తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 4

2007 దీపావళి జర్మనీలో:
2006 దీపావళి, ఒక స్నేహితురాలికి దీపావళి శుభాకాంక్షలు చెపుదామని ఫోన్ చేసా, “హాయ, దీపావళి శుభాకాంక్షలు”
”నీకు కూడా” “సాయంత్రానికి దివాళి సామాగ్రి సిద్దమా” “లేదు, నాకు దీపావళి జరుపుకోవడం ఇష్టం ఉండదు”
”ఎందుకలా??”
”ఆ మందుగుండు సామాగ్రి శివకాశిలో ఎవరు తయారు చేస్తారో తెలుసా, చిన్న పిల్లలు. ఒక వేళ తయారు చేసేటప్పుడు ప్రమాదమేదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు ఏమిటి”
”!!!” (ఇంక నేనేమి చెపుతా)
కృష్ణుని భోదతో అర్జునుడు నిర్వేదాన్ని వదిలేసినట్టు, అలా నేను ఆ సంవత్సరం దీపావళి జరుపుకోలేదు. ఇంక తరువాయి దీపావళి (2007) రానే వచ్చింది. ఈ దీపావళికి నేను జర్మనీలో ఉన్నా, అంటే పిల్లలు తయారు చేసే మందుగుండు సామాగ్రి ఎలాగూ దొరకదు. అంటే నా దీపావళికి తయారీదారుల నుంచి ఎలాంటి అడ్డూ లేదు. కానీ ఇంకో రెండు అడ్డంకులు
· ఉష్ణోగ్రత, అక్షరాలా సున్నా డిగ్రీలు. ప్రత్యేక వస్త్రధారణ లేకుండా అడుగు తీసి అడుగు వెయ్యడమే కష్టం ఇంక బయటకు వెళ్ళి మతాబులు, కాకరపువ్వొత్తులు కాల్చడమా!!!
· Nuisance, అవును నిజమే విన్నది నిజమే భారతదేశంలో రహదారి మీద సైతం క్రికెట్ ఆడుకోవచ్చు. కానీ జర్మనీలో ఇంటి బయట మతాబులు కాల్చినా పక్కింటివాళ్ళు మనకి విలన్లయ్యే అవకాశం ఉందే.
ఇందులో మొదటి దాన్ని ఎలాగూ మనం నియంత్రించలేము. ఇక చేతిలో ఉన్నది రెండో అడ్డంకి. అందుకే రెండోదాన్ని జయించి మొదటి అడ్డంకి చేతిలో ఓడిపోవడానికి నిశ్చయించుకున్నాం. (మొత్తం సుమారు పది మంది మరియు ఒక భారతీయ కుటుంబం ఉన్నాము అప్పటికి) సాదారణంగా రాత్రి ఏడింటికే అమ్మ నాన్న పెట్టిన తీపి తిని బాణాసంచా మొదలుపెట్టే వాళ్ళం కాస్తా దాన్ని రాత్రి తొమ్మిది తరువాతకి వాయిదా వేసాము. మళ్ళీ ఒంటి మీదకు రెండు కిలోల బరువు మోపి బయటకు వచ్చాము సున్నా నుంచి తగ్గిపోతున్న వాతావరణం లోనికి. సాధారణంగా గంట సేపైనా జరిపే బాణాసంచాను ఐదు నిమిషాలలో ముగించి లోపలికి పరుగుపెట్టాము. పిండి వంటల స్థానంలో పిజ్జాలు చేరాయి హిందూ దేవాలయం స్థానంలో చర్చి చేరింది కానీ పండగ స్ఫూర్తి మాత్రం నిలువెత్తు తారాజువ్వలా ఎగిసింది. మొత్తానికి దేవునికి క్షమాపణ చెప్పకుండానే పండుగ రోజు పని చేసి పండుగ చేసుకున్నాం.
జర్మన్ల “చెత్త” పద్దతులు:
చెత్త పద్దతులు అంటే పనికి రాని పద్దతులు అని కాదు, చెత్త సేకరించే పద్దతులు అని. అప్పుడెప్పుడో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు మీద వచ్చిన ఒక power point లో ఆయన ఎప్పుడో చెప్పారు. భారతదేశంలో ఉన్నంత సేపూ గుర్తు రాని నియమాలు పరాయిదేశం వెళ్ళగానే ఎలా గుర్తుకు వస్తున్నాయి. ఇంకా, జనాలకు సందేశమిచ్చే పేరుతో ఫక్తు వ్యాపార చిత్రాలు తీసే శంకర్ తన అపరిచితుడు చిత్రంలో ఒక సన్నివేశం పెట్టారు. ఒకడు రోడ్డు మీద ఉమ్మి వేస్తుంటే నాయకుడు దాన్ని ఒక ఫాలితీన్ కవర్ లో వేసి దాన్ని చెత్త బుట్టలో వెయ్యమంటాడు. (అపరిచితుడు చూసిన వాళ్ళకు ఈ సన్నివేశం గుర్తు ఉండే ఉంటుంది) చిన్నప్పుడు బడిలో చెప్పారు, పెద్దయ్యాక కళాశాలలో చెప్పారు, ఎక్కడ పని చేస్తున్నామో అక్కడా చెప్పారు “పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచండి” అని. భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా వీదికి ఒకటో లేక రెండు వీదులకు ఒకటో కనిపిస్తాయి. ఏంటో తెలుసా “చెత్త బుట్టలు”. కానీ బద్దకం ముందు పుట్టి తరువాత మనం పుట్టాము. అందుకే చెత్త బుట్టలో చేరవలసిన చెత్త మురుగు కాలువలలో చేరి పరిసరాలను నాశనం చేస్తోంది. దీనికి మిగతా దేశాలు ఏ పద్దతి అవలింబిస్తాయో తెలియదు కానీ, జర్మన్ల పద్దతి నాకు బాగా నచ్చింది. ప్రతీ ఇంటిలోనూ నాలుగు చెత్త బుట్టలు పెట్టుకోవాలి.
· మొదటిది, మిగిలిపోయిన ఆహార పదార్ధాల కోసం
· రెండవది, చిత్తు కాగితాల కోసం
· మూడవది, ప్లాస్టిక్ సంభందిత చెత్త కోసం
· నాలుగవది, పైన వేటి కిందకూ రానీ చెత్త కోసం
వారానికి ఒకసారి చెత్తను తీసుకువెళ్ళేవారు వస్తారు. వారు వచ్చే ముందు రోజు ప్రతీ ఇంటికి సంభందించిన చెత్త బుట్టలను రోడ్డు పక్క పెట్టాలి. (ఈ చెత్త బుట్టలు చక్రాలతో ప్రత్యేకంగా తయారు చేయబడినవి). చెత్త ముందే విభజన జరిగిపోవడం వల్ల recycling చెయ్యడం కూడా సులభం అవుతుంది.
అలాంటి దేశంలో మూడు నెలలు ఉండి వచ్చాక నాకు ఎందుకో రోడ్డు మీద వెయ్యాలనిపించడం లేదు. రోడ్డు మీద చెత్త వెయ్యబోతే అబ్దుల్ కలాం కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఏదైతేనేమి బడి, కళాశాల, ఆఫీస్ నేర్పనిది జర్మనీ నేర్పింది.
ఈ చెత్త సేకరణలో అమెరికన్లు కూడా వెనకబడే ఉన్నారనిపిస్తోంది నాకు అమెరికా వచ్చాక (పదిహేను రోజుల క్రితం వచ్చాను). అమెరికాలో ఒకటే చెత్త బుట్ట.
(వచ్చే జాబులో జర్మనీలో శాఖాహారుల కష్టాలు మరియు తిరుగు ప్రయాణ విశేషాలు)

No comments: