తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 5

జర్మనీలో శాఖాహారుల కష్టాలు:

ఆ మాటకి వస్తే జర్మనీనే కాదు, భారత ఉపఖండం దాటి ఎటు వెళ్ళినా శాఖాహారుల కష్టాలకు ఆరంభం మాత్రమే ఉంటుంది అంతే ఉండదు.
వంట వస్తే సరే కాలం గడపచ్చు కానీ వివిధ ప్రాంతాలు సందర్శించాలనుకుంటేనే...
బయట ఏ రెష్టారెంటుకి వెళ్ళినా శాఖాహారం కావాలంటే చెప్పే లిష్టు కొంచెం చిన్నగానే ఉంటుంది, ఎంత చిన్నగా అంటే మన సినిమాలలో కధానాయికలు (???) వేసుకొనే డ్రస్సంత.
మన అదృష్టం బాగుంటే ఆంగ్లం తెలిసినవారు వెయిటర్స్ అవుతారు లేదంటే పగలే చుక్కలు.
ఇంక ఆ లిష్టులో ఉండే ఆహార పదార్ధాలు

  • వంటిని తగ్గించుకోవటానికి తినే పచ్చి కూరగాయలు (ఇండియాలో పొరపాటున కూడా తినని మెనూ ఐటమ్ ఇది)
  • వంటిలో కొవ్వు పెంచే పోమోస్ (బంగాళా దుంపని సన్నగా పొడుగ్గా తరిగి చేసిన చిప్సు)
  • క్రిమిసంహారకాలుగా పిలవబడే కోలాలు

అందుకే జర్మనీలో ఎక్కడికి వెళ్ళాలన్నా శాఖాహారులు పచ్చి కూరగాయలు తినడానికి ముందే సిద్దమవ్వాలి. అదృష్టం బాగుంటే చక్కగా పిజ్జాలు దొరకవచ్చు.
ఇహ సూపర్ మార్కెట్లు పర్లేదు, చక్కగా కూరగాయలు దొరుకుతాయి.
భారతీయ షాపులు ఉండే పెద్ద నగరాల గురుంచి కాదు నేను చెప్పేది, జర్మనీలోని చిన్న పల్లెటూర్ల గురుంచి.
జర్మన్ల అభివృద్ది:

అప్పుడెప్పుడో ఫీనిక్స్ పక్షి గురుంచి ఒక రష్యన్ అనువాద పుస్తకంలో చదివాను, జర్మనీ వెళ్ళాకా దాన్ని చూసాను. జర్మనీ దేశమే ఒక ఫీనిక్స్ పక్షి.
పల్లెటూర్లంటే గుర్తుకు వచ్చింది. అది ఎంత చిన్న ఊరైనా సరే, సామాన్యుడు బతకడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
చక్కగా చదివనంతవరకు నాణ్యమైన ఉచిత విద్య (MS చేసే భారతీయులకు కూడా) , చక్కని రవాణా సదుపాయాలు, నడిచే వాళ్ళకు మరియు సైకిలుపై వెళ్ళేవారికి ప్రత్యేకమైన రహదారి. (పేరుకు అగ్ర రాజ్యమైన అమెరికాలో రవాణా సదుపాయాలను నిర్లక్ష్యం చేసినట్టు ఏ దేశమూ చేసి ఉండదు, చేయకూడదు. వీరు వాడే కార్లలో సగం తగ్గినా బోలెడు ఇంధనం ఆదా మరియు కాలుష్యం కూడా తగ్గుతుంది)
ఇప్పుడు ఇండియాలో ఇంటర్ చదివే వాడు కూడా నాకు బైకోబైకు అని గోలపెడతాడు కానీ జర్మనీలో ఆఫీస్ కి కూడా తొలి ద్విచక్రవాహనమైన సైకిలుపై వచ్చే వారు చాలా మంది ఉన్నారు.
ఎందుకో నాకు చాలా విషయాలలో అమెరికా కన్నా జర్మనీనే నచ్చింది. భారతదేశం కన్నా కాదు.

తిరుగు ప్రయాణం:
విరహం కన్నా తియ్యని మరియు భాధాకరమైన అనుభూతి ఏమీ ఉండదేమో. నాకప్పుడప్పుడనిపిస్తూంటుంది, "మనుషులను దూరం చేసి మనసులని దగ్గర చేసే విరహమే ప్రపంచానికవసరం" అని.
తిరిగి ఇండియాకి తిరిగివెళ్ళే రోజు దగ్గరపడే కొద్దీ చిన్నప్పుడు వేసవి సెలవుల కోసం ఎదురు చూసిన రోజులు గుర్తుకు వచ్చాయి. మళ్ళీ ఇంకో నెలలో వస్తా మిత్రమా అంటూ జర్మనీకి వీడుకోలు చెప్పి బయలుదేరాము. (మళ్ళీ నలభై రోజులకి జర్మనీకి వెళ్ళాము) ఇక జర్మనీ వెళ్ళేటప్పుడు విమాన ప్రయాణానుభవాన్ని గుర్తుంచుకుని నా మొబైల్ లో పాటలు పూర్తిగా లోడ్ చేసా. కానీ ఫ్రాంక్ ఫర్ట్ లో ఎదురుచూసే సమయంలో అనుకోకుండా "The Alchemist" అనే పుస్తకం కొన్నా. పుస్తకం తెరిస్తే నిద్ర పోతానేమో అనుకున్నా, కానీ నాకు విమాన ప్రయాణంలో చక్కని తోడు ఇచ్చింది ఆ పుస్తకమే. విమానం ఎక్కినప్పుడు మొదలు పెడితే దిగేసరికి పూర్తయ్యింది. ఇంకొన్ని పుటలు ఉంటే బాగుండు అనిపించింది. కాబట్టి విమాన ప్రయాణంలో బోరు కొట్టకూడదనుకుంటే పక్క వాడితో సుత్తైనా కొట్టాలి లేదా మంచి మజానిచ్చే పుస్తకమో చదవాలి. ఈ రెండు కుదరకపోతే కుంభకర్ణుడిలా నిద్ర పోవాలి. (ఇలా నిద్ర పోవాలంటే నాలా దేవుడి చేత ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయే వరం పొందని వారు, ప్రయాణానికి ముందు ఒక వారం పాటు నిద్రను తగ్గించాలి).

(నా తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు సమాప్తం, విదేశాలకు వెళ్ళివచ్చాక ఇండియాలో పడే పాట్లు తరవాతి జాబులో)


తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 4

2007 దీపావళి జర్మనీలో:
2006 దీపావళి, ఒక స్నేహితురాలికి దీపావళి శుభాకాంక్షలు చెపుదామని ఫోన్ చేసా, “హాయ, దీపావళి శుభాకాంక్షలు”
”నీకు కూడా” “సాయంత్రానికి దివాళి సామాగ్రి సిద్దమా” “లేదు, నాకు దీపావళి జరుపుకోవడం ఇష్టం ఉండదు”
”ఎందుకలా??”
”ఆ మందుగుండు సామాగ్రి శివకాశిలో ఎవరు తయారు చేస్తారో తెలుసా, చిన్న పిల్లలు. ఒక వేళ తయారు చేసేటప్పుడు ప్రమాదమేదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు ఏమిటి”
”!!!” (ఇంక నేనేమి చెపుతా)
కృష్ణుని భోదతో అర్జునుడు నిర్వేదాన్ని వదిలేసినట్టు, అలా నేను ఆ సంవత్సరం దీపావళి జరుపుకోలేదు. ఇంక తరువాయి దీపావళి (2007) రానే వచ్చింది. ఈ దీపావళికి నేను జర్మనీలో ఉన్నా, అంటే పిల్లలు తయారు చేసే మందుగుండు సామాగ్రి ఎలాగూ దొరకదు. అంటే నా దీపావళికి తయారీదారుల నుంచి ఎలాంటి అడ్డూ లేదు. కానీ ఇంకో రెండు అడ్డంకులు
· ఉష్ణోగ్రత, అక్షరాలా సున్నా డిగ్రీలు. ప్రత్యేక వస్త్రధారణ లేకుండా అడుగు తీసి అడుగు వెయ్యడమే కష్టం ఇంక బయటకు వెళ్ళి మతాబులు, కాకరపువ్వొత్తులు కాల్చడమా!!!
· Nuisance, అవును నిజమే విన్నది నిజమే భారతదేశంలో రహదారి మీద సైతం క్రికెట్ ఆడుకోవచ్చు. కానీ జర్మనీలో ఇంటి బయట మతాబులు కాల్చినా పక్కింటివాళ్ళు మనకి విలన్లయ్యే అవకాశం ఉందే.
ఇందులో మొదటి దాన్ని ఎలాగూ మనం నియంత్రించలేము. ఇక చేతిలో ఉన్నది రెండో అడ్డంకి. అందుకే రెండోదాన్ని జయించి మొదటి అడ్డంకి చేతిలో ఓడిపోవడానికి నిశ్చయించుకున్నాం. (మొత్తం సుమారు పది మంది మరియు ఒక భారతీయ కుటుంబం ఉన్నాము అప్పటికి) సాదారణంగా రాత్రి ఏడింటికే అమ్మ నాన్న పెట్టిన తీపి తిని బాణాసంచా మొదలుపెట్టే వాళ్ళం కాస్తా దాన్ని రాత్రి తొమ్మిది తరువాతకి వాయిదా వేసాము. మళ్ళీ ఒంటి మీదకు రెండు కిలోల బరువు మోపి బయటకు వచ్చాము సున్నా నుంచి తగ్గిపోతున్న వాతావరణం లోనికి. సాధారణంగా గంట సేపైనా జరిపే బాణాసంచాను ఐదు నిమిషాలలో ముగించి లోపలికి పరుగుపెట్టాము. పిండి వంటల స్థానంలో పిజ్జాలు చేరాయి హిందూ దేవాలయం స్థానంలో చర్చి చేరింది కానీ పండగ స్ఫూర్తి మాత్రం నిలువెత్తు తారాజువ్వలా ఎగిసింది. మొత్తానికి దేవునికి క్షమాపణ చెప్పకుండానే పండుగ రోజు పని చేసి పండుగ చేసుకున్నాం.
జర్మన్ల “చెత్త” పద్దతులు:
చెత్త పద్దతులు అంటే పనికి రాని పద్దతులు అని కాదు, చెత్త సేకరించే పద్దతులు అని. అప్పుడెప్పుడో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు మీద వచ్చిన ఒక power point లో ఆయన ఎప్పుడో చెప్పారు. భారతదేశంలో ఉన్నంత సేపూ గుర్తు రాని నియమాలు పరాయిదేశం వెళ్ళగానే ఎలా గుర్తుకు వస్తున్నాయి. ఇంకా, జనాలకు సందేశమిచ్చే పేరుతో ఫక్తు వ్యాపార చిత్రాలు తీసే శంకర్ తన అపరిచితుడు చిత్రంలో ఒక సన్నివేశం పెట్టారు. ఒకడు రోడ్డు మీద ఉమ్మి వేస్తుంటే నాయకుడు దాన్ని ఒక ఫాలితీన్ కవర్ లో వేసి దాన్ని చెత్త బుట్టలో వెయ్యమంటాడు. (అపరిచితుడు చూసిన వాళ్ళకు ఈ సన్నివేశం గుర్తు ఉండే ఉంటుంది) చిన్నప్పుడు బడిలో చెప్పారు, పెద్దయ్యాక కళాశాలలో చెప్పారు, ఎక్కడ పని చేస్తున్నామో అక్కడా చెప్పారు “పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచండి” అని. భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా వీదికి ఒకటో లేక రెండు వీదులకు ఒకటో కనిపిస్తాయి. ఏంటో తెలుసా “చెత్త బుట్టలు”. కానీ బద్దకం ముందు పుట్టి తరువాత మనం పుట్టాము. అందుకే చెత్త బుట్టలో చేరవలసిన చెత్త మురుగు కాలువలలో చేరి పరిసరాలను నాశనం చేస్తోంది. దీనికి మిగతా దేశాలు ఏ పద్దతి అవలింబిస్తాయో తెలియదు కానీ, జర్మన్ల పద్దతి నాకు బాగా నచ్చింది. ప్రతీ ఇంటిలోనూ నాలుగు చెత్త బుట్టలు పెట్టుకోవాలి.
· మొదటిది, మిగిలిపోయిన ఆహార పదార్ధాల కోసం
· రెండవది, చిత్తు కాగితాల కోసం
· మూడవది, ప్లాస్టిక్ సంభందిత చెత్త కోసం
· నాలుగవది, పైన వేటి కిందకూ రానీ చెత్త కోసం
వారానికి ఒకసారి చెత్తను తీసుకువెళ్ళేవారు వస్తారు. వారు వచ్చే ముందు రోజు ప్రతీ ఇంటికి సంభందించిన చెత్త బుట్టలను రోడ్డు పక్క పెట్టాలి. (ఈ చెత్త బుట్టలు చక్రాలతో ప్రత్యేకంగా తయారు చేయబడినవి). చెత్త ముందే విభజన జరిగిపోవడం వల్ల recycling చెయ్యడం కూడా సులభం అవుతుంది.
అలాంటి దేశంలో మూడు నెలలు ఉండి వచ్చాక నాకు ఎందుకో రోడ్డు మీద వెయ్యాలనిపించడం లేదు. రోడ్డు మీద చెత్త వెయ్యబోతే అబ్దుల్ కలాం కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఏదైతేనేమి బడి, కళాశాల, ఆఫీస్ నేర్పనిది జర్మనీ నేర్పింది.
ఈ చెత్త సేకరణలో అమెరికన్లు కూడా వెనకబడే ఉన్నారనిపిస్తోంది నాకు అమెరికా వచ్చాక (పదిహేను రోజుల క్రితం వచ్చాను). అమెరికాలో ఒకటే చెత్త బుట్ట.
(వచ్చే జాబులో జర్మనీలో శాఖాహారుల కష్టాలు మరియు తిరుగు ప్రయాణ విశేషాలు)

తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 3

(అక్టోబరు 2007 నుంచి డిసెంబరు 2007 నెలాఖరు వరకు జరిగిన విశేషాలు)

క్రైస్తవుల గురుంచి తెలుసుకున్న కొత్త విషయం:
(ఇందులో నా కల్పన ఏమీ లేదు ఒక మిత్రురాలు చెప్పిన సంగతి మాత్రమే)

"హిందువులకు సంవత్సరానికి ఎన్ని పండగలు?" ఆకాశంలో నక్షత్రాలెన్ని అన్నంత కష్టమైన ప్రశ్న ఇది, ఆ ప్రశ్న నాకు ఒక జర్మన్ ఉద్యోగ సహచరి నుండి వచ్చింది. ఏమి చెప్పాలో అర్ధం కాలేదు ఒక్క నిమిషం, వెంటనే తేరుకుని "నెలలో ఎంతలేదన్నా ఒక పది పండగలు" అన్నా, (ఒక్కసారి పంచాగమో లేక తెలుగు కాలెండరో ముందు వేసుకుని కూర్చోండి మీరు కూడా నిజమేనంటారు).
"అంటే నువ్వు పండగ రోజు కూడా ఇక్కడ పని చేస్తున్నావు"
"అంతే కదా మరి"
"అది పాపం కాదా?"
"పండగ రోజు పని మానమని ఏ దేవుడూ చెప్పడు కదా"
"బాప్తిజంలో పండగ రోజు పని చేస్తే చర్చికి వెళ్ళి దేవునికి క్షమాపణ చెప్పాలి"
"!!!!!" (పండుగకు ఎంత విలువిస్తున్నారబ్బా అనిపించింది మదిలో)
(కాసేపు నిశ్శబ్దం, కాసేపటికి తనే)
"దగ్గరలో మీకు ఏ పండగ ఉంది?"
"దీపావళి, దీపాల పండగ...... " అంటూ మొదలుపెట్టి దీపావళి గురుంచి వివరించా
(నిజానికి దీపావళి మన దేశంలో ఇంచుమించు అన్ని మతాలవారు జరుపుకుంటారు, నా దృష్టిలో అది జాతీయ పండగలలో ఒకటి)
అలా ఆ అంకం ముగిసింది, క్రైస్తవం గురుంచి కొత్త విషయం తెలిసింది.
(ఆ విషయం నిజమో కాదో నాకు తెలియదు, క్రైస్తవం తెలిసిన మిత్రులెవరైనా సందేహం తీరిస్తే సంతోషం)

క్రిష్టమస్ పండగ ముందు జర్మనీ (లేదా మరే ఇతర onsite అయినా) లో ఉన్న భారతీయులు చెయ్యవలసిన పనులు:

క్రిష్టమస్ అనగానే ఒక మూడు రోజులు వరసగా సెలవలు వస్తాయి కనుక తిండి సామాగ్రి ముందే కొనుక్కోవాలన్నమాట, లేదంటే కింద రాసినట్టు పండగ బాధితులవుతారు
శనివారం సాయంత్రం డిసెంబరు 23, 2007, (మామూలు శనివారం ఐతే షాప్స్ ఉంటాయి కానీ అది క్రిష్టమస్ ముందు శనివారం కావడంతో దురదృష్టం పలకరించిదన్న మాట) వండటానికి రూములో బియ్యం లేదు, కూరలు లేవు నిజానికి అప్పటి వరకు రూములో సరుకులు అయిపోతున్న సంగతి అప్పటివరకు తెలియదు. ఇంక, దాన్యం కోసం ఎలుక పిల్ల వెతికినట్టు రూములో ఏమైనా ఉన్నాయా అని వెతుకులాట ప్రారంభించాము. మా ప్రయత్నం ఫలించి మా రూము ఓనరు (మేమున్నది గెస్టు హౌస్ కాబట్టి వంట పాత్రలు, పడకలు తదితరములు వాళ్ళే అందిస్తారు) ఎప్పుడో మా కోసం ఉంచిన కేకు పిండి కనిపించింది. ఆహా రెండు రోజులు గడిపెయ్యచ్చు అనుకున్నాం. కేకు తయారీ రాదు కనుక దానితో చపాతీ చేసాం మొదట, అప్పడాల కన్నా ఘోరంగా వచ్చాయి. అయినా ఆకలిరాముని గోల తట్టుకోలేక అవే తిన్నాము. ఇంక ఆదివారం ఎలా???
మా రూమ్ ఓనరుకి జోహార్లు, క్రిష్టమస్ కాబట్టి అని ఒక బుట్ట నిండా పళ్ళు కేకులు తెచ్చి పెట్టాడు మాకు
భలే మంచి క్రిష్టమస్ పసందైన క్రిష్టమస్ అనుకుంటూ ఆనందంగా కడుపు నింపుకున్నాం, ఎలాగూ తర్వాతి రోజు సెలవు కాదు కనుక (ఆ సోమవారం కూడా సెలవైతే ఆకలి కష్టాలు పూర్తిగా కనిపించేవి)

మంచులో నడుక:

ఈ దారావాహిక మొదటి భాగంలో చెప్పాను కదా మా ఆఫీసుకి వెళ్ళడానికి రెండు కిలోమీటర్లు నడవాలి అని ( మా కోనేరు లక్ష్మయ్య కళాశలకు రోజుకు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్ళం). అప్పుడు చదువు కోసం, ఇప్పుడు పని కోసం
ఎండలో నడవడం సులభం, చలిలో కాదు అని కొన్ని రోజుల్లోనే అర్ధమయ్యింది.
పైనుంచి 35 నుంచి 45 డిగ్రీల మలమలా మాడే ఎండలో నడిస్తే మన వంటిలో నీరు మాత్రమే చెమట రూపంలో పోతుంది, ఇంకా కొవ్వు బాగా ఉంటే అది కూడా కరగవచ్చు.
కానీ -5 నుంచి 5 డిగ్రీల మద్య ఉష్ణోగ్రతలో నడవాలంటే, బోలెడు సరంజామా కావాలి, తలకు కోతిటోపి, ఒంటికి పాత సిన్మాలలో విలన్ల తరహా పొడుగాటి తోలుకోటు, చేతులు కాపాడుకోవటానికి ఆపరేషన్ చెయ్యబోయే ముందు వేసుకొనేట్టు గ్లవ్స్
ఇన్ని వేసుకొనే సరికి బరువు అమాంతం రెండు మూడు కిలోలు పెరుగుతుంది. చలికి శ్వాస తీసుకోవటమే కష్టమవుతూ ఉంటుంటే ఇంక నడక ఎలా సాగుతుంది.
దీనికి తోడు కార్యాలయ పని వేళలు ఎనిమిది నుండి ఆరు (ఐదే ఐనా ఇంకా ఎక్కువ సేపు ఉండవలసి వచ్చేది) కావడంతో నడిచే సమయంలో(7:30ఉదయం మరియు 6:00సాయంత్రం) చలి ఎక్కువ ఉంటుంది
ఇంక, అలాంటి సమయంలో పై నుంచి దేవుడు మంచు రూపంలో ఆశీర్వదిస్తే!!! అది దీవెన కాదు శాపం అనిపిస్తుంది.

(వచ్చే జాబులో జర్మనీలో దీపావళి సంబరాలు, జర్మన "చెత్త" పద్దతులు [చెత్త పద్దతులు అంటే పనికి రాని పద్దతులు అని కాదు, చెత్త సేకరించే పద్దతులు అని] , శాఖాహారుల కష్టాలు మరియు తిరుగు ప్రయాణ విశేషాలు)

తొలి జర్మనీ ప్రయాణ విశేషాలు – 2

"మాతృభాష మధురం, మరి పరాయి భాష? ఘాటుగానా లేక కమ్మగానా ఉండేది?" కమ్మగానే ఉండాలని కోరుకుందాం.
ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే, నా German laptop గురించిన ఉపోద్ఘాతం గురుంచి. నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరికలలో ఉన్న ఒకానొక కోరిక laptop ఒకటి కొనడం, కానీ భారతదేశంలో ఉన్నంతసేపు నా దగ్గర డబ్బులు లేకపోయె,
ఇక Germany లో అడుగు పెట్టిన తర్వాత జీతం రూపంలో డబ్బులు మన ఖాతాలో చేరాయి, మనసులో ఎప్పటి నుంచో ఉన్న కోరిక రెక్కలు తొడిగి ఎగరసాగింది. ఇంక కొనాల్సిందే అని నిర్ణయం తీసుకుని షాప్ కి వెళ్ళాము.
ఇక్కడ ఒక సంగతి చెప్పాలి, Germany లో అడుగు పెట్టిన మొదటి వారం పెరుగు కొందామని super market కి వెళ్ళాము, అక్కడ అన్నీ German భాషలోనే రాసి ఉన్నాయి (తమిళనాట అన్నీ తమిళంలోనే ఉండేడట్టు అన్నమాట). ఎవరినీ అడిగినా German తప్ప ఆంగ్లం తెలియదన్నారు. ఇంక ఒక అరగంట కుస్తీలు పట్టాక బొమ్మల ఆధారంగా ఒక డబ్బా తెచ్చాము, కానీ అది పెరుగు కాదు పాలు అని తెరిచాకా కానీ తెలియలేదు.

ఇప్పుడు వెళ్ళింది laptop కొనటానికి కాబట్టి ఆ సమస్య ఉండదనే ఆశతో వెళ్ళాము. కానీ జర్మన్ల మాతృభాషా మమకారం ఎలా ఉందంటే వాళ్ళకు పూర్తిగా వేరే keyboard layouts and software అనే ప్రపంచం ఉంది (నిజానికి యూరోపియన్ దేశాలన్నీ ఇంతే).
ఎలాగూ ఇంకో పది వారాలలో India వెళ్తావు, ఎందుకు కంగారు అని మెదడు చెప్తూనే ఉన్నా, మనసు వింటేనా మొత్తానికి కొనేసా, ఇంటికి తెచ్చి దాన్ని తెరిస్తే German windows "Willkommen" అంది.
నా windows ని నాకు కావల్సినట్టుగా మార్చుకుందామంటే అన్నీ నాకు అర్ధం కాని German లోనే ఉన్నాయి. ఇక అది browsing కి తప్ప ఎందుకూ పనికి రాకుండా తయారు అయ్యింది. ఇలా లాభం లేదని microsoft వారికి మెయిలు చేసా, ఆంగ్లంలోకి ఎలా మార్చాలి అని, వారు మాకు సంభందం లేదు, నువ్వు కొన్న తయారీదారుడిని అడుగు అని సమాధానం పంపారు. చేసేదేమీ లేక HP వారికి మెయిలు చేస్తే మీరు VISTA ultimate కొనుక్కోవాల్సిందే అని తేల్చిపారేశారు. ఇక German నేర్చుకోలేక, నా laptop ని నాకు కావల్సినట్టుగా వాడలేక ఇక ఇలా లాభం లేదని India లో అందరూ చేసే పనే నేను చెయ్యాల్సి వచ్చింది. అప్పుడెప్పుడొ నేను microsoft నుంచి దిగుమతి చేసుకున్న Vista English version ని install చేసా. మొత్తానికి ఒక సమస్య పరిష్కారమయ్యింది, కానీ మరో సమస్య మిగిలిపోయింది, అదే keyboard, నాకు ఎలాగూ keyboard ని చూడకుండా type చెయ్యడం అలవాటు కాబట్టి నా వరకు సమస్య లేకపోయింది, కానీ వేరే ఎవరైనా నా laptop ని వాడాల్సివస్తే!!! సరేలే అదేదో మయసభలాగ ఉంటుంది అని నన్ను సమాధాన పర్చుకుని నా laptop ని వాడటం మొదలు పెట్టాను (దీన్ని అమ్ముదామన్నా ఎవడూ కొనడు అన్న ఆలోచన చెయ్యలేదు, అమ్మో ఆలోచిస్తే ఇంకేమైనా ఉందా) . కానీ నా German laptop వల్ల కలిగిన ఉపయోగాలు, నాకు కూడా German భాషలో కొన్ని చిన్న చిన్న పదాలు తెలిసాయి. ఏది ఐతేనేమి, నా laptop వల్ల నాకు కళ్ళు మూసుకుని type చెయ్యడం అలవాటు అయ్యింది.

అదికార కేంద్రాల సమరం:

రాజు (manager) చెయ్యాల్సిన పని మంత్రే (tech lead) చేస్తానంటే, మంత్రి చెయ్యాల్సిన పని కూడా రాజు చేస్తానంటే ఆ రాజ్యం పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా గందరగోళమే, రాజ్య సభలో సహాయ మంత్రులెవరికీ (engineers) ఏమి చెయ్యాలో అర్ధం కాదు. అలాంటి గందరగోళ పరిస్థితిలో ఎవరి పక్షాన నిలవాలి, తెలివి వైపు నిలవాలో అదికారం వైపు నిలవాలో తెలియని స్థితి. ఒకడేమో చెయ్యమంటాడు, ఇంకోడు ఎందుకు చేసావంటాడు. ఏమి చేస్తాం, అధికారం వైపు నిలుస్తూ తెలివికి చేయూతనివ్వడం తప్ప. (ఈ పది వారాలు ముగిసే సరికి, ఆ మంత్రి రాజీనామా చేసి వెల్లిపోయాడు, అది వేరే సంగతి)
ఒకరు నియమాలు పాటించమంటారు, ఒకరు ఫలితం చాలంటారు. కాబట్టి మనం చెయ్యాల్సిన పని ఏమంటే, మనం కూడా విప్లవకారులతో కలవడం లేదా జోడు గుర్రాల స్వారీ చెయ్యడం. చివరకు జోడు గుర్రాల స్వారీకే మొగ్గు చూపాము. అలా ఒకరిని నొప్పించక తానొవ్వక (అసలు పద్యం నాకు గుర్తు లేదు) పది వారాలు జర్మనీలో ఆనందించాము.

ఆకర్షణీయ నగరం పారిస్:

"మనిసన్నాక కూసింత కళా పోషణ కూడా ఉండాలి" అన్నారు కదా, ఆ స్కీములో పారిస్ వెళ్ళాము. పారిస్ అనగానే అంతకుముందే వెళ్ళిన మా బన్నీ మరియు సత్తి గారి సలహాలు విని ముందుగా "Tom Hanks నటించిన The Davinci Code" చిత్రరాజం చూసాను. చూసాక ఈ మ్యూజియం చూసి తీరవలసిందే అని గట్టిగా తీర్మానించుకుని మరీ బయలుదేరాను. పారిస్ అంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది ఈఫిల్ టవర్. దాన్ని కట్టడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేకపోయినా దానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ అలాంటిది. అందుకే ఆ ఈఫిల్ టవర్ ని చూడగానే నాకు "నదీ తీరాన నగర మధ్యన గురి చూసి సంధించాడు మన్మధుడు తన బాణాన్ని" అనిపించింది (access origianl post here). కానీ నిజానికి ఈఫిల్ టవర్ కేవలం ఆ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించటానికే కానీ పారిస్ లో చూడవలసిన విశేషాలు చాలా ఉన్నాయని, ఈఫిల్ టవర్ కోసం మూడు గంటలు వృధా చేయబోతున్నామని తెలియకనే పారిస్ నగారాన్నిశనివారం ఉదయానికి చేరాము. నగరం చూడటానికి మధ్యాహ్నం బయలుదేరాము. బయలుదేరి ఒపెరా ఇంటిని చూసి, ఈఫిల్ టవర్ వద్దకు చేరాము. ఈఫిల్ టవర్ కి మొత్తము రెండు అంతస్తులట, సరే అని పైకే ఎక్కాము. పైకి వెళ్ళాక దారి తప్పి మా ఊరి శివరాత్రి ఉత్సవాలకు వచ్చానా అని సందేహం వచ్చింది. సుమారు పది అడుగుల వెడల్పుతో ఉన్న ప్రదేశం అది. అంత చిన్న ప్రదేశంలో సుమారు రెండు వందల మంది ఆ ప్రదేశంలో తమ సాయంత్రాన్ని ఆనందించాలని ఆత్రుత పడుతున్నారు. ఇక కొత్తగా వచ్కిన వారికి నుంచునే స్థలం కూడా లేకుండా!!!. ఎలాగో కాసేపు ఉండి, ఇక ఉండలేక దిగి హోటలుకి వెళ్ళి నిద్రపోయాము.

ఆదివారం ఉదయాన్నే బయలుదేరి మ్యూజియంకి వెళ్ళాము (ప్రతీ నెలా మొదటి ఆదివారం మ్యూజియంకి ఉచితప్రవేశం). కానీ మాకు ఉన్నది కేవలం మూడు గంటలు, మూడు రోజులు పట్టే మ్యూజియాన్ని తెలుగు సినిమాని అరగంటలో చూసినట్టు చూద్దామని విఫల ప్రయత్నం చేసాము. కానీ కనీసం సగం కూడా చూడలేకపోయాము. అందుకే నాకు అనిపిస్తుంది "కాలమనే రక్కసిని ఓడించాలని ప్రయత్నించా చివరకు నేనే ఓడిపోయా" అని. కనీసం పారిస్ లో ఉన్న మ్యూజియముల కోసమైనా మరోసారి పారిస్ వెళ్ళాలి, కానీ ఎప్పుడు ఆ అదృష్టం!!!. అలా మా పారిస్ యాత్ర ముగిసింది.


మళ్ళీ వచ్చే జాబులో మరిన్ని విశేషాలు (మంచులో నడక...తిరుగు ప్రయాణ విశేషాలు)