ఉగాది నుంచి ఉగాదికి (నా కళ్ళతో అమెరికా) -1

ముందు మాట

సర్వాధారిని భారతదేశంలో స్వాగతించి విరోధిని అమెరికాలో స్వాగతించాను. సంవత్సరంలో ఎంత మార్పు?
అవును సంవత్సరమంటే తక్కువ సమయమా...
అమెరికా.... కొంతమంది కళ్ళకు అది "ఆహా మెరిక"... కొంతమంది కళ్ళకు "అదో మరక"
నాకు విదేశాలు తిరగాలన్న కోరిక పెద్దగా లేదు. కానీ 2005-06 కాలంలో అమెరికా వెళ్ళాలనే కోరిక మొదలయ్యింది. 2006లో నా L1 వీసా నిరాకరించినప్పుడు అది ఇంకా బలపడింది. మొత్తానికి సంవత్సరకాలం తరువాత 2007లోH1 వచ్చిన తరువాత నా అదృష్టం బాగుండి జర్మనీ వెళ్ళాను. (అది దురదృష్టమని మొదట్లో నాకనిపించేది, కానీ అమెరికా వచ్చిన తరువాత ఆ అభిప్రాయంలో పెనుమార్పు వచ్చింది)
సుమారు సంవత్సరం (మే నాటికి సంవత్సరమవుతుంది) పాటు ఈ అమెరికాలో నేను చూసినది, తెలుసుకున్నదీ తక్కువే.
అందుకే ఈ స్వగతంలో కేవలం నా కళ్ళతో చూసినవే ఉంటాయి. ఇది అమెరికా మొత్తం గురించి కాదు. నేను చూసిన చిన్న అమెరికా గురించి.

ఇక లోనికి అడుగేస్తే,
మే 2008 లో ఒక వేసవికాలపు సాయంత్రం అమెరికాకు నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అప్పటి ముందు అనుభవాల దృష్ట్యా ప్రయాణంలో నిద్రపోయా.. జెట్ లాగ్ అనే పదం యొక్క అర్ధం దిగాక తెలిసింది.
నేను అమెరికాకు వచ్చిన ప్రదేశం గ్రీన్ విల్లే (పచ్చని గ్రామము). పేరుకు తగ్గట్టే  పచ్చని ప్రదేశం.

ఎలాంటి ప్రదేశమైనా మనిషికి కావలసినవి మూడే అంశాలు కూడు గుడ్డ నిద్ర.
ఈ మూడింటితో పాటు అనుకూలించవలసిన మరో విషయం వాతావరణం.
అమెరికా అనగానే శీతలదేశమనే భావనతో వచ్చాను. అలాంటిది బెజవాడ వేడి నన్ను పలకరించే సరికి నాకు మతి పోయింది. కొంచెం సంతోషం కూడా అనిపించింది. ఇలా వాతావరణం అనుకూలించడంతో రోజూ శుభ్రంగా వాకింగ్ చేసేవాడిని. (వాకింగ్ అంటే అది ముసలివాళ్ళ పని అని కొందరు వేరే అర్ధం తీసారు అది వేరే విషయం)

కూడు, విదేశాలలో శాఖాహారులకు ఎదురయ్యే ఇబ్బందులకు అంతే లేదు. అందుకే మన వంట మనం చేసుకున్నంత కాలం కూడుకు లోటు లేదు.
గుడ్డ, జీతం బాగున్నంతసేపూ ఈ విషయంలో బాధ లేదు. కానీ ప్రదేశాన్ని బట్టి మన జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి. నాకు నాకులా ఉండడం ఇష్టం కనుక, మార్పులు లేవు.
నిద్ర, అమెరికాలో దిగిన వెంటనే రెండు రోజులు హోటల్ లో ఉన్నా, ఆ తరువాత ఒక అపార్ట్ మెంట్ తీసుకుని అక్కడకు మారాము. నాకు అమెరికాలో నచ్చిన విషయాలలో ఒకటి అపార్ట్ మెంట్ కల్చర్, చక్కగా ఒక ఆఫీస్ పెట్టుకుని అద్దెకివ్వడం, అగ్రిమెంట్స్ రాయడం, ఫిర్యాదులు తీసుకోవడం. నాకు బాగా నచ్చింది. దానికి తోడు ఆ విశాలమైన కాంప్లెక్సులో సౌకర్యాలు కూడా బాగున్నాయి. అయితే ఇక్కడ కొన్ని చిక్కులు లేకపోలేదు. మధ్యలో ఖాళీ చేసి వెళ్ళాలంటే అగ్రిమెంట్ బ్రేకేజీ కింద అధిక మొత్తంలో అద్దె చెల్లించాల్సి రావడం (ఈ చిక్కుల్లో పడవలసి వచ్చింది తరువాత).

