ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) - 4

నిజం సినిమాలో హీరోయిన్ రక్షిత మిట్టమధ్యాహ్నం జాగింగ్ చేస్తుంది. అది ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ దారి మల్లించటానికి హీరో ఎంచుకునే పధకం. ఆ సినిమా చూసినప్పుడు నవ్వుకున్నా, మరీ మనవాళ్ళు ఇంత బుర్ర లేకుండా కామెడీ సీన్లు పెడతారేమిట్రా అని.
మా ఆఫీస్ చుట్టూ ఒక రన్నింగ్ ట్రాక్ ఉంటుంది, ఉద్యోగులు జాగింగ్ చేసుకోడానికి. కొంత మంది ఉద్యోగులు సరిగ్గా భోజనసమయానికి రన్నింగ్ చేసేవాళ్ళు. అలాగే ఆఫీస్ ముందు బోలెడు పచ్చిక ప్రదేశం ఉంది. అందులో లంచ్ సమయంలో కొన్ని ఎక్సర్ సైజ్ తరగతులు జరిగేవి.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, అనేక వింత అలవాట్లు ఇక్కడి జనాలివి.
రోజుకు ఒక లీటర్ కోక్ బాటిల్ ని ఊదేసి నేను డైటింగ్ చేస్తున్నా అనేవాళ్ళు కొందరు 
రెండువందల మీటర్లలోపు దూరానికి కూడా కారులో తిరుగుతూ తరువాత చెమటలు కక్కిస్తూ రన్నింగ్ చేసేవాళ్ళు వగైరా......

"You've Got Mail" అనే ఒక సినిమాలో "star bucks" కాఫీ గురించి ఒక డైలాగ్ ఉంటుంది. అమెరికాలో star bucks కాఫీ లేకుండా రోజు ప్రారంభమవ్వదు చాలా మందికి అని. ఆ star bucks సంగతేమో కానీ, అమెరికాలో చాలా మందికి కాఫీ లేకుండా రోజు గడవదు. సరే, వీళ్ళు తాగేది కాఫీ అందామంటే అది కాస్తా ఒట్టి డికాషిన్. ఎంత పాలపొడి కలిపినా, ఎంత చక్కెర కలిపినా మన ఆంధ్రా కాఫీ రుచి రాదు. ఈ దెబ్బకు చివరకు ఆఫీసులో కాఫీ తాగడమే మానేసాను. ఎలాగూ ఇంటిలో తాగను, అది వేరే విషయం.

ఆఫీసులో ఉన్న వారంతా కలిసి పని చెయ్యాలంటే, వారి మధ్య స్నేహముండాలి. కేవలం పని చేస్తూ ఉంటే వారి మధ్య స్నేహం ఎలాగూ వృద్ది చెందదు. అందుకే మా ఆఫీసులో ఒక నిర్ణయానికి వచ్చాము, ప్రతీ శుక్రవారం టీమ్ అంతా కలిసి బయటకు లంచ్ కి వెళ్ళాలి అని. శాకాహారునిగా నా జర్మనీలోని అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం నాకు కొంచెం బాధను కలిగించింది. సరేలే వారానికొక రోజే కదా అని. నా బాధకు తోడు మొదటి వారం మెక్సికన్ రెష్టారెంట్ కి వెళ్ళాము. అక్కడ ఏమి తీసుకోవాలో బుర్ర బద్దలు కొట్టుకుని ఒక పిజ్జా చెప్పాను. అది వచ్చిన తర్వాత నా మొహం చూడాలి, ఎంత సుందరంగా ఉందో... మొత్తం ఎర్ర చిక్కుళ్ళతో నిండి. ఆహా... భలే మొదలయ్యిందిలే అమెరికాలో రెష్టారెంట్లలో భోజన సంగ్రామం అనుకున్నా.. అయితే, ఆ తరువాత నుండి వెళ్ళిన ప్రతీ రెష్టారెంటులోనూ ఏదో ఒక శాఖాహార పదార్ధముండడం వల్లనూ, అమెరికన్ తిండి కూడా రుచిగా ఉండడం వల్లనూ ఆ తరువాత బాధ పడలేదు. అయితే తరువాతి రోజులలో ఆర్ధిక మాంద్యం వల్ల ఆ లంచ్ కాస్తా రెండు వారాలకొకసారిగా రూపాంతం చెందింది.
ఒక వీకెండ్ సాయంత్రం ఆఫీస్ తరపున ఒక పిక్నిక్ (పార్టీ అనాలేమో, కానీ జరిగింది పిక్నిక్ లా) కి వెళ్ళాము. వెళ్ళిందే సాయంత్రం ఆరింటికి. అప్పటికే అక్కడ ఉన్నవాళ్ళు తిండి లాగిస్తున్నారు. ఏదో సాయంత్రపు చిరుతిళ్ళేమో అనుకున్నా, ఒక గంట ఆగి అక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గరికి పోయి చూద్దును కదా, బయలుదేరడానికి పాకింగ్ చేసుకుంటున్నారు. ఆ తరువాత మెల్లిగా అర్ధమయిన సంగతేమంటే, అమెరికన్ల పార్టీలలో డిన్నర్ అంటే రాత్రి ఏడుకల్లా అయిపోతుంది అని.

ఈ ఆఫీస్ గోల పక్కన పెడితే, ఒకానొక శుభదినంబున ఆఫీసుకి వెళ్ళేప్పుడు బద్దకంలో వంట చేసుకోలేదు. సీన్ కట్ చేస్తే మద్యాహ్నం ఏ గడ్డి తినాలో అన్న ఆలోచనల్లో నేను. మా ఆఫీసుకి దగ్గరలోనే "సబ్ వే" ఉంది. సరే అని దానిలో దూరా... మహా రద్దీగా ఉంది. ఇంతా చేస్తే అక్కడ దొరికేవి రెండే పదార్ధాలు శాండ్ విచ్ , పిజ్జా. ఆ రోజు నుంచి నేను సబ్ వేకి చిన్న సైజు పంఖానైపోయా... కొన్ని సార్లు కావాలని వంట చెయ్యకపోవడం, కొన్ని సార్లు బద్దకంతో చెయ్యకపోవడం, వెరసి వారానికి మూడు రోజులు సబ్ వేలో తినడం. ఇక ఆ సబ్ వేలో నేనెంత నోటెడ్ అయిపోయానంటే నన్ను చూడగానే నేనేమీ చెప్పకుండానే వాళ్ళే శాండ్ విచ్ తయారు చేసేంతలా..

అమెరికా వచ్చిన కొత్తలో అమెరికన్ ఆహార పదార్ధాల గురించి తెలియకపోతే చేసే తప్పులు చీస్ బర్గర్ , చీస్ పిజ్జాలు శాకాహారాలనుకుని ఆర్డర్ చేసే శాకాహారులు. (మొదటి సారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది, సరిగ్గా తెలుసుకోకపోతే)
పెప్పరానీ పిజ్జా అంటే పెప్పర్ తో చేసిన పిజ్జా అనుకునే వాళ్ళు
నాన్ ఫాట్ యోగర్ట్ తెచ్చుకుని పెరుగు బాగోలేదనుకోవడం
ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంటికి తెచ్చుకుని తిందామనుకోవడం
హోమ్ మేడ్ బీఫ్ వెజిటిబులు సూప్ వంటి పేర్లు చూసి మూర్చపోవడం (మూర్చ అన్నది ఏదో మాట వరసకే)
మెక్సికన్ టాకోను చూసి చపాతీలనుకోవడం
అయితే ఇలాంటి కష్టాలు ఆహారపదార్ధాల అసలు పేర్లు తెలుసుకునేవరకే...

తిండి కబుర్లయిపోయాక, ఇక నిద్రపోదామంటాయి కన్నులు. అందుకే ప్రస్థుతానికి సశేషం....

11 comments:

అబ్రకదబ్ర said...

స్టార్‌బక్స్‌నేమన్నా అంటే నేనొప్పుకోను. మీకు నచ్చే కాఫీ దొరికించుకోలేక పోతే అది మీ తప్పు. ఆంధ్రా కాఫీ కావాలంటే కనీసం double shot latte అన్నా ప్రయత్నించొచ్చి ఆ తర్వాత మాట్లాడండి.

>> ".. శాఖాహారునిగా నా జర్మనీలోని అనుభవాల దృష్ట్యా .."

జర్మనీలో మీరు చెట్ల కొమ్మలు విరుచుకు తినేవారా ;-)

మీ తప్పు లేదు లెండి. పత్రికలోళ్లు 'విలేఖర్లు', 'శాఖాహారులు' అని ఒత్తొత్తి రాసేసి అవే అందరికీ అలవాటు చేసిపారేశారు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

అబ్రకదబ్ర గారు,
స్టార్ బక్స్ ను నేనేమీ అనలేదండి బాబూ... ఒక్కసారి మళ్ళీ ఆ పేరా చదవండి.
===
ఇక అచ్చుతప్పులంటారా.. గత మూడు రోజులలో ఇది అప్పుడే మూడో అచ్చు తప్పు :( . ఈసారి నుంచి నిఘంటువులో పదాలు వెతిఇకి రాస్తా లెండి.
కాసేపాగి దాన్ని సరి చేస్తాను.
===
జర్మనీలో నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే (ఇండియన్ రెస్టారెంట్ లేని ప్రదేశాలలో) నా మెనూ సలాడ్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ ( http://pradeepblog.miriyala.in/2008/06/5.html )

KumarN said...

హ హ హ...నేనూ స్టార్ బక్స్ ని ఏమన్నా అంటే ఒప్పుకోను. మచ్చుకు ఇవ్వాళ ప్రొద్దున్నే 7 గంటలు ప్రయాణం చేసి నిద్ర మత్తులో ఫ్లైట్ దిగి, బయటకు రాగానే డంకిన్ డొనట్స్ నీ, చూడగానే నీరసం..అబ్బా దరిదాపుల్లో స్టార్బక్స్ దొరకదే అని. సర్లేమనీ ఈడ్చుకుంటూ బయటకు రాగానే స్టార్ బక్స్ కనబడింది..ప్రాణం లేచొచ్చింది. 15 నిమిషాలయినా నిలబడ్డా..ఒక్క చిన్న కప్పు కాఫీ కోసం.
KumarN

నాగన్న said...

స్టార్ బక్స్ తాజో ఛాయ్ కూడా బాగానే ఉంటుంది. ప్రయత్నించారా?

సుజాత said...

ఫణి గారు,
సబ్ వే శాండ్ విచ్ కి నేనూ పెద్ద ఫాన్ నే! మా ఇంటికి దగ్గర్లోని అవుట్ లెట్ కి నేను మహారాణీ పోషకురాల్ని!

చివరి పేరా లో బోలెడు జీవిత సత్యాలు చెప్పారు. అందులో కొన్ని నాకు వర్తిస్తాయి.:))

అబ్రకదబ్ర,
మిమ్మల్ని ఏదైనా పత్రికలో వెయ్యాల్సిందే, లాభం లేదు. ఈ మధ్య తప్పులు తెగ దిద్దేస్తున్నారు.

నేస్తం said...

హ హ నా ఫ్రెండ్ అయితే అన్నం తినడం మానేసి కేవలం చిరుతిళ్ళు జంతికలు పకోడీలు జిలేబులు మాత్రమే తిని పాపం చాలా డైటింగ్ చేసేది ..కాని ఒక్క కిలో కూడా తగ్గలేది ఎంచేతనో :) `

teresa said...

హహ్హా... పెప్పరోనీ పిజ్జా లో పెప్పరుంటుందనుకోడం ఎంత తప్పో వచ్చిన కొత్తలో నాకూ అనుభవమే. నేను వెళ్ళింది ముస్లిమ్‌ ఫ్రెండ్ తో, ఆర్డర్‌ ఛేసింది పెప్పరోని స్లయిస్‌.. ఇహ చూడండి నా అవస్థ!
సాయంత్రం డిన్నర్‌ టైం కూడా అదే వింత--దిగిందేమో సౌత్‌ లో, అట్లాంటా దగ్గర జూన్‌ నెలలో; ఇంటిల్ల పాదీ ఎండ నడినెత్తినుండగానే 6pmకి అన్నాలు తినేస్తుంటే విస్తుపోయి చూసేదాన్ని :)

@abrakadabra- 'శాకాహారం'ని కరెక్ట్ గా రాయటం 50%కి తక్కువేనండీ, అలవాటు పడిపోవాలి మరి :)

Anonymous said...

Be an Roman in Rome ani sAmetha. You seem to think that Indian life should be observed all over the globe. Grow up!

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@కుమార్ గారు, నాగన్న గారు,
మొత్తానికి స్టార్ బక్స్ అభిమాన గణం చాల మందే ఉన్నారు
@సుజాత గారు,
నిజమే అలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి అందరికీ
@నేస్తం గారు,
అయినా చిరుతిళ్ళు తింటే తగ్గుతారని ఎవరు చెప్పారు? చిరుతిళ్ళు తింటే ఇంకా లావెక్కుతారు
@తెరెసా గారు,
నిజమే ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి అందరికీ వచ్చిన కొత్తలో
@Anonymous,
I knew that phrase and I'm not a machine to switch the gears just like that and forget the Indian life. If being Indian and want to live Indian life is under development in your view, I wish to live like that.
I don't see anything wrong in correlating what I saw with Indian life.

మేధ said...

హు... మీరు మిట్టమధ్యాహ్నం జాగింగ్ అంటున్నారు.. కొరియాలో అయితే, రాత్రి 12కి కూడా వచ్చి జాగింగ్ చేస్తూ ఉంటారు!!! ఇక తిండి అంటారా, మీరు జర్మనీలో పడ్డ పాట్లే :)

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

మేద గారు,
ఏ దేశమేగినా తప్పవన్నమాట ఇలాంటి తిప్పలు :)
పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అని ఊరికే అన్నారా