ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) - 2

కనీస అవసరాలు తీరిన తరువాత, బాగుండవలసినవి పని చేసే ప్రదేశం మరియు మనతో పని చేసే వ్యక్తులు. వీటితో పాటు పని రాక్షసులకైతే పని బాగుండటం, సరదా బుల్లోళ్ళకైతే పని లేకపోవటం (జీతం రావాలండోయ్).

పని విషయంలో నాకు నిరాశ కలగలేదు.
పని చేసే ప్రదేశం విషయానికి వస్తే కొన్ని కొత్త విషయాలు తెలిసాయి,
ఆఫీసులో కొన్ని క్యూబికల్సుకు మరియు కొన్ని గదులకు
" ఎక్స్ పోర్ట్ కంట్రోల్ ఏరియాస్ " అన్న బోర్డులు తగిలించి కనిపించాయి. ఏమిటా అని తెలుసుకుంటే, ఆ బోర్డు పెట్టిన ప్రదేశంలోనికి అమెరికన్లు కానివారికి ప్రవేశం నిషిద్దమని తెలిసింది. కొంచెం వళ్ళు మండినప్పటికీ వారి భద్రత వారిదని సరిపెట్టుకున్నా. మన ఇంటిలో మాత్రం అతిధులకు ప్రవేశం లేని ప్రదేశాలను నిర్ధేశించమా?

నా జర్మనీ అనుభవం దృష్ట్యా అమెరికన్లు కూడా అంత సీరియస్ గా ఉంటారనే ఊహించాను. ఎంతైనా మనం చూసినదే ప్రపంచం కదా!! అయితే నా ఊహలన్నీ చాలా త్వరగానే తలకిందులయ్యాయి, మా టీములో అందరూ ఎంతో స్నేహపూర్వకంగా మసలుకోవడంతో.

ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులలోనే నాకర్ధమయిన సంగతేమంటే, ప్రతీ టీములోనూ కనీసం ఒక్క భారతీయుడైనా ఉంటాడని.
భారతీయ ఝండా ప్రతీ చోటా ఎగురుతున్నందుకు గర్వపడాలో పడగనీడలాంటి అమెరికా ఝండాకింద పని చేస్తున్నందుకు బాధపడాలో అర్ధం కాలేదు.
(ఆ పడగల కింద విష్ణువులా పడుకుని లక్ష్మితో కాళ్ళు ఒత్తించుకోవాలో
ఆ పడగలపైన కృష్ణునిలా నాట్యమాడాలో తేల్చుకోవలసింది మనమే) 

ప్రతీ టీములోనూ భారతీయుడనగానే ఒక పిట్ట కధ గుర్తుకొస్తోంది.
ఒక జాత్యహంకార మేనేజర్ తన కింద పని చేసే భారతీయులను చిన్న చూపు చూస్తుంటే వాడి పైన ఉన్న మేనేజర్ భారతీయుడయ్యాడట. అది తెలిసిన ఈ జాత్యహంకార మేనేజర్ కి పాపం నోటి వెంట మాట లేదట (ఎవరో చెప్పగా విన్నాను)
ఇంత మంది భారతీయులను అమెరికాలో చూసాక ఒక రోజు ఒక కల కన్నా,
అమెరికాలో పని చేస్తున్న భారతీయ మేధో సంపద మొత్తం భారతదేశానికి తిరిగి వస్తే, వచ్చి భారతీయ కంపనీలు ప్రారంభిస్తే.... అబ్బో మన దేశానికి తిరుగే ఉండదు.... (పగటి కలలు కనొద్దని పెద్దలు చెప్తే వింటామా!!)

అతి త్వరలోనే అర్ధమయిన మరో సంగతి, ఇక్కడికి వచ్చిన భారతీయులలో అతి తక్కువ  శాతం మాత్రమే భారతదేశానికి తిరిగి వెళ్ళాలనుకునేవాళ్ళని, మిగిలిన వారిలో అత్యధిక శాతం అమెరికాలో ఉంటూ ఇండియాకు వెళ్తాను అని సుత్తి చెప్పేవాళ్ళని, ఇక మిగిలినవారు మాత్రం అమెరికాలో ఉండటానికే సిద్దపడినవాళ్ళని. 
భారతీయులను కట్టిపడేసంత సరుకేముంది అమెరికాలో ?