గ్రీన్ విల్లే లో నేనున్న అపార్ట్మెంట్

అమెరికాలో కనీస అవసరాలంటే ఆ మూడే కాదు వాటికి మరో మూడు కలపాలి
కారు, ఇంటర్ నెట్ , ఫోన్
వీటిలో ఏది కావలన్నాఅమెరికా వచ్చిన తరువాత కనీసం మూడు నుంచి నాలుగు వారాలు ఆగాలి.
వీటిలో ఏదీ లేకుండానే అమెరికాలో నా జీవితం మొదలయ్యింది.
కారు,
ఈ విషయం తలచుకుంటే బాధ కలుగుతుంది నాకు, ఇక్కడ లైసన్సు తీసుకుందామని వచ్చి నేను చేసిన పెద్ద తప్పు ఇదే. ఈ గ్రీన్ విల్లే లో ఆరునెలల పాటు లెర్నింగ్ లైసెన్సు మీద ఉంటేనే లైసెన్సు తీసుకోనిస్తారు. చిన్న గ్రామం కావడంతో ప్రతీ దానికి కారు కావలసిందే. కారు లేక జీవితం పరాధీనమయ్యింది. ఇది ఎంతో బాధ కలిగించే విషయం.
ఇంటర్ నెట్ ,
అమెరికా వచ్చిన తరువాత సోషల్ సెక్యూరిటి నంబర్ తీసుకుంటేనే మనకు అధికారిక గుర్తింపు ఉంటుంది. అయితే అది రావాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. అంతవరకు మనకు ఎలాంటి కనెక్షన్లు ఇవ్వరు. (ఇంటి అగ్రిమెంట్, బాంకు అకౌంట్ లాంటివాటికి పాస్ పోర్టు చాలు. అయితే తరువాత సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇవ్వాలి) నిజానికి ఈ విషయం మొదట్లో చిరాకు తెప్పించినా తరువాత బాగా నచ్చింది. ప్రతీ మనిషికీ ఒక అధికారిక గుర్తింపు ఉంది కదా మరి. ఇక ఇంటర్ నెట్ కనక్షన్ వచ్చేవరకు కొలీగ్ కనక్షన్ వాడేవాడిని.
ఫోన్,
చాలా మంది ఐ ఫోన్ తీసుకోమని చెప్పినా, నాకు కూడా అనిపించినా తీసుకోలేదు. కారణం చాలా చిన్నది. కానీ ప్రభావం చాలా పెద్దది. ఏపిల్ యొక్క నియంతృత్వ పోకడలు, ఐ ఫోన్ మీద సంవత్సరం పాటు రాయాల్సిన అగ్రిమెంట్ , సంవత్సరంలో దాని మీద పెట్టాల్సిన ఖర్చు సుమారు 800 డాలర్లకు సమీపించడం. అందుకే సులభంగా ప్రీ పెయిడ్ సిమ్ తీసుకుని దాన్ని నా జర్మనీ ఫోన్ తో వాడసాగాను.

ఇక మొదలైంది అ"మెరిక"నా లేక అ"మరకా" అన్నది తెలుసుకునే యత్నం......

10 comments:

ఉష said...

నాకు ఆస్త్రేలియ వెళ్ళిన మొదట్లో కన్నా నయం మీ అనుభవం. నడిచే అలవాటు తక్కువగా, నడిచే అవసరం ఇంకా అతి తక్కువగా బ్రతికిన నాకు మైళ్ళకొద్దీ నడక, నీరసం, నిలబడటం, సహనం అన్ని అక్కడే అలవడ్డాయి. అసలు నీళ్ళు కొనుక్కోవాలని తెలిసిందక్కడే. నిజానికి ఇంట్లో ఇంటర్నెట్ లేని ఆ తొలి సంవత్సరాలే బాగా గడిచాయి. ఫోన్లు కూడా నాకు చాలా తక్కువ అలవాటీనాటికీను. కారు కూడా అతి తక్కువగా తిరిగేవారితో పోటి పడతాను. ఇక ఏం చేస్తారు అని అడుగుతున్నారా, మీ మాదిరే నా జీవనం మాతృభూమికి కర్మభూమికి నడుమ పెద్దగా మారలేదు. ఇల్లే స్వర్గం, ఇంట్లో నాలుగు గోడలే నడుమ నా కోట, నా ధ్యానం, నా పుస్తకాలు, నా చిన్న లోకం, ఆపై ఉద్యోగం ఇంతే నా ప్రపంచం. నేనూ మారలేదు, రెండు మూరల జుట్టు [donate చేసాక] రెండగుళాలకి తగ్గటం, చీర నుండి జీన్స్ ఇంతే అనుకుంటా పెద్ద మార్పు. నేనూ శాఖాహారినే కాని పెద్దగా ఇబ్బంది లేదు, 90% ఇంట్లో చేసుకుంటాను, బయటకి వెళితే అందరి తలా తిని నాకు కావాల్సిందే తింటాను చివరాఖరుకి. ఫలహారం అచ్చంగా పాటిస్తాను. పాలు పట్టినన్ని పట్టిస్తాను. ఇంకా కొన్ని చిటుకులు చెప్తాను. నాకు మొదటినుండీ బాధ కలిగించేది ఇక్కడి junk mails కోసం వాడే కాగితాలు, అచ్చువేసే సాధనాల దుర్వినియోగమూను. సగం మంది mail box నుంచే trash లోకి విసిరేస్తారు. అందరినీ మార్చలేను కనుక యధావిధిగా నా వంతు కృషి చేస్తుంటాను.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

ఉషగారు,

మీరు ఆస్ట్రేలియాలో చూసినవి నేను జర్మనీలో అనుభవించినవాటికి దగ్గరగా ఉన్నాయి. వీలుంటే జర్మనీ మీద రాసినవి చదవండి.

భాస్కర్ రామరాజు said...

అదే తేడా. హెచ్-వన్ మీద వచ్చినోళ్లకీ బి-వన్ మీద వచ్చినోళ్లకి. నేను ముందర బి-వన్ మీద వచ్చా. రాజుగారి కుమారుడిలా ఉండింది. అతిధి గృహం అదీ ఇదీ, వారానికో కారు గట్ర.
కొంతకాలమయ్యాక హెచ్-వన్ మీద వచ్చా. మీరు చెప్పినవన్నీ ముందుగా కష్టలే, తర్వాత అలవాటైపోతుంది. పెళ్లాం పిల్లల్తో ఉండేవారికి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి.
శాకాహారులకు కష్టమే. ఐతే సబ్వే లాంటివాటిల్లో బాగనే ఉటుంది లంచ్ గట్రా.
మిగతా విషయాలు ఎలా ఉన్నా, యూరోప్ లో భోజనం అదీ శాఖాహారులకి, మహా కష్టం. నేను హెల్లాస్ లో, ఇటలీలో పని చేసా. ఐతే మనకి కొంత సుకృతంవల్ల వంట "వచ్చు" కాబట్టి గడిపేసాం.:):)

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

భాస్కర్ గారు,
అలవాటయిపోయంది లెండి.
మీరు చెప్పిన కుటుంబ సమస్యలు, సబ్వే (మిగతా రెష్టారెంట్ల గురించి కూడా) గురించి తరువాయి భాగాల్లో రాయబోతున్నాను.
శాఖాహారులకు యూరప్ లో చాలా కష్టం, నేను జర్మనీలో అనుభవించాను. నేను జర్మనీలో వంట నేర్చుకున్నాను.
ఉషగారు,
ఎదురు చూస్తున్నా, మీ నుంచి మరిన్ని వినడానికి. అయితే మరో రెండు మూడు భాగాలయ్యాక చెప్పండి. (ఏమీ లేదు కొంచెం నెమ్మదిగా మొత్తం రాద్దామని)

అబ్రకదబ్ర said...

గ్రీన్‌విల్ ఏ రాష్ట్రంలో? South Carolina?

మీరుండే చోట ఏమో కానీ SF Bay Area లో ఐతే శాకాహారులకి తిండి కరువే లేదు. మా ఊరు, చుట్టుపక్కల పాతిక మైళ్ల వ్యాసంలో నలభైకి తక్కువ కాకుండా భారతీయ రెస్టారెంట్లున్నాయి. ఇవి కాక సబ్‌వే, క్విజ్‌నోస్, టాకో బెల్, గట్రా ఉన్నాయనుకోండి. మీ దగ్గర్లో ఉంటే - In & Out లో animal style veg burger అనేది ఉంటుంది. బాగుంటుంది, ట్రై చెయ్యండి. ఈ ఐటం వాళ్ల మెన్యూలో కనిపించదు. ఆ పేరు చెప్పి అడిగితే ఇస్తారు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

అబ్రకదబ్ర గారు,
అవును , South Carolina లోనే... అయితే నేను ఇప్పుడు అక్కడ లేను. నేను మే 2008 లో వచ్చినప్పుడున్న ప్రదేశమది.
బే ఏరియా బాగుంటుందని విన్నాను.
వస్తున్న వ్యాఖ్యలతో నాకు ఉత్సాహం పెరుగుతోంది. త్వరత్వరగా మిగిలిన భాగాలు కూడా రాసేస్తాను. ఈ భాగంలో అమెరికాలో అడుగుపెట్టమనే అంకాన్ని ముగించాను.

పరిమళం said...

ప్రదీప్ గారు , రాబోయే టపాల కొరకు ఎదురు చూస్తున్నాం .

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

పరిమళంగారు,
కొంచెం నెమ్మదిగా అయినా సరే, మొత్తం రాస్తాను. మీ అభిమానానికి ధన్యవాదములు

కొత్త పాళీ said...

కొత్తగా వచ్చినవాళ్ళు కానీ, లేదా కొద్ది కాలపు ఎసైన్మెంట్ మీద వచ్చిన వాళ్ళు గానీ అమెరికాని ఎలా చూస్తారా అని నాకు చాలా కాలంగా కుతూహలం ఉంటూ వచ్చింది. మొత్తానికి మీరు మొదలెట్టారు, ఆ అనుభవాల్ని పట్టుకునే కార్యక్రమం.

రెండు సూచనలు:
1. అమెరికాలో సిస్టంసు ఎలా ఉంటాయి అనే వివరణల్లోకి వెళ్ళ్కండి. విలువైన మీ సమయమూ, ఇక్కడ జాగా అనవసరంగా ఖర్చైపోతాయి. మీ అనుభవాల్ని రాయడానికి అవసరమైనంత వరకూ ఈ విషయాల్ని స్పృశిస్తే చాలు (ఉదా. సోషల్ సెక్యూరిటీ నెంబరు).

2. మీరిది చెయలేదు గానీ, చేస్తారేమోనని భయం - అనుభవాలకి ఒక కామెడీ రంగు అద్దడం.

పూనుకుని ఈ పని చేస్తున్నందుకు బహు ధన్యవాదాలు.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

కొత్తపాళీ గారు,
మీ సూచనలకు ధన్యవాదములు.
కామెడీ జోలికి పోవటంలేదు లెండి. అనవసరంగా చేతులు కాల్చుకోవడం దేనికి ?