ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) - 3

ప్రదేశమేదైనా మనిషికి కావలసినవి భద్రత, ఆరోగ్య పరిరక్షణకు చక్కని వసతులు మరియు మనిషిని ప్రశాంతంగా ఉంచే సమాజం.

అమెరికా ప్రయాణం ఖాయమైపోగానే నేను చేసిన పని, అమెరికాలోని నా స్నేహితులకు "నేనొచ్చేస్తున్నానోచ్ " అని చాటింపెయ్యడం. అందరూ ఒక్కటే ఉచిత సలహా ఇచ్చారు "ఎప్పుడూ చిల్లర నోట్లు దగ్గర పెట్టుకో, ఎవరైనా అడిగితే ఒక డాలర్ వెంటనే ఇచ్చేయ్ ... రాత్రి పూట ఒంటరిగా తిరగొద్ద్దు " అని
ఎందుకూ అని అడిగే పిచ్చి ప్రయత్నం చెయ్యలేదు, ఎందుకంటే మీడియాలో భారతీయుల చావులు చూసాక కూడా అడగాలా ?
మన ప్రాణమెక్కువా లేక డాలరెక్కువా అనుకోవాలా లేక నా ప్రాణం విలువ డాలరేనా అని భాదపడాలా అనుకుంటే ఇండియాలో ఉన్నప్పుడు నాకు సమధానం దొరకలేదు. కానీ ఇక్కడకొచ్చాక, తుపాకులు దొరకడం ఎంత సులభమో చూసాక సమాధానమిట్టే దొరికింది. 250$ పెడితే గన్నొచ్చేస్తుందాయె!
ఎంత సులభమో చావడం లేదా చంపడం కదా!!
అయితే అదృష్టవశాత్తు నాకు అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. నేనున్న పట్టణం చిన్నది కావటం, దానికి తోడు ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో రాత్రి సమయమెంతైనా బయటకు వెళ్ళడానికి పెద్దగా ఆలోచించనవసరం లేకపోయింది. అలాగని అమెరికాలో పోలిసులు పనికిరాని వాళ్ళు వగైరా పిచ్చి కూతలు నేను కూయను. ఎందుకంటే అమెరికన్ పోలిసులు నియమాలు, విధి నిర్వహణ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.

అమెరికా వెళ్తున్నానని అంతకు ముందు వెళ్ళి వచ్చిన వాళ్ళకు చెబితే సాధారణ రోగాలకు మందులు తీసుకెళ్ళమన్నారు. ఆసుపత్రికి వెళ్తే నీకు ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక జ్వరం, తలనొప్పి వగైరా వాటికి మందులు తీసుకెళ్ళమన్నారు. సరే అని అలాగే తీసుకుని వచ్చా. అమెరికాలో ఉండవలసిన కనీసమైన వాటిలో మెడికల్ ఇన్స్యూరెన్సు కూడా చేర్చాలి. ఎందుకంటే పొరపాటున చెయ్యో, కాలో విరిగితే అంతే సంగతులు కదా మరి.
చిన్న ఉదాహరణ, రెండు నెలల క్రితం ఒంట్లో కొంత నలతగా ఉండి ఆసుపత్రికి వెళ్ళా.. అప్పటికి బీమా(భీమా) కవర్ చేసేసింది. ఆ తరువాత బీమా(భీమా) కంపనీ వాడికి ఎంత బిల్లయ్యిందా అని తెలుసుకుంటే అది సుమారు 250$ గా తేలింది. ఇంతా చేస్తే నాకొచ్చిన జబ్బూ ఏమీ లేదు, చేసిన పరీక్షలూ ఏమీ లేవు. ఇక చెయ్యి విరగడం, కాలు బెణకడం లాంటి వాటి సంగతి చెప్పకర్లేదు. మా కొలీగ్ భార్యకు డెలివరీ అయితే ఆ బిల్లు విలువ సుమారు 12000$ కు పైనే. (బీమా(భీమా) ఉంది అది వేరే విషయం)
బీమా (భీమా) లేకపోతే పరిస్థితి ఎంత దయనీయమో చెప్పనవసరం లేదు కదా..
బిల్లుల సంగతి పక్కన పెడితే, ఈవాళే(16 ఏప్రిల్ 2009) ఒక వింత పరిస్థితిని ఎదుర్కున్నా.. మా ఆఫీసుకి రెడ్ క్రాస్ వాళ్ళ రక్త దాన శిబిరం వచ్చింది. ఉత్సాహంగా దానం చేద్దామని వెళ్ళా. అక్కడ తేలిన విషయమేమంటే, భారతీయులు అమెరికాలో రక్తదానం చెయ్యాలంటే భారతదేశాఅన్ని విడిచి కనీసం మూడేళ్ళైనా ఉండాలి!!!
ఎందుకు అంటే, భారతదేశం మలేరియన్ దేశం అట. (ఈ జాబితాలో చాలా దేశాలే ఉన్నాయి. ఇందులో మరీ జాతికి అవమానం అని గొంతు చించుకోవాల్సిన పని లేదు). అంటే, నేను మరో ఏడాదిన్నర (జర్మనీ లో ఆరు నెలలు కలిపితే) ఉంటే అప్పుడు రక్తదానం చెయ్యొచ్చు

అమెరికాలో అనుబంధాల గురించి ఇప్పటికే చెప్పేసాను, ఇక దానిలో మరో కోణం చెప్పాలి.ఇక్కడ సాధారణంగా పదిహేను దాటగానే పిల్లలు స్వతంత్రంగా బతకడం మొదలుపెడతారు.ఒక రకంగా పెద్దల చేయి దాటి పోతారు. నేను అమెరికా వచ్చిన కొత్తలో నాకొక కొలీగ్ ఉండేవాడు. అతను ఇంజినీరింగ్ విద్యార్ధి. వేసవి సెలవులలో ఇలా పని చేస్తున్నాడు.
అతనిని ఒక సారి అడిగా “What is your opinion on public transport?”
అతని సమాధానం “We feel using public transport will reduce status symbol“ఇలాంటి అభిప్రాయం వల్ల అతనికి పెద్ద నష్టం లేదు. కానీ ప్రతీ దానిలోనూ పరువు అని పెడర్ధాలు తీసే ఆలోచనల వల్ల ?
నాతో పని చేసే ఒక భారతీయురాలు మాటల సందర్భంలో "నాకు ఇక్కడ అమ్మాయి పుట్టనందుకు సంతోషంగా ఉంది" అంది. కారణమేమిటో నేను చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ చెప్పదగ్గ ఒక సన్నివేశం గుర్తుకొస్తోంది, అమెరికాలో నేను ఒక స్పీకింగ్ క్లబ్ లో జాయిన్ అయ్యాను. అక్కడకి ఒక పంతోమ్మిదేళ్ళ కుర్రాడు వచ్చేవాడు. మాటలలో తెలిసిన సంగతేమంటే అతనికి ఒక కూతురు ఉందని, అతని గర్ల్ ఫ్రెండ్ ప్రస్థుతం గర్భవతి అని. అయితే ఆ కుర్రాడి తండ్రి అతనికి అండగా నిలబడ్డాడు. అది వేరే విషయం.
ఇలాంటి పరిస్థితులున్న సమాజంలో పిల్లలను పెంచడం కత్తి మీద సామేనని నేను చెప్పనవసరం లేదు. అక్కడికేదో భారతదేశంలో ఇలాంటి పరిస్థితి లేదని కాదు, కాకపోతే కొంచెం నయం అంతే.
ఇక అమెరికన్ సమాజంలో అందరూ చర్చించే తెలుపు-నలుపు జోలికి నేను పోవడం లేదు. అనేక వివక్షలున్న భారతదేశం నుంచి వచ్చి ఈ దేశపు లోపాలు ఎంచే గురవింద పనులు చెయ్యడల్చుకోవడం లేదు. ఇహ పోతే, ఇక్కడ గమనించిన మంచి విషయం మగవారితో సమానంగా ఆడవారికి అవకాశాలు ఉండడం. అవి వారు అంది పుచ్చుకుని మంచి స్థానాలకు చేరుకోవడం. (ఇండియాలో ఎంత సమాన అవకాశాలున్నాయో నేను చెప్పనవసరం లేదు)

నా కళ్ళు ఇంకా చాలానే చూసాయి, చాలానే చెప్తానని మారాం చేస్తున్నాయి. పరుగేలనోయి, అని నా వేళ్ళు ఆగుతున్నాయి ప్రస్థుతానికి

10 comments:

భాస్కర్ రామరాజు said...

"బీమా" లేకపోతే గుడ్లు తేలెయ్యటమే. జీతంలో 1/4 శాతం ఈ బీమా కే సరిపోటుంది. బీమా కంపెనీలు డాక్టర్లతో కుమ్మక్కై చాలా ర్యాకెట్లు నడుపుతాయ్. అవి బయటకి కనపడవ్.

కొత్త పాళీ said...

అవును. వైద్య వ్యవస్థలో ఇక్కడున్న అస్తవ్యస్తం బహుశా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. పైన భాస్కర్ చెప్పిన బీమా - డాక్టర్ల కుంభకోణం కంటే, అసలు బీమాకంపెనీలకి వైద్య వ్యవస్థ మీదున్న భల్లూకప్పట్టు ముఖ్య కారణం. రేండోది, అయిందానికీ కానిదానికీ ఎవరిమీదైనా దావా వెయ్యడానికి అవకాశమిచ్చే న్యాయవ్యవస్థ రెండో కారణం. రోజులో సాధ్యమైనంత ఎక్కువ పేషెంట్లని చూసెయ్యాలని డాక్టర్ల మీద ఉండే వత్తిడి మూడో కారణం.

ఇక పిల్లల పెంపకం గురించి అమెరికన్లే బండెడేసి పుస్తకాలు రాస్తున్నారు, అయినా తరగడం లేదు ఆ టాపిక్కు!

అర్జునా (కుదింపు నచ్చిందా?) మీరు ప్రొసీడైపొండి. భోజనం, వర్కు దగ్గర ఆచార వ్యవహారాలు .. ఇత్యాది

కొత్త పాళీ said...

భాస్కరా, అంటే 1/4 వంతు అనొచ్చు. లేదా 25 శాతం అనొచ్చు .. కనీ ఇలా ..?

భాస్కర్ రామరాజు said...
This comment has been removed by the author.
భాస్కర్ రామరాజు said...

అన్నాజీ, నా మొహం, వంతులు అని రాయబోయి, అంత్యాక్షరీ గోలలోపడి బుఱ్ఱ గిర్రున తిరుగుతుండగా, శాతం తగిలించా. అది టెక్నికల్ మిస్టేకు...:):)
ముందరి వ్యాఖ్యలో శాతానికి అని రాయబోయి దీర్ఘాలు మరచితిని. శుక్రోరం ఎఫెక్టు.

ఉష said...

పిల్లల పెంపకం అన్నది ఎక్కడైనా ఒకటేనండి. పోతే ఇంటిలోపల ఎలావున్నా ఇంటి బయట వారు ఎలా మెలుగుతున్నారన్నదే సమస్య. వారికి తల్లితండ్రులకీ మధ్యవుండే సత్సంబంధమే దానికి పరిష్కారం. మాకు తెలిసిన ఒక తెలుగువారి కుటుంబంలో 19 ఏళ్ళ వారబ్బాయికి 2 ఏళ్ళ కొడుకు వున్నాడని అతను విడాకులు తీసుకోవాలనుకున్నపుడు బయట పడింది. గుర్తుకొచ్చి వ్రాసాను.

>> .. గమనించిన మంచి విషయం మగవారితో సమానంగా ఆడవారికి అవకాశాలు ఉండడం. అవి వారు అంది పుచ్చుకుని మంచి స్థానాలకు చేరుకోవడం.

అంతే కాదు లైంగిక వేధింపులు కూడా వుండవు. దొంగచూపులు, వెకిలి మాటలు వుండవు. స్వేచ్చగా వుంటారు కనుక వారికి కావాల్సిన ఆనందాలు అలాగే వెదుక్కుంటారు, మనవారి మాదిరి చాటుమాటు వ్యవహారలకి పోరు. ఇలా అన్నానని ఇపుడు నామీద ఎంతమంది విరుచుకుపడతారో.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@భాస్కర్ గారు,
మీరు 1/4 శాతమన్నప్పుడే అనుకున్నా మీరనేది 25 శాతమో లేక 1/4 వంతులో అని. ఇక్కడి భీమా పధకాలు చూసి భారతదేశం కూడా ఇప్పుడు వాతలు పెట్టుకుంటోంది. ఏమి చేస్తాం.
@కొత్తపాళీ గారు,
అవును పిల్లల పెంపకంలో బోలెడు పుస్తకాలు చూసాను. భీమా వ్యవస్థపై కొత్త కోణం చూపారు.
కుదింపు బాగుంది. మా ఇంటిలో పిలిచే పేరది.
నెమ్మదిగా పాసింజర్ బండిలా అన్ని విషయాలు రాయాలనే ప్రయత్నిస్తున్నానండి. ఇది వరకు జర్మనీ గురించి రాసినప్పుడు పడిన తొందర ఇప్పుడు పడటం లేదు లెండి.
@ఉష గారు,
టీనేజి పిల్లలతో తల్లితండ్రులు స్నేహితులలా ఉండాలట. ఆ విషయంలో తడబడితే వచ్చే అనర్ధాలే అవి.
ఇక ఆడవారి విషయంలో మీరు చెప్పినది నిజమే. అయినా నిజం చెప్పినందుకు భయం దేనికి.

చిన్ని said...

చాల ఆసక్తికరంగా రాస్తున్నారు ...వుపయోగపడే టపా .

భాస్కర్ రామరాజు said...

దీపూ మియా - భీమా కాదు, బీమా.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@చిన్ని గారు,
ధన్యవాదములు
@బాస్కర్ గారు,
నిజమే సుమా బీమా కాస్త బాహుబల భీముడితో రాసానా??