తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 3

(అక్టోబరు 2007 నుంచి డిసెంబరు 2007 నెలాఖరు వరకు జరిగిన విశేషాలు)

క్రైస్తవుల గురుంచి తెలుసుకున్న కొత్త విషయం:
(ఇందులో నా కల్పన ఏమీ లేదు ఒక మిత్రురాలు చెప్పిన సంగతి మాత్రమే)

"హిందువులకు సంవత్సరానికి ఎన్ని పండగలు?" ఆకాశంలో నక్షత్రాలెన్ని అన్నంత కష్టమైన ప్రశ్న ఇది, ఆ ప్రశ్న నాకు ఒక జర్మన్ ఉద్యోగ సహచరి నుండి వచ్చింది. ఏమి చెప్పాలో అర్ధం కాలేదు ఒక్క నిమిషం, వెంటనే తేరుకుని "నెలలో ఎంతలేదన్నా ఒక పది పండగలు" అన్నా, (ఒక్కసారి పంచాగమో లేక తెలుగు కాలెండరో ముందు వేసుకుని కూర్చోండి మీరు కూడా నిజమేనంటారు).
"అంటే నువ్వు పండగ రోజు కూడా ఇక్కడ పని చేస్తున్నావు"
"అంతే కదా మరి"
"అది పాపం కాదా?"
"పండగ రోజు పని మానమని ఏ దేవుడూ చెప్పడు కదా"
"బాప్తిజంలో పండగ రోజు పని చేస్తే చర్చికి వెళ్ళి దేవునికి క్షమాపణ చెప్పాలి"
"!!!!!" (పండుగకు ఎంత విలువిస్తున్నారబ్బా అనిపించింది మదిలో)
(కాసేపు నిశ్శబ్దం, కాసేపటికి తనే)
"దగ్గరలో మీకు ఏ పండగ ఉంది?"
"దీపావళి, దీపాల పండగ...... " అంటూ మొదలుపెట్టి దీపావళి గురుంచి వివరించా
(నిజానికి దీపావళి మన దేశంలో ఇంచుమించు అన్ని మతాలవారు జరుపుకుంటారు, నా దృష్టిలో అది జాతీయ పండగలలో ఒకటి)
అలా ఆ అంకం ముగిసింది, క్రైస్తవం గురుంచి కొత్త విషయం తెలిసింది.
(ఆ విషయం నిజమో కాదో నాకు తెలియదు, క్రైస్తవం తెలిసిన మిత్రులెవరైనా సందేహం తీరిస్తే సంతోషం)

క్రిష్టమస్ పండగ ముందు జర్మనీ (లేదా మరే ఇతర onsite అయినా) లో ఉన్న భారతీయులు చెయ్యవలసిన పనులు:

క్రిష్టమస్ అనగానే ఒక మూడు రోజులు వరసగా సెలవలు వస్తాయి కనుక తిండి సామాగ్రి ముందే కొనుక్కోవాలన్నమాట, లేదంటే కింద రాసినట్టు పండగ బాధితులవుతారు
శనివారం సాయంత్రం డిసెంబరు 23, 2007, (మామూలు శనివారం ఐతే షాప్స్ ఉంటాయి కానీ అది క్రిష్టమస్ ముందు శనివారం కావడంతో దురదృష్టం పలకరించిదన్న మాట) వండటానికి రూములో బియ్యం లేదు, కూరలు లేవు నిజానికి అప్పటి వరకు రూములో సరుకులు అయిపోతున్న సంగతి అప్పటివరకు తెలియదు. ఇంక, దాన్యం కోసం ఎలుక పిల్ల వెతికినట్టు రూములో ఏమైనా ఉన్నాయా అని వెతుకులాట ప్రారంభించాము. మా ప్రయత్నం ఫలించి మా రూము ఓనరు (మేమున్నది గెస్టు హౌస్ కాబట్టి వంట పాత్రలు, పడకలు తదితరములు వాళ్ళే అందిస్తారు) ఎప్పుడో మా కోసం ఉంచిన కేకు పిండి కనిపించింది. ఆహా రెండు రోజులు గడిపెయ్యచ్చు అనుకున్నాం. కేకు తయారీ రాదు కనుక దానితో చపాతీ చేసాం మొదట, అప్పడాల కన్నా ఘోరంగా వచ్చాయి. అయినా ఆకలిరాముని గోల తట్టుకోలేక అవే తిన్నాము. ఇంక ఆదివారం ఎలా???
మా రూమ్ ఓనరుకి జోహార్లు, క్రిష్టమస్ కాబట్టి అని ఒక బుట్ట నిండా పళ్ళు కేకులు తెచ్చి పెట్టాడు మాకు
భలే మంచి క్రిష్టమస్ పసందైన క్రిష్టమస్ అనుకుంటూ ఆనందంగా కడుపు నింపుకున్నాం, ఎలాగూ తర్వాతి రోజు సెలవు కాదు కనుక (ఆ సోమవారం కూడా సెలవైతే ఆకలి కష్టాలు పూర్తిగా కనిపించేవి)

మంచులో నడుక:

ఈ దారావాహిక మొదటి భాగంలో చెప్పాను కదా మా ఆఫీసుకి వెళ్ళడానికి రెండు కిలోమీటర్లు నడవాలి అని ( మా కోనేరు లక్ష్మయ్య కళాశలకు రోజుకు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్ళం). అప్పుడు చదువు కోసం, ఇప్పుడు పని కోసం
ఎండలో నడవడం సులభం, చలిలో కాదు అని కొన్ని రోజుల్లోనే అర్ధమయ్యింది.
పైనుంచి 35 నుంచి 45 డిగ్రీల మలమలా మాడే ఎండలో నడిస్తే మన వంటిలో నీరు మాత్రమే చెమట రూపంలో పోతుంది, ఇంకా కొవ్వు బాగా ఉంటే అది కూడా కరగవచ్చు.
కానీ -5 నుంచి 5 డిగ్రీల మద్య ఉష్ణోగ్రతలో నడవాలంటే, బోలెడు సరంజామా కావాలి, తలకు కోతిటోపి, ఒంటికి పాత సిన్మాలలో విలన్ల తరహా పొడుగాటి తోలుకోటు, చేతులు కాపాడుకోవటానికి ఆపరేషన్ చెయ్యబోయే ముందు వేసుకొనేట్టు గ్లవ్స్
ఇన్ని వేసుకొనే సరికి బరువు అమాంతం రెండు మూడు కిలోలు పెరుగుతుంది. చలికి శ్వాస తీసుకోవటమే కష్టమవుతూ ఉంటుంటే ఇంక నడక ఎలా సాగుతుంది.
దీనికి తోడు కార్యాలయ పని వేళలు ఎనిమిది నుండి ఆరు (ఐదే ఐనా ఇంకా ఎక్కువ సేపు ఉండవలసి వచ్చేది) కావడంతో నడిచే సమయంలో(7:30ఉదయం మరియు 6:00సాయంత్రం) చలి ఎక్కువ ఉంటుంది
ఇంక, అలాంటి సమయంలో పై నుంచి దేవుడు మంచు రూపంలో ఆశీర్వదిస్తే!!! అది దీవెన కాదు శాపం అనిపిస్తుంది.

(వచ్చే జాబులో జర్మనీలో దీపావళి సంబరాలు, జర్మన "చెత్త" పద్దతులు [చెత్త పద్దతులు అంటే పనికి రాని పద్దతులు అని కాదు, చెత్త సేకరించే పద్దతులు అని] , శాఖాహారుల కష్టాలు మరియు తిరుగు ప్రయాణ విశేషాలు)

2 comments:

BHARAT said...

మనం మనం ఒకటి , నేను కె.ఎల్.సి.ఈ నే

Sri said...

Germany marmalanni blog lo unchutunnaduku .. adi kooda acha telugulo .. abhinandaneeyulu