అమావాస్య నాటి వెన్నెల


    బయట ఎక్కడో మేఘఘర్జనకి నాకు మెలకువ వచ్చింది.
కిటికీలోంచి బయటకు చూస్తే చిమ్మ చీకటి,
అసలే అమావాస్య అందులోనూ ప్రభుత్వంవారి దయతో మా ఊరిలో వెలగని వీధి దీపాలు.
నాకు నిద్ర పట్టేలా లేదు, లేచి బయటకు వచ్చా.
ఏమీ కనిపించటం లేదు. కాసేపు అలా చీకటిలోనే ఉందామనిపించింది.
ఇంతలో లోపలినుంచి "ఏవండీ" అంటూ నా భార్య పిలిచింది. ఆమెకు కూడా నిద్ర పట్టడంలేదేమో!!
తను కూడా వచ్చింది, "లైటు వెయ్యమంటారా?"
"వద్దు, ఇలాగే బావుంది"
సరే, అంటూ నా భుజంపై తల వాల్చి కూర్చుంది.
తను ఏదో చెప్తోంది, నా మనస్సిక్కడ లేదు ఏదో ఆలోచిస్తున్నా, ఎక్కడో స్వప్నలోకంలో విహరిస్తున్నా.
"వింటున్నారా"
చెప్పు , స్వప్నా అందామని నోటివరకు వచ్చిన మాటను లోనికి తోసా. నా భార్య పేరు గీత కదా మరి.
"ఎప్పుడూ ఇంతే నేను చెప్పేది వినరు" అంటూ చిన్నగా కోప్పడింది
"వింటున్నాను లేవే"
"అయితే నేనేమి చెప్పానో చెప్పండి"
అవును, నిజమే. నా మనసంతా ఏదో అలజడి.
మనసులో స్వప్నను ప్రతిష్టించుకుని గీతతో బతుకుతున్నా.
తను చెప్పేది ఇంతవరకూ ఎప్పుడూ సరిగ్గా వినలేదు.
నేనెంత పట్టించుకోకపోయినా తనకు నేనంటే ఎంతో ప్రేమ.
నెమ్మదిగా "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నాను
"మనస్ఫూర్తిగా చెప్పండి, నా కోసం కాదు"
హమ్మయ్య మొత్తానికి అంశాన్ని భలే మార్చా. నాకు నేనే శభాష్ అనుకున్నా..
ఇంతలో తనే అంది మళ్ళీ, "స్వప్న గుర్తుకొచ్చిందా"
నావైపు నుండి మౌనమే సమాధానమయ్యింది.
ఇంతలో దూరంగా ఎక్కడో మళ్ళీ మేఘఘర్జన.
" వర్షమొచ్చేలా ఉంది " పైకే అన్నా...
"మెరుపులు అమావాస్యనాడు కూడా వెన్నెలను సృష్టిస్తున్నాయి, ఎంత బావుందో కదా"
ఒక్కసారిగా నా సమస్యకు సమాధానం లభించినట్లయ్యింది
మబ్బులు పౌర్ణమి నాడు కూడా అమావాస్యను సృష్టిస్తున్నాయనుకుంటూనే గడిపాను, అసలైన మబ్బులు నా కళ్ళకు పట్టాయని అవి ఈనాడు వర్షించబోతున్నాయని అర్ధమయ్యింది.
చీకటిలో నెమ్మదిగా గీతవైపు చూసా, నా స్వప్న ఎక్కడో లేదు ఇక్కడే గీతలోనే ఉంది అనిపించింది. 
నెమ్మదిగా తనతో అన్నా "నిన్ను ప్రేమిస్తున్నా" ఊహూ అన్నాననుకున్నా అంతే!
గొంతునుంచి మాట పెగలడం లేదు. ఒళ్ళంతా చల్లగా అవుతోంది, నా హృదయ స్పందన ఆగినట్టనిపించింది.
ధైర్యంగా గట్టిగా అరిచా "నిన్ను ప్రేమిస్తున్నాను" .
"నేను కూడా" అంది గీత
ఎక్కడో దూరంగా మరోసారి మేఘం ఘర్జించింది.
నెమ్మదిగా వర్షం మొదలయ్యింది.
ఇంటి ముందు సన్నజాజి మొగ్గలు నెమ్మదిగా వికసించసాగాయి. వాన నీటి జల్లుతో అవి పులకించసాగాయి.

ఆ రాత్రి నాకు అమావాస్యనాడు వెన్నెల కనిపించింది. ఇకపై కూడా కనిపిస్తుంది. నా స్వప్న గీతలో కనిపించినట్టు.

3 comments:

sireesha said...

feelings will not be stable just like ...LIFE.today's thought is not final....(till the end of life(lifekanna breathe ante baguntundemo)).
I suggest u,to not to take any fast decisions, mari decision tesukunna vatigurinchi antavaaa...
try to rethink......k.....

ఉష said...

* నాకైతే ఇలా అనిపించింది. మీ మనసులో తిష్టవేసుకుంది స్వప్న కాదు, ప్రేమ. ఒక రూపుగా ఘనీభవించినది క్రమేణా కరిగి మరో రూపాన వ్యక్తమైంది. అమావాస్యలో వెన్నెల కన్ను కల్పించే భ్రమ. ప్రేమే స్వప్నగా, గీతగా మీకు కనపడటం కూడా అంతే. హృదయంలోని అనురాగం చేసిన మాయ. కలిసి జీవించక పోయినా కలిసిన హృదయాల్లో జీవించేవుండేదే ప్రేమ. అర్థం కాలేదా. అయితే మీరింకొంచం ఎదగాలి.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

ఉష గారు,
నా ఊహకు మీ ఆలోచనకు బోలెడు వత్యాసం ఉంది. పర్లేదు, మీ ఆలోచన కూడా బానే ఉంది