తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 5

జర్మనీలో శాఖాహారుల కష్టాలు:

ఆ మాటకి వస్తే జర్మనీనే కాదు, భారత ఉపఖండం దాటి ఎటు వెళ్ళినా శాఖాహారుల కష్టాలకు ఆరంభం మాత్రమే ఉంటుంది అంతే ఉండదు.
వంట వస్తే సరే కాలం గడపచ్చు కానీ వివిధ ప్రాంతాలు సందర్శించాలనుకుంటేనే...
బయట ఏ రెష్టారెంటుకి వెళ్ళినా శాఖాహారం కావాలంటే చెప్పే లిష్టు కొంచెం చిన్నగానే ఉంటుంది, ఎంత చిన్నగా అంటే మన సినిమాలలో కధానాయికలు (???) వేసుకొనే డ్రస్సంత.
మన అదృష్టం బాగుంటే ఆంగ్లం తెలిసినవారు వెయిటర్స్ అవుతారు లేదంటే పగలే చుక్కలు.
ఇంక ఆ లిష్టులో ఉండే ఆహార పదార్ధాలు

  • వంటిని తగ్గించుకోవటానికి తినే పచ్చి కూరగాయలు (ఇండియాలో పొరపాటున కూడా తినని మెనూ ఐటమ్ ఇది)
  • వంటిలో కొవ్వు పెంచే పోమోస్ (బంగాళా దుంపని సన్నగా పొడుగ్గా తరిగి చేసిన చిప్సు)
  • క్రిమిసంహారకాలుగా పిలవబడే కోలాలు

అందుకే జర్మనీలో ఎక్కడికి వెళ్ళాలన్నా శాఖాహారులు పచ్చి కూరగాయలు తినడానికి ముందే సిద్దమవ్వాలి. అదృష్టం బాగుంటే చక్కగా పిజ్జాలు దొరకవచ్చు.
ఇహ సూపర్ మార్కెట్లు పర్లేదు, చక్కగా కూరగాయలు దొరుకుతాయి.
భారతీయ షాపులు ఉండే పెద్ద నగరాల గురుంచి కాదు నేను చెప్పేది, జర్మనీలోని చిన్న పల్లెటూర్ల గురుంచి.
జర్మన్ల అభివృద్ది:

అప్పుడెప్పుడో ఫీనిక్స్ పక్షి గురుంచి ఒక రష్యన్ అనువాద పుస్తకంలో చదివాను, జర్మనీ వెళ్ళాకా దాన్ని చూసాను. జర్మనీ దేశమే ఒక ఫీనిక్స్ పక్షి.
పల్లెటూర్లంటే గుర్తుకు వచ్చింది. అది ఎంత చిన్న ఊరైనా సరే, సామాన్యుడు బతకడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
చక్కగా చదివనంతవరకు నాణ్యమైన ఉచిత విద్య (MS చేసే భారతీయులకు కూడా) , చక్కని రవాణా సదుపాయాలు, నడిచే వాళ్ళకు మరియు సైకిలుపై వెళ్ళేవారికి ప్రత్యేకమైన రహదారి. (పేరుకు అగ్ర రాజ్యమైన అమెరికాలో రవాణా సదుపాయాలను నిర్లక్ష్యం చేసినట్టు ఏ దేశమూ చేసి ఉండదు, చేయకూడదు. వీరు వాడే కార్లలో సగం తగ్గినా బోలెడు ఇంధనం ఆదా మరియు కాలుష్యం కూడా తగ్గుతుంది)
ఇప్పుడు ఇండియాలో ఇంటర్ చదివే వాడు కూడా నాకు బైకోబైకు అని గోలపెడతాడు కానీ జర్మనీలో ఆఫీస్ కి కూడా తొలి ద్విచక్రవాహనమైన సైకిలుపై వచ్చే వారు చాలా మంది ఉన్నారు.
ఎందుకో నాకు చాలా విషయాలలో అమెరికా కన్నా జర్మనీనే నచ్చింది. భారతదేశం కన్నా కాదు.

తిరుగు ప్రయాణం:
విరహం కన్నా తియ్యని మరియు భాధాకరమైన అనుభూతి ఏమీ ఉండదేమో. నాకప్పుడప్పుడనిపిస్తూంటుంది, "మనుషులను దూరం చేసి మనసులని దగ్గర చేసే విరహమే ప్రపంచానికవసరం" అని.
తిరిగి ఇండియాకి తిరిగివెళ్ళే రోజు దగ్గరపడే కొద్దీ చిన్నప్పుడు వేసవి సెలవుల కోసం ఎదురు చూసిన రోజులు గుర్తుకు వచ్చాయి. మళ్ళీ ఇంకో నెలలో వస్తా మిత్రమా అంటూ జర్మనీకి వీడుకోలు చెప్పి బయలుదేరాము. (మళ్ళీ నలభై రోజులకి జర్మనీకి వెళ్ళాము) ఇక జర్మనీ వెళ్ళేటప్పుడు విమాన ప్రయాణానుభవాన్ని గుర్తుంచుకుని నా మొబైల్ లో పాటలు పూర్తిగా లోడ్ చేసా. కానీ ఫ్రాంక్ ఫర్ట్ లో ఎదురుచూసే సమయంలో అనుకోకుండా "The Alchemist" అనే పుస్తకం కొన్నా. పుస్తకం తెరిస్తే నిద్ర పోతానేమో అనుకున్నా, కానీ నాకు విమాన ప్రయాణంలో చక్కని తోడు ఇచ్చింది ఆ పుస్తకమే. విమానం ఎక్కినప్పుడు మొదలు పెడితే దిగేసరికి పూర్తయ్యింది. ఇంకొన్ని పుటలు ఉంటే బాగుండు అనిపించింది. కాబట్టి విమాన ప్రయాణంలో బోరు కొట్టకూడదనుకుంటే పక్క వాడితో సుత్తైనా కొట్టాలి లేదా మంచి మజానిచ్చే పుస్తకమో చదవాలి. ఈ రెండు కుదరకపోతే కుంభకర్ణుడిలా నిద్ర పోవాలి. (ఇలా నిద్ర పోవాలంటే నాలా దేవుడి చేత ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయే వరం పొందని వారు, ప్రయాణానికి ముందు ఒక వారం పాటు నిద్రను తగ్గించాలి).

(నా తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు సమాప్తం, విదేశాలకు వెళ్ళివచ్చాక ఇండియాలో పడే పాట్లు తరవాతి జాబులో)






No comments: