ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) - 5

ఒక రోజు వాల్ మార్ట్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడూ పేరైనా వినని ఒక వస్తువు నా కంట పడింది. ఆ వస్తువు పేరు " బనానా స్టాండ్ ". అమెరికన్ల పిచ్చికి ఒక ఉదాహరణ మాత్రమే ఇది. ఇలా పనికి వచ్చేవాటికీ, పనికి రాని వాటికీ వస్తువులు దొరుకుతాయి. వాల్ మార్ట్ కానీ, మరే ఇతర షాపింగ్ ప్రదేశం కానీ వినియోగదారుల చేత ఎక్కువ ఖర్చు పెట్టించడానికే చూస్తాయి.
నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని వస్తువులను సైతం లాభానికి అమ్మగల ఘటికులు వీళ్ళు. అక్కడికేదో అమెరికాలో షాపింగ్ భూటకం అనుకోడానికి లేదు. నాణ్యత విషయంలో తిరుగు లేదు, వినియోగదారుని హక్కులు కాలరాలవు. ఇంచుమించు ప్రతీ వస్తువునూ నచ్చకపోతే వెనక్కి తిరిగి ఇచ్చివేయవచ్చు.

షాపింగ్ గురించి రాస్తుంటే 2007 జర్మనీ క్రిస్ మస్ గుర్తుకొస్తోంది. వారానికి ఆరు రోజులు మాత్రమే తెరచి ఉండే షాపులు. (చాలా హోటల్సుతో సహా!). పని గంటలైతే ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకే. ఇక సెలవురోజులలో చెప్పనవసరమే లేదు. ఆ క్రిస్ మస్ సరిగ్గా శని ఆదివారాల తర్వాత రావడంతో మొత్తం నాలుగు రోజులు వరస సెలవులు షాపులకి. మా రూములో లేని సరుకులు. డబ్బులున్నా బయట కొందామన్నా ఏ షాపులూ, హోటళ్ళు తెరచి ఉండని పరిస్థితి. ఎలాగో ఆ నాలుగు రోజులూ గడిచాయి. అయితే అమెరికాలో అలాంటి పరిస్థితి చాలా వరకు ఎదురు కాదు (పూర్తిగా మంచుతో నిండిపోయే ప్రదేశాలలో పరిస్థితి నాకు తెలియదు).

ఏదో థాంక్స్ గివింగ్ డే అట వస్తువులు చవకగా ఇస్తారట... అయితే ఆ రోజు చవకగా వస్తువులు చేజిక్కించుకోవడానికి ముందు రోజు సాయంత్రం నుంచే క్యూలుంటాయి. (ఒక్క ఖుషి సినిమాకి తప్ప ముందు రోజు సాయంత్రమే క్యూలు తయారయిన సంగతి నేను వినలేదు. తిరుపతి వెంకన్న దర్శనానికి ఉండే క్యూల సంగతి వేరు దానిని ఇలా షాపింగ్ తో పోల్చడం నాకిష్టం లేదు) చికాగో, మిచిగాన్ లాంటి ప్రదేశాలలో గడ్డకట్టే చలిలో తరువాతి రోజు షాప్ తెరిచేవరకు వేచి చూసి కావల్సిన వస్తువును తక్కువ ధరకు సొంతం చేసుకునే వాళ్ళు అనేకులు. అమెరికన్ల వెర్రికి (ఆ థాంక్స్ గివింగ్ క్యూలలో ఇండియన్స్ కూడా ఎక్కువ మందే ఉంటారని విన్నాను) ఇది పరాకాష్ట.
అయితే దీనిని మించిన వేలం వెర్రి వేరే ఉంది. ఏ కొత్త వస్తువైనా మార్కెట్ లోకి విడుదలయినప్పుడు ప్రకటనలు ఇలా ఉంటాయి, "ఈ వస్తువు వాడకపోతే మీరు వెనకబడి ఉన్నట్టు. కనుక వెంటనే వాడండి అరటిపండు వారి మీ ఫోన్...."
ఈ చక్రం ఎలా ఉంటుందంటే వినియోగదారులని ఎక్కడా ఆగనివ్వరు, ప్రకటనల హోరుతో పిచ్చెక్కిస్తారు. ఇప్పుడు ఆ సంస్కృతి మన దేశంలోనూ మొదలయ్యింది, అది వేరే విషయం.

అమెరికాలో షాపింగ్ గురించి ఇంకా వివరంగా చెప్పే ఒక అద్భుతమైన సైటు ఇక్కడ చూడండి. ఒక్క అమెరికా ప్రపంచానికి అవసరమైన వనరులలో అధికశాతం ఖర్చు పెడుతోందోట , అమెరికాలాగానే ప్రతీ దేశం ఖర్చు పెడితే మొత్తం మూడు నుంచి ఐదు భూ గ్రహాలు కావాలట.

భారతదేశంలో ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి నుంచి బయటకు రాగానే ఖచ్చితంగా కనిపించేవి దేవుడి పటాలు అమ్మే షాపులు. అమెరికాలో ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్ళినా కనిపించేవి కూడా అవే.... అలాంటి చోట దొరికేవి కాఫీ కప్పులు, ఫ్లాస్కులు, టోపీలు, టీ షర్టులు వగైరా... (కాఫీ ప్రియులు కదా....)

అయితే షాపింగ్ గురించి రాస్తూ ఆన్ లైన్ షాపింగ్ గురించి రాయకపోతే అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. షాప్ లో కొంటే వంద డాలర్లకు వచ్చేది ఆన్ లైన్ షాపింగ్ లో ఉచితంగా రావచ్చు లేదా ఇంకా తక్కువ ధరకే రావచ్చు. అందుకే ఎక్కువ మంది ఆన్ లైన్ షాపింగ్ కే ప్రిఫరెన్సు ఇస్తారు. భారతదేశంలో కూడా ఇప్పుడిప్పుడే ఆన్ లైన్ షాపింగ్ రెక్కలు తొడుగుతోంది. ఈ పద్దతిలో వ్యాపారులకు, వినియోగదారులకూ సమయం, ధనం ఆదా.
షాప్ కి వెళ్ళావలసిన పని వినియోగదారునికి, షాప్ ని తెరచి మైంటైన్ చెయ్యవలసిన పని వ్యాపారికీ ఉండదు. అయితే తప్పుడు సమాచారంతో వ్యాపారులు మోసం చేసే అవకాశమున్నప్పటికీ అలాంటి కేసులు అమెరికాలో తక్కువే.

షాపింగ్ చేసాక నా కళ్ళు కొంచెం విశ్రాంతి కోరుకుంటున్నాయి. అంతవరకు సశేషం.......

4 comments:

amma odi said...

షాపింగ్ మాయాజాలం గురించి మాది అంచనా, అవగాహన. నీ అనుభవం జోడించావు. బాగుంది.

Raj said...

బనానా స్టాండు చూసినప్పుడు నేను కూడా మీలాగే అనుకున్నా.

రాధిక said...

మీరు బనానా హోల్డర్ చూసినట్టు లేరు.సగం అరటి పండు తిన్నాకా ఇక తినలేకపోతే అది దాచడానికన్న మాట.పిచ్చి పదిరకాలు,వెర్రి వేయి రకాలు అని నేనూ ఒకటి కొన్నాను లెండి.
ఫొటో ఇక్కడ చూడండి.
http://www.taylorgifts.com/images/p33333b.jpg

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@ఆదిలక్ష్మిగారు,
మీ అంచనా తప్పలేదన్నమాట. :) షాపింగ్ మాయాజాలం గురించి నేను రాసినది ఇంకా చాలా తక్కువేనండి! దాని విశ్వరూపం చూడటం నాలాంటి సామాన్యుల వల్ల కాదు.
@రాజ్ గారు,
ఒకే భావనన్నమాట
@రాధిక గారు,
మీరు చెప్పిన బనానా క్లిప్ చూసానండి. రాసేప్పుడు గుర్తు రాలేదు. ఇలాంటివి చూసినప్పుడు నాకు మతి పోతుంది