ఇక మళ్ళీ అమెరికన్ల దగ్గరకొద్దాం, అమెరికా అనగానే వారికి సంస్కృతి లేదనీ వారికి కుటుంబాలంటే విలువ లేదన్నది మీడియా చేసే ప్రచారం. ఇందులో నిజమెంత అన్నది నేను నిర్ణయించ(లే)ను కానీ నేను చక్కని అమెరికన్ కుటుంబాలను చూసాను.
మనవళ్ళు మనవరాళ్ళ కోసం ఆఫీస్ కు సెలవుపెట్టి వారి బాగోగులు చూసే ఒక మేనేజరు
కూతురి కోసం తన పని వేళలను మార్చుకునే తల్లితండ్రులు (ఇద్దరూ టీమ్ లీడర్లు)
వారాంతాలలో సామాజిక సేవ చేసే టీమ్ లీడ్
తన తల్లి తనను సరిగ్గా చూడలేదని బాధ పడుతూనే, తన కూతురికి అలాంటి లోపం రానివ్వని టీమ్ లీడ్
ప్రకృతిని ఇష్టపడుతూ, ప్రకృతి ఒడిలో కుటుంబంతో విశ్రాంతి తీసుకునే ఒక సీనియర్ ఇంజినీర్
తల్లితండ్రులను పట్టించుకోని అన్నతో మాట్లాడకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్న ఒక ఇంజినీర్
తన భార్య అనారోగ్యంతో ఉంటే ఆఫీసుకు సెలవు పెట్టి పిల్లలు మరియు తన అర్ధాంగి బాగోగులు చూసుకునే ఇంజినీర్
అయితే, వీరిలో లోపాలు లేకపోలేదు...లోపాలు లేని మనిషెవరు ఇలలో?
మన కళ్ళకు మన మెదడేమి చూపితే అదే కనిపిస్తుంది....

కనీసావసరాలు, పని చేసే వాతావరణం బ్రహ్మాండంగా కాకపోయినా ఒక మాదిరిగానైనా కుదిరాయి. ఇక తరువాత చూడాల్సినదేమిటి ?
నా కళ్ళతో చూసిన వాటిలో నా మెదడు నా వేళ్ళతో ఏ అనుభవాలను వ్రాయిస్తుందో?

14 comments:

భాస్కర రామి రెడ్డి said...

మీ అనుభవాలు భలే వున్నాయి ప్రదీప్ గారు :)

పెద్దగా కుడి/ఎడమ ( కార్ డ్రైవింగ్, బస్ ఎక్కేటప్పుడు) లకు ,
పైకి/కిందకి ( switch on చేసేటప్పుడు ) ,
ముందుకి/వెనక్కి ( తలుపు లు తీసి లోపలికి/బయటకు వెళ్ళేటప్పుడు )

లాంటి వాటికి అస్సలు కష్ట పడకుండానే adjust అయిపోయారే ... నాకు కుళ్ళుగా వుంది :)

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

భాస్కర్ గారు,
అలాంటి అనుభవాలు లేకేమి... అలాంటివి చివరి భాగంలో రాద్దామని దాచాను.

AMMA ODI said...

ప్రదీప్,

నీ అమెరికా అనుభవాలు బాగున్నాయి. అక్కడి వారి అనుబంధాల గురించి ఇచ్చిన వివరణ బాగుంది.

పరిమళం said...

"ఆ పడగల కింద విష్ణువులా పడుకుని లక్ష్మితో కాళ్ళు ఒత్తించుకోవాలో
ఆ పడగలపైన కృష్ణునిలా నాట్యమాడాలో తేల్చుకోవలసింది మనమే" బాగా చెప్పారండీ! ఇంకా దాచిన వాటికోసం చూస్తున్నాం !

మనోహర్ చెనికల said...

"ఆ పడగల కింద విష్ణువులా పడుకుని లక్ష్మితో కాళ్ళు ఒత్తించుకోవాలో
ఆ పడగలపైన కృష్ణునిలా నాట్యమాడాలో తేల్చుకోవలసింది మనమే"

చాలా బాగా చెప్పారు.

భాస్కర్ రామరాజు said...

భాస్కర్ - బీరువా తెరిచేప్పుడు?? :):)
ప్రదీపు -
"ఆ పడగల కింద విష్ణువులా పడుకుని లక్ష్మితో కాళ్ళు ఒత్తించుకోవాలో
ఆ పడగలపైన కృష్ణునిలా నాట్యమాడాలో తేల్చుకోవలసింది మనమే"
నాకేమనిపిస్తుందంటే,
మనం, క్లైంట్ ఓరియంటెడ్ దేశంగా ఎప్పుడూ క్లైంట్ కి అణూగుణంగానే ఉంటాం, కాబట్టి, వీళ్ల జెండా కిందనే మన జెండా. ఐతే, "మనమే నిర్ణయించుకోవాలి" అనే ఒక్క మాటలో చాలా లోతైన సూచన, హెచ్చరిక కనిపిస్తున్నాయ్ నాకు.
అవి - ఇకనైనా మనం మనకోసం బతుకుదాం, మనకోసం మనం మన వనరుల్ని వాడుకుందాం, మనకోశం మనం భవిస్యత్తుకి కావాల్సిన అవసరల్ని తీర్చటం కోసం పాటుపడదాం అని.

Anonymous said...

భారతీయులను కట్టిపడేసంత సరుకేముంది అమెరికాలో ?

It is called DOLLAR for your ready info.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

@ఆదిలక్ష్మి గారు,
మీడియా చెప్పే సంగతులు నేను చూసిన వాటిలో కొన్నిటికి విరుద్దంగా ఉండటంతో వారి అనుబంధాల గురించి కూడా రాసాను.
@భాస్కర్ రామరాజు గారు,
ధన్యవాదములు. నా అసలు ఉద్దేశ్యం గమనించారు. చేదు గుళికలకు తీపి పూతగా రాసిన మాటలవి
@పరిమళంగారు,
కొంచెం కొంచెంగా రాస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు రాస్తాను
@మనోహర్ , పరిమళం
నా అసలు ఉద్దేశ్యం గమనించే ఉంటారు
@ఎనానిమస్ ,
నిజమే "ధనం మూలమిదంజగత్త్ " అవ్వడం వల్ల వచ్చిన సమస్యే ఇది. అయితే డాలర్ కాక ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. త్వరలోనే రాస్తాను

కొత్త పాళీ said...

బాగా రాస్తున్నారు. మీ సహజమైన రాత చురుకు ఆకర్షణీయంగా ఉంది.
జర్మనీలో కూడా కొన్నాళ్ళు ఉండొచ్చారు కాబట్టి, అక్కడి జీవితానికీ ఇక్కడి జీవితానికీ పోలికలూ తేడాలు పరిశీలిస్తే బావుంటుంది. ఈ విశ్లేషణలోనే భారతీయులు అమెరికాలో ఉండడానికి ఎందుకు ప్రిఫెర్ చేస్తారో తెలుస్తుందని నా అంచనా.
మీకూనూ కామెంటే వారికినీ ఒక ఉచిత సలహా .. అమెరికాలో ఉండిపోవాలని డిసైడు చేసుకునే ప్రజలకి వారికుండే సమస్యలు, మోటివేషన్లూ వారికున్నాయి. ఇంతమాత్రానికి వారేదో మాతృదేశానికి ద్రోహం చేశారనో, లేక ఆత్మవంచన చేసుకుంటున్నారనో అనుకోనక్కర్లే.
కుటుంబాన్ని గురించి సగటు అమెరికన్ పట్టించుకున్నట్టు మనవాళ్ళు బహు కొద్దిమంది పట్టించుకుంటారు. ఆలాగే నీతి, విలువలు అన్నా కూడా వీళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

కొత్తపాళీ గారు,
నేను ముందు అనుకున్నదదే అమెరికాను జర్మనీని పోలుద్దామని. కానీ ఆలోచించగా నేను రాస్తున్నది నాకు వచ్చిన భావనలు, అవి స్వచ్చంగా రాయాలంటే పోలిక సబబు కాదేమో అనిపించింది. అమెరికానో జర్మనీనో గొప్పగా చూపే ఉద్దేశ్యం లేనప్పటికీ నాకు జర్మనీనే నచ్చింది అమెరికా కన్నా.
అమెరికాలో ఉండే భారతీయులు ఆత్మవంచనో లేక దేశ ద్రోహమో చేస్తున్నారనో నేననుకోవటం లేదు. నేను పైన రాసిన దానిలో ఆ అర్ధమొచ్చేలా రాయలేదనే అనుకుంటా.. ఎవరి అభిప్రాయాలు వారివి అన్నదానితో నేను ఏకీభవిస్తాను
ఇక సగటు అమెరికన్ గురించి మీరు చెప్పినదానితో ఏకీభవిస్తాను, అంతా మీడియా మాయాజాలం ...

ఉష said...

నాకేమో మరొక అనుభవం. ఆస్ట్రేలియాలో నా మొదటి పని చేసే ప్రదేశంలో అసలు భారతీయులు లేరు. కరు అన్న ఒక సింగళీ వుండేవాడు. అతన్ని చూస్తే ఏదో మనవూరి వాడన్నంత సంబరపడేదాన్ని. పైగా అది ఆంగ్లేయులది. మా మానేజరు, టీము లీడు ఇద్దరూ దంపతులు. ఇద్దరూ చాలా స్నేహితంగా వుండేవారు. ఇద్దరం తరచు కలిసేవారం. ఇప్పటికీ ఈ-మెయిల్లో కలుసుకుంటాము. ఇకపోతే మీరు వ్రాసినవి నేనూ గమనించాను. 10 రోజులు సెలవుపెట్టి తల్లి, తండ్రులని, అత్తామావల్ని చూసి వచ్చేవారు. బావ మరిది ఇంటికి పెయింటు వేసేవారు. మరదలి కుటుంబానికి తోడ్పడేవారు. తల్లీతండ్రీ ఇంటినుండి వెళ్ళగొట్టిన భారతీయురాలికి ఆశ్రయమిచ్చిన నల్ల జాతి స్త్రీ, ఇలా ఎందరో.

అవునూ, ఈ వరసలో మిమ్మల్ని పిలిచేవారి ఫోను నంబరు ఇవ్వరా? పాట నేర్పుతాను "పగటి కలలు కంటున్నా మావయ్యా, .." హ హ హ్హా!.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

ఉషగారు,
నేను జర్మనీలో ఉన్నప్పుడు అక్కడ ఒక హిందువుల గుడి ఉంది. సంగతేమంటే అది సింగళీల చేత స్థాపించబడిన గుడి.
పనిలో పని మీ ఆస్ట్రేలియా అనుభవాలు రాయకూడదూ? మాకు మీ కళ్ళతో ఆస్ట్రేలియా చూపించవచ్చు కదా,

ఆస్ట్రేలియాలో మీరు చెప్పిన అనుబంధాలు వింటుంటే నాకనిపిస్తోంది "ఎంతైనా అందరమూ మనుషులమే కదా"...
మీడియా చెప్పే ప్రతీదీ వింటే అపోహలు పెరుగుతాయి.


నాకు సోదరీమణులు లేరు, కనుక నన్ను మామయ్య అని పిలిచే భాగ్యం ఎవరికీ కలగలేదు. పెళ్ళి కూడా కాని వాడిని, ఇంక ఆ రకంగా కూడా ప్రస్థుతానికి మామయ్యను కాదు.

kiran said...

ok . its nice

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

thanks kiran