీ గారు,
భలే గుర్తు చేసారు. ఇలాంటి తిక్క మార్పులు చాలానే ఉన్నాయి లెండి. ఏమి చేస్తాం.