అమావాస్య నాటి వెన్నెల - 2

 

    ఆ అమావాస్య నాటి రాత్రి, నేను ఇక గీతే నా లోకమని నిర్ణయించుకున్నాను.
తరువాతి రోజు, ఉగాది మామూలుగానే తెల్లవారింది.
పొద్దున్నే లేచి ఇంటి ముందు వసారాలో పేపరు చదువుతున్నా నా వార్తాజ్నానం (వార్తాజ్నానం = వార్త + అజ్నానం) పెంచుకుందామని
గీత పూజ కోసమని ఇంటి ముందు పూచిన సన్నజాజి పూలు తెంపుతోంది.
ఇంతలో ఇంటి ముందో కారాగింది. కారులోనించి దిగిన వ్యక్తిని చూసి నా చేతిలో పేపరు, గీత చేతిలో పూలు నేల జారాయి.
వచ్చిన వ్యక్తి ఏమయిపోయిందోననుకున్న స్వప్న. గీత చేతజారిన పూలపై వయ్యరంగా నడచి వచ్చి మా ఇద్దరి వంక చూస్తూ
"ఎలా ఉన్నారు?" అంది. 
"బాగానే ఉన్నాము, నువ్వు ఎలా ఉన్నావు?" అన్నాను.
గీత ఇదంతా కలేమో అనుకుంటోంది ఇంకా, నెమ్మదిగా తేరుకొని "ఎక్కడనుంచి వస్తున్నావు? ఎలా ఉన్నావు? కొంచెం చిక్కినట్టున్నావు"
స్వప్న చిన్నగా నవ్వి "నేను చిక్కలేదు, నువ్వే ఒళ్ళు చేసావు. అప్పుడెంత అందంగా ఉండేదానివి"
నాలో ఆమె ఇన్నాళ్ళు ఎక్కడుందో అన్న ఆతృత పెరగసాగింది. ఇంక ఆపుకోలేక, నిన్నటి రాత్రి నిర్ణయాన్ని కాసేపు పక్క పెట్టి

"అవును ఇన్నాళ్ళు ఏమయిపోయావు, ఎంత ప్రయత్నించినా నీ ఆచూకీ దొరకలేదు"
ఆమెకు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేనట్టుంది, సూటిగా ఇప్పుడెందుకొచ్చిందో చెప్పేసింది "నా పెళ్ళికి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను"
"ఎవరితో నీ పెళ్ళి?"
"మనతోనే చదువుకున్నడు కదా అరవింద్ "
"...! " నాకు నోటమాట రావడం లేదు.
ఇంతలో గీత అందుకుని "అరవింద్ కూడా వచ్చాడా? "
"తను రాలేదు, నేనొక్కదాన్నే వచ్చాను"
"అయ్యో నిన్ను ఇలా వాకిట్లోనే నుంచుని మాట్లాడిస్తున్నా. లోపలికి రా" అంటూ స్వప్నను లోపలికి తీసుకెళ్ళింది గీత.

సన్నజాజి పూలు నన్ను వెక్కిరిస్తున్నట్టనిపించింది కాసేపు అక్కడే నుంచుండిపోయా...
స్వప్నను మర్చిపోదామని గత నాలుగేళ్ళుగా నేను పడ్డ భాధ నన్ను వెక్కిరిస్తున్నట్టనిపించింది.
సంవత్సరం ఎంత గొప్పగా మొదలయ్యిందో !!

ఎక్కడో కోయిల పాడుతోంది తియ్యగా, నాకు మాత్రం అది కాకి అరుపులా అనిపించింది.
అలా ఎంతసేపు అక్కడ నుంచున్నానో నాకే తెలియదు, ఇంతలో లోపలినుంచి గీత పిలిచింది.
భారంగా అడుగు ముందుకు వేసాను..

No comments: